Page Loader
Yoga Andhra: కృష్ణమ్మ ఒడిలో ఫ్లోటింగ్ యోగా.. ప్ర‌పంచ రికార్డుకు స‌ర్వం సిద్ధం!
కృష్ణమ్మ ఒడిలో ఫ్లోటింగ్ యోగా.. ప్ర‌పంచ రికార్డుకు స‌ర్వం సిద్ధం!

Yoga Andhra: కృష్ణమ్మ ఒడిలో ఫ్లోటింగ్ యోగా.. ప్ర‌పంచ రికార్డుకు స‌ర్వం సిద్ధం!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 10, 2025
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఈ నెల 21న విశాఖపట్టణంలో ఐదు లక్షల మందితో 'యోగాంధ్ర' పేరుతో మహా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారని సమాచారం. ఈవేడుకకు ముందు భాగంగా,జూన్ 11న బెరంపార్కు సమీపంలో కృష్ణానదిలో 'ఫ్లోటింగ్ యోగా'తో ప్రపంచ రికార్డును సాధించేందుకు అధికారులు ప్రత్యేకంగా మేగా ఈవెంట్‌ను చేపడుతున్నారు. ప్రజలలో యోగ పట్ల అవగాహన పెంచేందుకు,ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ప్రతి ఒక్కరికి యోగాను చేరువ చేయాలనే లక్ష్యంతో,ఈ కార్యక్రమాన్ని నీటిమీద యోగా చేసే విధంగా చేపడుతున్నారు. పంట్లు,బోట్లు,స్పీడ్ బోట్లు,క‌యాక్స్ బోట్లు,శాండ్ బోట్లు,జెట్ స్కీ,లైఫ్ బోట్లు వంటి 200 వాట‌ర్ క్రాఫ్ట్స్‌పై వెయ్యిమందితో కామ‌న్ యోగా ప్రోటోకాల్‌తో యోగాస‌నాలు వేయనున్నారు.

వివరాలు 

ప్రపంచ రికార్డును నెలకొల్పాలన్న ఉద్దేశ్యంతో అధికారుల ఏర్పాట్లు

దీని ద్వారా ప్రపంచ రికార్డును నెలకొల్పాలన్న ఉద్దేశ్యంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నదీ తీరంలో ఉదయం సూర్య కిరణాల మధ్య అందమైన ప్రకృతి దృశ్యంలో జరిగే ఈ విశిష్టమైన కార్యక్రమానికి ప్రజలందరికీ ఆహ్వానాలు పంపించారు. ఈ భారీ ఈవెంట్‌ నిర్వహణకు జిల్లా యంత్రాంగంతోపాటు ఆయుష్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీరాజ్, మత్స్య శాఖలు, అమరావతి బోటింగ్ క్లబ్, ఈతగాళ్ల సంఘం, యోగా శిక్షణ సంస్థలు కలిసి భాగస్వామ్యమవుతున్నాయి.

వివరాలు 

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు 

ఇలాంటి మెగా ఈవెంట్లలో ప్రజలకు యోగా ప్రాముఖ్యతను తెలియజేయడమే కాకుండా,ఎలాంటి ప్రమాదాలు జరగకుండా భద్రతా పరంగా పూర్తి ఏర్పాట్లు చేయడం ఎంతో అవసరం. ఈనేపథ్యంలో ఈతగాళ్లను,లైఫ్ జాకెట్లను,అనుభవజ్ఞులైన బోటు నిపుణులను ఈ ప్రదేశంలో నియమించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బోట్లకు అవసరమైన ఫిట్నెస్ సర్టిఫికెట్లను జారీ చేయనున్నారు. ఈక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 'యోగాంధ్ర-2025' కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని కింద నెల రోజుల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా రెండు కోట్ల మందికి యోగా శిక్షణ ఇవ్వడమే లక్ష్యం. ప్రత్యేకంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి గ్రామం,వార్డు సచివాలయ పరిధిలో నిత్య యోగా శిక్షణ కోసం ఐదువేల మంది గుర్తింపు పొందిన ట్రైనర్లను నియమిస్తున్నారు. ఇప్పటివరకు ఏడు లక్షలమంది ఈ కార్యక్రమానికి నమోదు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

వివరాలు 

పర్యాటక ప్రదేశాల్లో యోగా కార్యక్రమాలు 

పర్యాటక ప్రాంతాల్లోనూ యోగా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందంజ వేసింది. ఇప్పటికే గాంధీ హిల్, పవిత్ర సంగమం, హరిత బెరం పార్కుల్లో యోగా కార్యక్రమాలు జరిగినట్లుగా అధికార వర్గాలు తెలిపాయి. త్వరలో కొండపల్లి కోటపై కూడా ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.