LOADING...
Amravati: అమరావతి మీదుగా బుల్లెట్‌ రైలు.. హైదరాబాద్‌-చెన్నై కారిడార్‌ వయా సీఆర్డీయే.. ఎలైన్‌మెంట్‌కు ప్రాథమిక ఆమోదం
ఎలైన్‌మెంట్‌కు ప్రాథమిక ఆమోదం

Amravati: అమరావతి మీదుగా బుల్లెట్‌ రైలు.. హైదరాబాద్‌-చెన్నై కారిడార్‌ వయా సీఆర్డీయే.. ఎలైన్‌మెంట్‌కు ప్రాథమిక ఆమోదం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 29, 2025
08:50 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి మీదుగా త్వరలో బుల్లెట్‌ రైళ్లు దూసుకెళ్లనున్నాయి. హైదరాబాద్‌-చెన్నై మధ్య హైస్పీడ్‌ ఎలివేటెడ్‌ రైలు కారిడార్‌ నిర్మాణానికి ఇప్పటికే ప్రాథమిక ఆమోదం లభించింది. ఇది సీఆర్డీయే మీదుగా వెళ్లనుంది. మరోవైపు కర్నూలు,నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల మీదుగా హైదరాబాద్‌-బెంగళూరు బుల్లెట్‌ రైలు మార్గానికి కూడా ప్రాథమిక ఆమోదం ఇచ్చారు. ఈ రెండు భారీ ప్రాజెక్టులు పూర్తికాగానే తెలుగు రాష్ట్రాల రూపురేఖలే మారిపోనున్నాయని నిపుణులు భావిస్తున్నారు. మెట్రో నగరాల మధ్య వేగవంతమైన రవాణా కోసం కేంద్రం హైస్పీడ్‌ కారిడార్లు రూపొందిస్తుండగా, వాటిలో ఏపీ మీదుగా వెళ్లే రెండు ప్రధాన మార్గాలు.. హైదరాబాద్‌-చెన్నై, హైదరాబాద్‌-బెంగళూరు — ప్రత్యేక ప్రాధాన్యత పొందాయి.

వివరాలు 

అమరావతి మీదుగా వెళ్లేలా.. 

ఈ రెండింటిలోనూ హైదరాబాద్‌ నుంచి శంషాబాద్‌ వరకు 38.5 కి.మీ. దూరం ఒకే మార్గంగా ఉండగా, అక్కడి నుంచి చెన్నై, బెంగళూరు వైపుకు వేర్వేరు మార్గాలు ఏర్పాటవుతాయి. హైదరాబాద్‌-చెన్నై హైస్పీడ్‌ కారిడార్‌ కోసం మొత్తం మూడు ఎలైన్‌మెంట్లు పరిశీలించారు (744.57 కి.మీ., 839.5 కి.మీ., 749.5 కి.మీ.). వీటిలో 744.5 కి.మీ. ఎలైన్‌మెంట్‌ను ప్రాథమికంగా ఖరారు చేశారు. ఈ మార్గంలో తెలంగాణలో ఆరు, ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిది, తమిళనాడులో ఒక స్టేషన్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ కారిడార్‌ హైదరాబాద్‌-ముంబయి హైస్పీడ్‌ మార్గం నుంచి ప్రారంభమై, శంషాబాద్‌, నార్కట్‌పల్లి, సూర్యాపేట, ఖమ్మం/కోదాడ మీదుగా సీఆర్డీయేలో మీదుగా గుంటూరు వైపు వెళుతుంది. అక్కడి నుంచి చీరాల దిశగా వెళ్లి, విజయవాడ-చెన్నై రైల్వే లైన్‌కు సమాంతరంగా చెన్నై చేరుతుంది.

వివరాలు 

అమరావతి మీదుగా వెళ్లేలా.. 

మొత్తం పొడవులో తెలంగాణలో 236.48 కి.మీ., ఏపీలో 448.11 కి.మీ., తమిళనాడులో 59.98 కి.మీ. ఉంటుంది. ఈ మార్గాన్ని నేరుగా చెన్నైకి కాకుండా తిరుపతి మీదుగా మలిస్తే యాత్రికులకు ఎంతో ఉపయోగమని చర్చ నడుస్తోంది. గూడూరు నుంచి తిరుపతి మీదుగా చెన్నై వెళ్తే కారిడార్‌ పొడవు మరో 53.5 కి.మీ. పెరుగుతుంది. అలా మారిస్తే నాయుడుపేట, తడ స్టేషన్లు తప్పిపోతాయి. ఈ ప్రాజెక్టులో రెండు ట్రాక్‌లు, అదనపు లూప్‌లైన్‌లు, సైడింగ్‌లు కలిపి మొత్తం 1,419.4 కి.మీ. ట్రాక్‌ నిర్మించనున్నారు.

వివరాలు 

హైదరాబాద్‌-బెంగళూరు మార్గం 

హైదరాబాద్‌-బెంగళూరు హైస్పీడ్‌ రైలు కారిడార్‌ కోసం కూడా మూడు ఎలైన్‌మెంట్లు పరిశీలించారు (576.6 కి.మీ., 558.2 కి.మీ., 621.8 కి.మీ.). వీటిలో 576.6 కి.మీ.పొడవైన మార్గాన్ని ప్రాథమికంగా ఎంపిక చేశారు.ఈ రైలు మార్గం ఎక్కువగా ప్రస్తుత హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారికి సమాంతరంగా సాగుతుంది. ఇందులో తెలంగాణలో నాలుగు,ఏపీలో ఆరు,కర్ణాటకలో మూడు స్టేషన్లు ఏర్పాటవుతాయి. ముఖ్యంగా శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలో ఉన్న కియా పరిశ్రమలు,ఇతర అనుబంధ సంస్థలకు అనుకూలంగా దుద్దేబండ వద్ద ప్రత్యేక స్టేషన్‌ ఏర్పాటు చేయనున్నారు. మొత్తం దూరంలో తెలంగాణలో 218.5 కి.మీ., ఏపీలో 263.3 కి.మీ., కర్ణాటకలో 94.80 కి.మీ. ఉంటుంది. ఈ ప్రాజెక్టులోనూ రెండు ట్రాక్‌లు, లూప్‌లైన్లు, సైడింగ్‌లు కలిపి 1,363 కి.మీ. మేర ట్రాక్‌ నిర్మించనున్నారు.

వివరాలు 

బుల్లెట్‌ రైలు చతుర్భుజి 

హైదరాబాద్‌-అమరావతి-చెన్నై, హైదరాబాద్‌-బెంగళూరు బుల్లెట్‌ రైలు మార్గాలు, అలాగే బెంగళూరు-చెన్నై ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఈ నాలుగు నగరాలు (హైదరాబాద్‌, అమరావతి, చెన్నై, బెంగళూరు) బుల్లెట్‌ రైలు మార్గాల చతుర్భుజిగా మారనున్నాయి. దీంతో ఈ మెట్రో నగరాల మధ్య ప్రయాణం గంట నుండి రెండు గంటల్లోనే పూర్తయ్యే అవకాశముంది.