Page Loader
Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌
పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌

Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 04, 2025
11:41 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌ కోసం గూఢచర్యం (Spying) వ్యవహారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇప్పటి వరకు హర్యానా, పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో కనీసం 16 మంది భారతీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో విద్యార్థులు, వ్యాపారవేత్తలు, యూట్యూబర్లు, సెక్యూరిటీ గార్డులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉండటం గమనార్హం. తాజాగా మరో యూట్యూబర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

వివరాలు 

పాక్‌ ఐఎస్‌ఐతో సంబంధాలపై యూట్యూబర్‌ అరెస్ట్ 

పంజాబ్‌కు చెందిన యూట్యూబర్‌ జస్బీర్‌ సింగ్‌ను పాక్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై బుధవారం పంజాబ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన రూప్‌నగర్‌ జిల్లాలోని మహలాన్‌ గ్రామానికి చెందినవాడు. మొహాలీలో ఉన్న స్టేట్‌ స్పెషల్‌ ఆపరేషన్స్‌ సెల్‌ (SSOC) అధికారులు ఈ అరెస్టు చేపట్టారు. గూఢచారిత్వ ఆరోపణలపై ఇప్పటికే గత నెలలో హర్యానాకు చెందిన మరో యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రాను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అరెస్టైన జస్బీర్‌కు జ్యోతితో సంబంధాలున్నాయని పోలీసులు వెల్లడించారు. అంతేకాదు, పాక్‌ నిఘా ఏజెంట్లతో అతడు తరచూ సంప్రదింపులు కొనసాగించాడని విచారణలో తేలింది.

వివరాలు 

పాక్‌ అధికారులతో సంబంధాలు - విచారణలో బయటపడ్డ కీలక విషయాలు 

పంజాబ్‌ పోలీసుల ప్రకారం.. జస్బీర్‌ సింగ్‌ పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ అధికారి షకీర్‌ అలియాస్‌ జట్‌ రాంధావాతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు. ఇతడు పాక్‌ ఐఎస్‌ఐ కోసం పని చేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి. అంతేకాకుండా ఢిల్లీలోని పాకిస్తాన్‌ హైకమిషన్‌లో పనిచేసిన మాజీ అధికారి డానిష్‌తో కూడా జస్బీర్‌ సంబంధాలు కొనసాగించాడు. ఆయన ఆహ్వానంతో ఢిల్లీలోని పాక్‌ రాయబార కార్యాలయంలో జరిగిన పాకిస్తాన్‌ జాతీయ దినోత్సవ కార్యక్రమానికి హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఆ వేడుకలో జస్బీర్‌ పాక్‌ ఆర్మీ సభ్యులు, అక్కడి వ్లాగర్లతో చర్చలు జరిపినట్లు సమాచారం.

వివరాలు 

పాకిస్తాన్‌ ప్రయాణాలు - కీలక ఆధారాలు 

జస్బీర్‌ గతంలో మూడు సార్లు.. 2020, 2021, 2024లో.. పాకిస్తాన్‌ పర్యటనలకు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఈ పర్యటనల సమయంలో అతడు పాక్‌ అధికారులతో దృఢమైన సంబంధాలను కొనసాగించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జస్బీర్‌ను అరెస్ట్‌ చేసిన తర్వాత అతని మొబైల్‌ ఫోన్‌, ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్‌ పరీక్షకు పంపించారు. అందులో పాకిస్తాన్‌కు చెందిన అనేక టెలిఫోన్‌ నంబర్లు బయటపడ్డాయి. జ్యోతి మల్హోత్రా అరెస్ట్‌ అయిన తర్వాత జస్బీర్‌ అప్రమత్తమై, ఐఎస్‌ఐ ఏజెంట్లతో తన కమ్యూనికేషన్లకు సంబంధించిన డేటాను తుడిచిపెట్టే ప్రయత్నం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

వివరాలు 

యూట్యూబ్‌ ఛానెల్‌ 'జాన్‌ మహల్‌' - లక్షలాది మంది ఫాలోవర్లు 

జస్బీర్‌ 'జాన్‌ మహల్‌' అనే యూట్యూబ్‌ ఛానెల్‌ను నిర్వహిస్తున్నాడు. ఈ ఛానెల్‌కు 11 లక్షల మందికిపైగా సబ్‌స్రైబర్లు ఉన్నారు. సోషల్‌మీడియా ద్వారా అతడు పొందిన ప్రాచుర్యం అతడి కార్యకలాపాలకు ఉపయోగపడినట్లుగా అధికారులు భావిస్తున్నారు.