
PM Removal Bill: నేరం చేస్తే ప్రధానికైనా ఉద్వాసనే.. నేడు పార్లమెంటులో బిల్లు
ఈ వార్తాకథనం ఏంటి
తీవ్ర నేరారోపణల కేసుల్లో అరెస్టై వరుసగా 30 రోజులు నిర్బంధంలో ఉంటే, ప్రధాన మంత్రి గానీ, కేంద్ర మంత్రి గానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి గానీ, రాష్ట్ర మంత్రి గానీ తమ పదవులు కోల్పోవాల్సిన పరిస్థితి రానుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లును సిద్ధం చేసింది. ఈ బిల్లును బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్టు అధికార వర్గాలు స్పష్టం చేశాయి.
వివరాలు
నిబంధనల వివరాలు
బిల్లులోని నిబంధనల ప్రకారం, కనీసం అయిదేళ్ల శిక్ష విధించే నేరంలో అరెస్టయి, నెలరోజులపాటు నిర్బంధంలో ఉన్న మంత్రుల పదవులు ఆటోమేటిక్‌గా రద్దవుతాయి. అంటే 31వ రోజు నుంచే వారి పదవి ఉండదు. వారు స్వచ్ఛందంగా రాజీనామా చేయకపోయినా, కొత్త నిబంధనల కారణంగా తప్పనిసరిగా పదవి కోల్పోవాల్సిందేనని బిల్లు ముసాయిదా చెబుతోంది. ఇప్పటివరకు రాజ్యాంగంలో మంత్రులను తీవ్ర అభియోగాల కారణంగా తప్పించే స్పష్టమైన నిబంధన లేకపోవడంతో ఈ చట్టం అవసరమని పేర్కొంది.
వివరాలు
గత ఘటనలు, ప్రతిపక్ష విమర్శలు
గతంలో దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు మాజీ మంత్రి వి.సెంథిల్ బాలాజీలు అరెస్టయినా తమ పదవుల నుండి తప్పుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శిస్తూ- "ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను అరెస్టు చేసి ప్రభుత్వాలను అస్థిరపరచడానికే కేంద్రం ఈ బిల్లును తెస్తోంది" అంటూ మండిపడింది.
వివరాలు
నాలుగు కొత్త బిల్లులు
కేంద్ర ప్రభుత్వం ఒకేసారి నాలుగు కీలక బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టబోతోంది. వీటిలో.. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు - 2025 కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వ (సవరణ) బిల్లు - 2025 జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు - 2025 ఆన్‌లైన్ గేమింగ్ ప్రోత్సాహం మరియు నియంత్రణ బిల్లు - 2025 లోక్‌సభ ఎజెండా ప్రకారం, వీటిలో కొన్ని బిల్లులను సంయుక్త పార్లమెంటరీ సంఘాలకు పంపనున్నారు. ముఖ్యంగా, జమ్మూకశ్మీర్ బిల్లు రాష్ట్ర హోదా పునరుద్ధరణకు దారితీస్తుందా అన్న ఊహాగానాలు వేడెక్కుతున్నాయి.
వివరాలు
ఆన్‌లైన్ గేమింగ్‌పై కఠిన చర్యలు
మంగళవారం కేంద్ర మంత్రివర్గం 'ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు'కి ఆమోదం తెలిపింది. దీనిని బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుతో ఆన్‌లైన్ గేమింగ్ నిర్వహణను నేరంగా పరిగణించనున్నారు. శిక్షలు, జరిమానాలు బిల్లులో ఆన్‌లైన్ గేమ్స్, ఈ-స్పోర్ట్స్ మధ్య స్పష్టమైన తేడా చూపించబడింది. నిబంధనలు ఉల్లంఘించి ఆన్‌లైన్ గేమ్స్ అందించే వారికి గరిష్ఠంగా మూడు సంవత్సరాల జైలుశిక్ష, లేదా రూ.1 కోటి వరకు జరిమానా, లేదా రెండూ విధిస్తారు. అలాగే, ఈ గేమింగ్‌కు సంబంధించిన ప్రకటనల్లో పాల్గొన్న వారికి గరిష్ఠంగా రెండు సంవత్సరాల జైలు శిక్ష, లేదా రూ.50 లక్షల జరిమానా విధిస్తారు. వీటికి సంబంధించి ఆర్థిక లావాదేవీల్లో భాగమైనవారికి గరిష్ఠంగా మూడు సంవత్సరాల శిక్ష, లేదా రూ.1 కోటి జరిమానా పడుతుంది.