Page Loader
Srikakulam: శ్రీకాకుళం జిల్లాకు కేంద్రం బహుమతి.. కాశీబుగ్గ ఆర్వోబీకి భారీగా నిధులు మంజూరు
శ్రీకాకుళం జిల్లాకు కేంద్రం బహుమతి.. కాశీబుగ్గ ఆర్వోబీకి భారీగా నిధులు మంజూరు

Srikakulam: శ్రీకాకుళం జిల్లాకు కేంద్రం బహుమతి.. కాశీబుగ్గ ఆర్వోబీకి భారీగా నిధులు మంజూరు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 01, 2025
11:59 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేస్తోంది. హైవేలతో పాటు ఫ్లైఓవర్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. తాజాగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైల్వేశాఖ ఇంజనీరింగ్‌ అధికారులు రూ.46.64 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష గతంలో అధికారులతో చర్చలు జరిపి నిధుల మంజూరుకు కృషి చేశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు.

Details

ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆమోదం

రామ్మోహన్ నాయుడు ఎక్స్ (ట్విట్టర్) ద్వారా స్పందిస్తూ, ROB వంతెన కోసం రూ.46.64 కోట్ల అంచనాలతో రైల్వే శాఖ చేపట్టేలా పునః ప్రారంభం కానుందన్నారు. పెండింగ్‌ నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కి ప్రత్యేక ధన్యవాదాలని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో శ్రీకాకుళం అభివృద్ధికి మరిన్ని ప్రాజెక్టులు తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు.

Details

గతంలో ఆలస్యం.. ఇప్పుడు వేగం 

గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కాశీబుగ్గ, బెండి రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జిలకు శంకుస్థాపన జరిగినా, పూర్తిగా నిర్మించలేదు. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వం బెండి బ్రిడ్జిని పూర్తి చేసి ప్రారంభించింది. అయితే, కాశీబుగ్గ ఫ్లైఓవర్‌ కొన్ని సమస్యల కారణంగా పూర్తికాకుండా మిగిలిపోయింది. నిర్మాణ సామాగ్రి ధరలు పెరగడం, నిర్వాసితుల సమస్యలు తేలకపోవడంతో వ్యయం పెరిగింది.

Details

 ప్రభుత్వం చొరవతో సమస్యకు పరిష్కారం 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైల్వేశాఖ ఆధ్వర్యంలో పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందించి, రూ.46.64 కోట్ల నిధులకు ఆమోదం ఇచ్చారు. పలాస ప్రజల కష్టాలకు ముగింపు? ఈ ఫ్లై ఓవర్‌ లేకపోవడంతో ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉంది. రైల్వే గేటు మూసివేస్తే కనీసం 45 నిమిషాల పాటు ప్రజలు వేచిచూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఫ్లై ఓవర్‌కు నిధులు మంజూరవ్వడంతో పనులు వేగంగా ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ప్రజలకు భారీగా ప్రయోజనం కలుగుతుందని అంటున్నారు.