
Supreme Court:ఆధార్ కూడా దరఖాస్తులో చేర్చండి.. బీహార్ SIRపై ECకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సర్వేపై ప్రతిపక్ష పార్టీల ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. పార్లమెంట్ లోక్‌సభ, రాజ్యసభల్లోనూ ఈ అంశంపై విపక్షాలు నిరసనలు తెలిపాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బీహార్‌లో ఓటర్ యాత్రను నిర్వహించారు. ప్రత్యేక సర్వే అనంతరం 65 లక్షల ఓట్లను తొలగించారని ఆరోపిస్తూ, ఇందుకు వ్యతిరేకంగా ఇండియా కూటమి పోరాటం కొనసాగిస్తోంది. ఎన్నికల సంఘం అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తోందని వారు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
వివరాలు
11 గుర్తింపు పత్రాల్లో ఆధార్‌ను తప్పనిసరిగా చేర్చాలని ఎన్నికల సంఘానికి ధర్మాసనం సూచన
ఈ పరిణామాల మధ్య సుప్రీంకోర్టు కూడా అంశాన్ని పరిశీలించింది. బీహార్‌లో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సమయంలో ఓటర్లు సమర్పించే 11 గుర్తింపు పత్రాల్లో ఆధార్‌ను తప్పనిసరిగా చేర్చాలని ఎన్నికల సంఘానికి ధర్మాసనం సూచించింది. అలాగే, సవరణ సమయంలో ఓటర్ల పేర్లు తొలగించబడితే వాటిని సరిచేయడంలో రాజకీయ పార్టీలు ముందుకు రాకపోవడంపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. బూత్-లెవల్ ఏజెంట్లకు స్థానికుల పరిస్థితులు, వారి అసలు గుర్తింపు బాగా తెలుసునని కోర్టు వ్యాఖ్యానించింది. వలసదారుడు ఎవరో, స్థానికుడు ఎవరో వారికే స్పష్టంగా అవగాహన ఉంటుందని అభిప్రాయపడింది.
వివరాలు
తొలగించిన వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశం
గత గురువారం బీహార్ ఓటర్ల జాబితా సవరణపై ఎన్నికల సంఘం నివేదికను సుప్రీంకోర్టులో సమర్పించింది. ప్రత్యేక సర్వే తర్వాత 65లక్షల పేర్లను తొలగించినట్లు తెలిపింది. అయితే ఈ వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచాలని కోర్టు ఆదేశించింది. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ఆగస్టు 19 వరకు గడువు విధించింది.అంతేకాకుండా, పౌరులు తమ ఆధార్ కార్డు ప్రతిని దరఖాస్తులో జత చేయవచ్చని స్పష్టంగా తెలియజేయాలని ఎన్నికల సంఘానికి సూచించింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వెబ్‌సైట్‌లో రాష్ట్ర స్థాయి ఓటర్ల జాబితాను కూడా అందుబాటులో ఉంచాలని ధర్మాసనం ఆదేశించింది.
వివరాలు
ఈసీ ప్రత్యేక ఫోకస్
ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ లేదా నవంబర్‌లో జరగనున్నాయి. తుది ఓటర్ల జాబితాను సెప్టెంబర్‌లో ప్రకటించనుంది. దాని అనంతరం ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ దిశగా ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతూ, విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతున్నాయి.