Tollywood: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లంతా నటించిన సీరియల్ ఏదో తెలుసా!.. ఆ సీరియల్ అందరికి ఫేవరట్ కూడా..
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. మరోవైపు, ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్‌గా వెలుగొందిన పూరీ జగన్నాథ్ వరుస పరాజయాలతో సతమతమవుతూ, తన తదుపరి సినిమాకు సరైన హీరోని వెతుక్కుంటున్నారు. క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ప్రస్తుతం ధనుష్, నాగార్జునలతో కలిసి 'కుబేర' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ముగ్గురు డైరెక్టర్లు ఒకసారి సూపర్ హిట్ కామెడీ క్లాసిక్ 'అమృతం' సీరియల్‌లో గెస్ట్ రోల్‌లో కనిపించారు.
ఎస్.ఎస్. కంచి రాజమౌళి కుటుంబానికి చెందినవారు
'అమృతం' సీరియల్‌కి గుర్రం గంగరాజు రచన, నిర్మాతగా వ్యవహరించగా, కొన్ని ఎపిసోడ్లను చంద్రశేఖర్ ఏలేటి డైరెక్ట్ చేశారు. ఈ సీరియల్‌లో రాజమౌళి భార్య రమా రాజమౌళి కూడా నటించారు. 'అమృతం'లో కనిపించిన ఎస్.ఎస్. కంచి కూడా రాజమౌళి కుటుంబానికి చెందినవారే . ఈ సీరియల్‌కు మ్యూజిక్ అందించింది ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తమ్ముడు కళ్యాణి మాలిక్. టాలీవుడ్‌కి చెందిన పలువురు టెక్నీషియన్లు, స్టార్లు 'అమృతం'లో ప్రత్యేక పాత్రలు పోషించడం విశేషం. ఒక ఎపిసోడ్‌లో అమృతం, ఆంజనేయులు టాలీవుడ్ టాప్ డైరెక్టర్లను ఇంటర్వ్యూ చేయడానికి వెళతారు. ఈ ప్రత్యేక ఎపిసోడ్ టాలీవుడ్ వజ్రోత్సవాల సందర్భంగా ప్రసారమైంది.
పూరీ జగన్నాథ్ ఫేవరెట్ డైరెక్టర్ మణిరత్నం
ఈ ఎపిసోడ్‌లో రాజమౌళి, పూరీ జగన్నాథ్, కృష్ణవంశీ, శేఖర్ కమ్ముల, నీలకంఠ పాల్గొని తమ ఫేవరెట్ సినిమాలు, డైరెక్టర్లు, హీరోయిన్ల గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. కృష్ణవంశీ తన ఫేవరెట్ సినిమాగా 'అల్లూరి సీతారామరాజు', డైరెక్టర్‌గా రామ్ గోపాల్ వర్మ, హీరోయిన్ సావిత్రి అని చెప్పారు. పూరీ జగన్నాథ్ 'మిస్సమ్మ' తనకు ఇష్టమైన సినిమా అని, మణిరత్నం ఫేవరెట్ డైరెక్టర్ అని, శ్రీదేవి ఫేవరెట్ హీరోయిన్ అని తెలిపారు. రాజమౌళి మాత్రం 'మాయబజార్' తన ఫేవరెట్ మూవీగా, కె. రాఘవేంద్రరావు ఫేవరెట్ డైరెక్టర్‌గా, సూర్యకాంతం ఫేవరెట్ హీరోయిన్‌గా పేర్కొన్నారు. శేఖర్ కమ్ముల, నీలకంఠలు తమ ఇష్టమైన సినిమాలు, డైరెక్టర్లు, హీరోయిన్ల గురించి చెప్పి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
'రంగమార్తాండ' తర్వాత కొత్త ప్రాజెక్ట్ ప్రకటించని కృష్ణవంశీ
ఈ సీరియల్‌లో రమ్యకృష్ణ కూడా ఓ ప్రత్యేక ఎపిసోడ్‌లో గెస్ట్ పాత్రలో కనిపించారు. మరోవైపు, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తన చివరి చిత్రం 'రంగమార్తాండ' తర్వాత కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు. నీలకంఠ, 9 ఏళ్ల విరామం తర్వాత 'సర్కిల్' అనే చిత్రంతో మళ్లీ ప్రయత్నం చేసినా, అది ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు.