Page Loader
CM Chandrababu: 'జూన్‌ 21న ప్రతి ఇంట్లో సాధన జరగాలి'.. యోగాంధ్రపై విశాఖలో సీఎం చంద్రబాబు సమీక్ష
'జూన్‌ 21న ప్రతి ఇంట్లో సాధన జరగాలి'.. యోగాంధ్రపై విశాఖలో సీఎం చంద్రబాబు సమీక్ష

CM Chandrababu: 'జూన్‌ 21న ప్రతి ఇంట్లో సాధన జరగాలి'.. యోగాంధ్రపై విశాఖలో సీఎం చంద్రబాబు సమీక్ష

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 17, 2025
09:22 am

ఈ వార్తాకథనం ఏంటి

మన జీవనశైలిలో భాగంగా యోగను చేర్చడం వల్ల జీవిత ప్రమాణాలు మెరుగవుతాయి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. యోగ సాధన వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంచడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుందన్నారు. పని తీరు లో నైపుణ్యాన్ని రెట్టింపు చేస్తుందని, అనారోగ్యాలు దరిచేరకుండా చేస్తుందన్నారు. దీంతో వైద్య ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో యోగా గేమ్‌చేంజర్‌గా మారిందని అభిప్రాయపడ్డారు. ప్రతి కుటుంబం యోగాన్ని నిత్యజీవితంలో భాగంగా చేసుకోవాలని ఆకాంక్షించారు. యోగాంధ్ర కార్యక్రమం సామూహిక ప్రజా ఉద్యమంగా ముందుకు సాగాలని కోరారు. కుల, మత, వర్గాలకు అతీతంగా అందరూ భాగస్వాములు కావాలనీ, ముఖ్యంగా మహిళలు చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

వివరాలు 

విశాఖ పేరు మోదీనే సూచించారు 

ఈనెల 21న జరగనున్న యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను సీఎం చంద్రబాబు సోమవారం పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రులు,అధికారులు పాల్గొనగా,అనంతరం ఏర్పాట్లపై మీడియాకు వివరాలు వెల్లడించారు. విశాఖపట్టణంలో జరిగే ఈ కార్యక్రమం కొత్త రికార్డులు సృష్టిస్తుందన్నారు. యోగా మన దేశ సంప్రదాయ వారసత్వంలో భాగమని,దీనిని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో ప్రధాని నరేంద్ర మోదీ పాత్ర విశేషమని సీఎం పేర్కొన్నారు. ప్రధాని కలిసిన సందర్భంగా ఆయనతో జరిపిన సంభాషణను గుర్తు చేస్తూ,మోదీ యోగ దినోత్సవాన్ని ప్రారంభించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా 11వయోగా దినోత్సవాన్ని విశాఖలో నిర్వహించాలనే ఆలోచన వచ్చిందన్నారు. ఈనెల 21న ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు బీచ్ రోడ్‌లో జరిగే ఈమహా యోగ కార్యక్రమంలో సుమారు ఐదు లక్షల మంది పాల్గొననున్నారని తెలిపారు.

వివరాలు 

రెండు రకాల ప్రణాళికలతో 

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి లక్ష యోగా సాధన కేంద్రాలు ఉన్నప్పటికీ, ఏకంగా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే లక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. ఇప్పటివరకు 2.17 కోట్ల మంది పేర్లు నమోదు చేసుకున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు రెండు వేర్వేరు కార్యాచరణ పథకాలు రూపొందించామన్నారు. మొదటి పథకంగా, 3.5 లక్షల మందికి అనుకూలంగా 340 కంపార్ట్‌మెంట్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ప్రతి కంపార్ట్‌మెంట్‌లో 1000 మంది సాధన చేయగలుగుతారని వివరించారు. ఒక్కో ప్రాంతంలో శిక్షకుడు, వైద్యుడు, 10 మంది వాలంటీర్లు విధులుపాలవుతారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోతే, ప్లాన్‌-బి కింద ఆంధ్ర విశ్వవిద్యాలయ మైదానాన్ని ప్రత్యామ్నాయ వేదికగా ఉపయోగిస్తామని తెలిపారు.

వివరాలు 

యోగా ప్రాధాన్యంపై 'విశాఖ డిక్లరేషన్‌' 

ఎవరెవరు ఎక్కడ కూర్చోవాలో ముందుగానే తెలియజేసి సంఖ్యాపూర్వకంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. 3.5 లక్షల మందికి యోగా మ్యాట్లు, 5 లక్షల మందికి టీషర్టులు పంపిణీ చేస్తామన్నారు. శాంతిభద్రతలు కాపాడే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రజల ఆలోచనల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయని సీఎం పేర్కొన్నారు. తన జీవితంలో ఇదొక మహత్తరమైన సంఘటనగా నిలిచిపోతుందన్నారు. ఆ రోజు యోగా ప్రాధాన్యాన్ని ప్రజల్లోకి చాటిచెప్పేలా 'విశాఖ డిక్లరేషన్‌'ను విడుదల చేస్తామని తెలిపారు. కేంద్రం,రాష్ట్రం సంయుక్తంగా దీనిని ముందుకు తీసుకెళ్తున్నాయన్నారు.

వివరాలు 

అలాంటి వారిని సమాజం నుండి వేరు చేయాల్సిన అవసరం ఉంది:సీఎం  

యోగ దినోత్సవం రోజున ఎవరైనా బయటికి వెళ్లలేకపోతే, ఉదయం 7 నుండి 8 గంటల మధ్య ఇంట్లోనే యోగా సాధన చేయవచ్చన్నారు. రాష్ట్రంలో ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపరచేందుకు బిల్‌గేట్స్‌ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. అనారోగ్యం తలెత్తక ముందే చర్యలు తీసుకోవడం, వైద్య ఖర్చులు తగ్గించడంపై పరిశోధనలు చేస్తున్నామన్నారు. ప్రాథమికంగా కుప్పాన్ని ఆరోగ్య ప్రయోగ ప్రదేశంగా ఎంపిక చేశామన్నారు. ఆరు నెలలలో చిత్తూరులో పూర్తి చేస్తామని, రెండు సంవత్సరాల్లో ఇది రాష్ట్రమంతా విస్తరించనుందని చెప్పారు. స్వచ్ఛమైన ఆలోచనలు ఉన్నవారు మంచి పనులు చేస్తారని, చెడు ఆలోచనలు ఉన్నవారు చెడు మార్గంలోనే నడుస్తారని, అలాంటి వారిని సమాజం నుండి వేరు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

వివరాలు 

క్షేత్రస్థాయి పరిశీలన.. సమీక్షలు 

సోమవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్కే బీచ్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం రుషికొండ దాకా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి బస్సులో పర్యటించారు. రాష్ట్ర నోడల్ అధికారి ఎంటీ కృష్ణబాబు, విశాఖ కలెక్టర్ ఎంఎన్ హరేంధిరప్రసాద్ తదితరులు సీఎం సమక్షంలో ఏర్పాట్లను వివరించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు నారా లోకేశ్, అనగాని సత్యప్రసాద్, పి. నారాయణ, వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, కొల్లు రవీంద్ర, జి. సంధ్యారాణి, ఎంపీలు శ్రీభరత్, సీఎం రమేష్, కలిశెట్టి అప్పలనాయుడు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.