Page Loader
#NewsBytesExplainer: ఒక రూపాయితో కోటీశ్వరుడవ్వడం సాధ్యమేనా..?.. ఫాంటసీ క్రికెట్ యాప్స్ మాయలో పడుతున్న భారత యువత
ఒక రూపాయితో కోటీశ్వరుడవ్వడం సాధ్యమేనా..?..

#NewsBytesExplainer: ఒక రూపాయితో కోటీశ్వరుడవ్వడం సాధ్యమేనా..?.. ఫాంటసీ క్రికెట్ యాప్స్ మాయలో పడుతున్న భారత యువత

వ్రాసిన వారు Sirish Praharaju
May 28, 2025
04:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ మే 17న మళ్లీ ప్రారంభమైంది. ఈ సమాచారం ఢిల్లీకి చెందిన ఓ పార్కింగ్ ఏరియాలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న ధర్మేంద్ర గౌతమ్‌కు ఎంతో ఉత్సాహం కలిగించింది. ప్రపంచంలో అత్యంత విలువైన క్రికెట్ లీగ్‌గా ఐపీఎల్‌కు గుర్తింపు లభించినా.. గౌతమ్‌కి దీని పట్ల ఆసక్తి కలగడానికి కారణం క్రికెట్ ఆట కాదు. ఫాంటసీ క్రికెట్ యాప్‌ల ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెండు నెలల పాటు లభించిన అవకాశమే ఆయన ఆసక్తికి ప్రధాన కారణం. "ఆటలో ఉత్కంఠతో పాటు గెలవగలమనే నమ్మకమే నన్ను ముందుకు నడిపిస్తుంది," అని గౌతమ్ తెలిపారు.

వివరాలు 

ఫాంటసీ యాప్స్‌పై ఆకర్షణ 

ఈ ఫాంటసీ యాప్స్‌లో ఆటగాళ్లను ఎంపిక చేసుకుని జట్టుగా రూపొందించుకోవచ్చు. ఎంపిక చేసిన ఆటగాళ్లు ఐపీఎల్ మ్యాచ్‌లలో ఎలా ప్రదర్శిస్తారో ఆధారంగా పాయింట్లు లభిస్తాయి. టాప్ లీడర్‌బోర్డులో నిలిచినవారికి క్యాష్ బహుమతులు లభిస్తాయి. ఈ యాప్‌లలో ప్రవేశ రుసుము కేవలం ఒక రూపాయి నుంచే ప్రారంభమవుతుంది. అయితే వారు గెలిస్తే లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు. ఈ అవకాశం వల్లే.. గౌతమ్ వంటి వేలాది మంది భారతీయులు తమకు ఇష్టమైన క్రికెట్ చూస్తూనే డబ్బు సంపాదించాలనే ఆశతో ఫాంటసీ యాప్స్‌కు ఆకర్షితులవుతున్నారు.

వివరాలు 

భారత్‌లో ఫాంటసీ క్రికెట్ గేమింగ్ పట్ల పెరుగుతున్న క్రేజ్ 

ఆట పట్ల ఆసక్తి ఉన్నవారు ఫాంటసీ గేమింగ్ యాప్స్‌ను భారీగా డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. 2015 నుంచి 2020 మధ్య కాలంలో ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరగడం ఇందుకు ప్రధాన కారణం. ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావడం వల్ల ప్రత్యక్ష క్రీడా ప్రసారాలే కాదు, ఫాంటసీ గేమ్స్‌ కూడా ప్రతి భారతీయుడి మొబైల్‌లోకి వచ్చాయి. కేపీఎంజీ 2019 నివేదిక ప్రకారం 2016లో ఉన్న 36.8 కోట్ల బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు 2018 నాటికి 56 కోట్లకు చేరుకున్నారు. అదే సమయంలో ఫాంటసీ గేమింగ్ కంపెనీలు 10 నుండి 70కి పెరిగాయి. 2019లో డ్రీమ్11 యాప్ యూనికార్న్ హోదా (బిలియన్ డాలర్ విలువ) పొందిన తొలి ఫాంటసీ ప్లాట్‌ఫామ్‌గా నిలిచింది.

వివరాలు 

భారత్‌లో ఫాంటసీ క్రికెట్ గేమింగ్ పట్ల పెరుగుతున్న క్రేజ్ 

తర్వాత 2021లో మొబైల్ ప్రీమియర్ లీగ్, 2022లో గేమ్స్ 24x7 కూడా యూనికార్న్ క్లబ్‌లో చేరాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫాంటసీ స్పోర్ట్స్ యాప్‌లకు 22.5 కోట్ల మంది యూజర్లు ఉన్నట్లు డెలాయిట్‌తో కలిసి చేసిన అధ్యయనంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ పేర్కొంది. ఈ యాప్‌లలో వివిధ క్రీడలపై పందెం వేసే అవకాశం ఉన్నా.. 85 శాతం మంది వినియోగదారులు క్రికెట్‌పైనే దృష్టి పెట్టినట్లు ఎఫ్ఐఎఫ్ఎస్ తెలిపింది.

వివరాలు 

ఈజీ మనీ ఆదాయమా- ప్రమాదమా? 

ఈ యాప్స్‌కు ప్రజాదరణ పెరగడానికి ప్రధాన కారణం తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చనే ఆశ అని స్పష్టంగా తెలుస్తోంది. "విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉందన్న భావనను కలిగించి వీటిని ఆకర్షణీయంగా రూపొందించారు,"అని స్పోర్ట్స్ జర్నలిస్ట్ సిద్ధాంత్ చెప్పారు. "ఇది క్రికెట్‌కు మాత్రమే పరిమితం కాకుండా,ఇతర క్రీడలవైపు కూడా విస్తరిస్తోంది.దీనికి ప్రధాన కారణం డబ్బే," అని ఆయన పేర్కొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ మీర్జాపూర్‌ కోర్టులో దయారామ్ క్లర్క్‌గా పనిచేస్తున్నారు. ఏప్రిల్‌లో డ్రీమ్11 యాప్‌ ద్వారా 3 కోట్ల రూపాయలు గెలుచుకున్న ఆయన, లఖ్నవూ vs పంజాబ్ మ్యాచ్‌లో టాప్ లీడర్‌బోర్డులో నిలిచారు. "ఇది నా మొదటి పెద్ద విజయం. ఇంత డబ్బు గెలుచుకుంటానని ఊహించలేదు," అని ఆయన అన్నారు.

వివరాలు 

ఈజీ మనీ ఆదాయమా- ప్రమాదమా? 

తాను ఈ సొమ్ముతో ఇల్లు నిర్మించాలని భావిస్తున్నారు. అయితే ఇకపై ఆడాలన్న ఆసక్తి లేదని, నష్టం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. దిల్లీలో కాంట్రాక్ట్ వర్కర్‌గా ఉన్న మొహమ్మద్ రకీబ్ మాత్రం ఎప్పుడూ గెలవలేదట. ప్రతి మ్యాచ్‌కూ టీమ్ తయారుచేసినా విజయాన్ని ఎప్పటికీ పొందలేదని ఆయన తెలిపారు. గెలుపు అవకాశాలు తక్కువే అయినా, గెలుస్తామనే ఆశతోనే ఆడతున్నట్లు గౌతమ్ కూడా చెప్పారు. "తక్కువ మొత్తంలో గెలవడం చూస్తూ గడిపాను. పెద్ద మొత్తంలో కాకపోయినా, రూ.300-500 గెలుచుకున్నవాళ్లను చూశాను. అదే నాకు ప్రేరణ," అన్నారు.

వివరాలు 

రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలన్న ఆశ  

ఫాంటసీ గేమింగ్ యాప్స్‌ పట్ల అల్ప ఆదాయ వర్గాల్లో ఆకర్షణ పెరిగింది. తక్కువ సమయంలో ధనవంతులవ్వాలనే ఆశ వాళ్లను ఈ యాప్స్ వైపు నడిపిస్తోంది. కేపీఎంజీ నివేదిక ప్రకారం, ఏడాదికి రూ.3 లక్షలకు లోపు సంపాదించే వారిలో 40 శాతం మంది వారంలో ఐదు సార్లు ఫాంటసీ స్పోర్ట్స్ ఆడుతున్నట్లు వెల్లడైంది. రూ.10 లక్షలకు పైగా సంపాదించే వర్గంలో కూడా 12 శాతం మంది ఇదే చేస్తున్నారు. డబ్బు సంపాదించాలనే ఆశే ప్రధాన కారణంగా చూపుతున్నారు. కానీ ఈ ఆశ చాలా సందర్భాల్లో విషాదకర పరిణామాలకు దారి తీస్తోంది.

వివరాలు 

రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలన్న ఆశ  

2025 మార్చిలో బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి, ఫాంటసీ గేమింగ్‌లో రూ.2 కోట్ల నష్టంతో తీవ్ర నిరాశకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను కోవిడ్ సమయంలో ఈ గేమ్ పట్ల ఆకర్షితుడైనట్లు ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో పేర్కొన్నాడు. "తాము గెలుస్తామని నమ్మకం కలిగిన వ్యక్తులు,తరచూ నష్టాలు చూస్తూ తీవ్ర మానసిక స్థబ్దతకు గురవుతారు," అని టెక్నాలజీ బేస్డ్ మానసిక ఆరోగ్య సంస్థ 'సర్వీస్ ఫర్ హెల్తీ యూజ్ ఆఫ్ టెక్నాలజీ' అధిపతి డాక్టర్ మనోజ్ కుమార్ శర్మ తెలిపారు.

వివరాలు 

రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలన్న ఆశ  

ఈ తరహా ఘటనలు పెరిగిపోతుండడంతో కొన్ని రాష్ట్రాలు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమిళనాడు సీఎం స్టాలిన్ 2022లో ఫాంటసీ గేమింగ్ యాప్స్‌పై ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశిస్తే, మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆన్‌లైన్ గేమింగ్ నియంత్రణకు చట్టాన్ని తీసుకురావాలని ప్రకటించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సరైన నియంత్రణ లేకపోతే ఈ గేమింగ్ యాప్స్ మానసిక, ఆర్థిక స్థితులను భగ్నం చేసే ప్రమాదకర మాయగా మారే అవకాశం ఉంది.