Page Loader
Nagarjuna: ఏ ఇండస్ట్రీ కూడా అన్నివేళలా అగ్రస్థానంలో ఉండదు: నాగార్జున 
ఏ ఇండస్ట్రీ కూడా అన్నివేళలా అగ్రస్థానంలో ఉండదు: నాగార్జున

Nagarjuna: ఏ ఇండస్ట్రీ కూడా అన్నివేళలా అగ్రస్థానంలో ఉండదు: నాగార్జున 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 14, 2025
12:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ అగ్రనటుడు నాగార్జున త్వరలో 'కుబేర' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయనతో పాటు ధనుష్ ముఖ్యపాత్రలో నటించిన ఈ చిత్రం జూన్ 20న విడుదల కానుంది. సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న నాగార్జున, ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమకు సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ, సినిమా పరిశ్రమలో ఎప్పటికీ ఒకే విధమైన పరిస్థితులు ఉండవని, ఒడిదొడుకులు సహజమని చెప్పారు. బాలీవుడ్‌, టాలీవుడ్‌ వంటి పరిశ్రమల్లో ఎవరూ శాశ్వతంగా అగ్రస్థానంలో ఉండలేరని స్పష్టం చేశారు. దక్షిణాది చిత్ర పరిశ్రమతో పోలిస్తే బాలీవుడ్ వెనుకబడుతోంది కదా? అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, కాలానుగుణంగా పరిస్థితులు మారతాయని చెప్పారు.

వివరాలు 

ప్రేక్షకుల అభిరుచులు మారుతూ ఉంటాయి

''ఒక నటుడు, దర్శకుడి కెరీర్‌లో 4 నుంచి 5 సంవత్సరాల వరకూ కొంతకాలం నిరుత్సాహకరమైన సమయం ఉండొచ్చు. ఆ సమయంలో వాళ్ల సినిమాలు విజయాన్ని సాధించకపోవచ్చు. కానీ దానిని బట్టి మొత్తం సినిమా పరిశ్రమ వెనుకబడి పోతోందని భావించడం సరికాదు. ప్రేక్షకుల అభిరుచులు మారుతూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో 'టూరిస్ట్ ఫ్యామిలీ', 'కోర్టు', అలాగే ఓటీటీలో 'అనగనగా' వంటి సినిమాలు మంచి ఆదరణ పొందుతున్నాయి. కాబట్టి ప్రేక్షకుల అభిరుచులను పరిగణలోకి తీసుకుని దర్శక నిర్మాతలు కొత్త కథలు తయారు చేయాలి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సినిమాలు రూపొందించాల్సిన అవసరం ఉంది'' అని నాగార్జున తెలిపారు.

వివరాలు 

కూలీలో అతిథి పాత్రలో ఆమిర్ ఖాన్

ప్రస్తుతం నాగార్జున వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన 'కుబేర' సినిమాలో ఆయన కీలకపాత్రలో నటించారు. అలాగే, రజనీకాంత్ నటిస్తున్న 'కూలీ' అనే చిత్రంలోనూ నాగార్జున ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో తన లుక్ చాలా ప్రత్యేకంగా ఉండబోతుందంటూ ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని చెప్పారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్న విషయం కూడా ఆయన వెల్లడించారు.