
CM Chandrababu: నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు న్యూఢిల్లీ పర్యటన చేపట్టనున్నారు. ఈరోజు (జూలై 15) ఉదయం 9.45కి గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరి ఉదయం 11.45కి ఢిల్లీలోకి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం అవుతారు. అదేరోజు మధ్యాహ్నం 2.30కి 1-జన్‌పథ్‌లో ఉన్న సీఎం నివాసంలో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే సరస్వత్‌తో భేటీ కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ మెట్రో ఎండీతో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో చేపట్టే మెట్రో రైలు ప్రాజెక్టులపై చర్చించే అవకాశం ఉంది.
వివరాలు
తిరిగి గురువారం ఉదయం 9.30గంటలకు అమరావతికి
అదేరోజు మధ్యాహ్నం 3.30కి మూర్తి మార్గ్-3లో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సంస్మరణ సభలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు రైల్వే,ఐటీ శాఖల కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అవుతారు. ఇక రేపు (జూలై 16) ఉదయం 10 గంటలకు కేంద్ర కార్మిక,ఉపాధిశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో ప్రత్యేక సమావేశం జరగనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2.30గంటలకు జలశక్తి భవన్‌లో బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్,తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలతో కలిసి చర్చలు జరపనున్నారు. అనంతరం సాయంత్రం 4.30కి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలుసుకుంటారు. రేపు రాత్రి ఢిల్లీలోనే బస చేసి,గురువారం ఉదయం 9.30గంటలకు అమరావతికి తిరిగి రానున్నారు.