Page Loader
Kamal Haasan: వివాదంలో కమల్ హాసన్.. 'కన్నడ తమిళం నుంచి పుట్టింది' అని కామెంట్స్..
వివాదంలో కమల్ హాసన్.. 'కన్నడ తమిళం నుంచి పుట్టింది' అని కామెంట్స్..

Kamal Haasan: వివాదంలో కమల్ హాసన్.. 'కన్నడ తమిళం నుంచి పుట్టింది' అని కామెంట్స్..

వ్రాసిన వారు Sirish Praharaju
May 28, 2025
10:07 am

ఈ వార్తాకథనం ఏంటి

భాషపై ఆత్మీయతకు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ప్రసిద్ధి. ఇలాంటి ప్రాంతాల్లో భాషాసంబంధిత విషయాలు చర్చించేప్పుడు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ ప్రముఖ నటుడు కమల్ హాసన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు కర్ణాటక వ్యాప్తంగా తీవ్ర అభ్యంతరాలకు గురవుతున్నాయి. చెన్నైలో జరిగిన ఆయన తాజా చిత్రం "థగ్ లైఫ్" ప్రమోషన్ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ''కన్నడ భాష తమిళం నుంచి ఉద్భవించింది'' అనే ఆయన వ్యాఖ్యలపై కన్నడ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వివరాలు 

ఉయిరే ఉరవే తమిజే

ఈ కార్యక్రమంలో కమల్ హాసన్ మాట్లాడుతూ, ''ఉయిరే ఉరవే తమిజే'' అని స్వయంగా తెలిపారు. దీని అర్థం ''నా జీవితం, నాకుటుంబం తమిళమే''. ఈ వేదికపై కన్నడ టాప్ హీరో శివరాజ్ కుమార్ కూడా హాజరయ్యారు. ఆయనను ఉద్దేశించి కమల్ హాసన్ మాట్లాడుతూ, ''శివరాజ్ కుమార్ వేరే రాష్ట్రంలో నివసిస్తున్న నా కుటుంబ సభ్యుడు. అందుకే ఆయన ఈ వేదికపై ఉన్నారు. నేను నా ప్రసంగాన్ని 'నా జీవితం, నా కుటుంబం తమిళం' అని ప్రారంభించాను. మీ భాష అయిన కన్నడ కూడా తమిళ భాష నుంచి పుట్టింది. అందుకే మీరు కూడా నా కుటుంబంలో భాగమే'' అని వ్యాఖ్యానించారు.

వివరాలు 

కర్ణాటకలో తీవ్ర వ్యతిరేకత

అయితే కమల్ హాసన్ చేసిన ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర వ్యతిరేకతను రేపాయి. కన్నడ రక్షణ వేదిక లాంటి భాషాప్రేమిక సంస్థలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. కమల్ ఇలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయంటూ హెచ్చరించాయి. ఆ సంస్థ నేత ప్రవీణ్ శెట్టి మాట్లాడుతూ, ''కమల్ హాసన్ చెబుతున్న మాటలతో అతను తమిళ భాషను కన్నడ కంటే పైస్థాయిలో ఉంచుతున్నట్టు స్పష్టం అవుతుంది. కన్నడ తమిళం తరువాత పుట్టినదని ఆయన అంటున్నారు. మీకు కర్ణాటకలో సినిమాల బిజినెస్ చేయాలా..? అయినా కూడా కన్నడ భాషను ఇలా విమర్శిస్తున్నారా?'' అంటూ మండిపడ్డారు. ఇలాగే కొనసాగితే, కమల్ హాసన్ సినిమాలను రాష్ట్రవ్యాప్తంగా నిషేధిస్తామని హెచ్చరించారు.

వివరాలు 

కర్ణాటకలో కమల్ హాసన్ పూర్తిగా బహిష్కరిస్తాం 

కమల్ హాసన్ తన సినిమాను ప్రమోట్ చేయడానికి బెంగళూరులోని ఓ వేదికపై పాల్గొనబోతున్నారని తెలుసుకున్న కన్నడ అనుకూల సంఘాల కార్యకర్తలు అక్కడ గుమిగూడారు. ఆయనపై నల్ల సిరా విసిరి నిరసనను తెలియజేయాలని భావించారు. అయితే తమ వ్యూహం కమల్‌కు తెలిసినట్టు తెలుస్తోంది. దీంతో కమల్ ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారని నిరసనకారులు తెలిపారు. కమల్ హాసన్ తన వ్యాఖ్యలపై సరైన వివరణ ఇవ్వకపోతే, లేదా క్షమాపణ చెప్పకపోతే, అతని సినిమాలను కర్ణాటకలో పూర్తిగా బహిష్కరించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.