LOADING...
Bihar: పాట్నాలో కాంగ్రెస్, బిజెపి కార్యకర్తల ఘర్షణ
పాట్నాలో కాంగ్రెస్, బిజెపి కార్యకర్తల ఘర్షణ

Bihar: పాట్నాలో కాంగ్రెస్, బిజెపి కార్యకర్తల ఘర్షణ

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 29, 2025
12:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల వాతావరణంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ చేపట్టిన "ఓటర్‌ అధికార్‌ యాత్ర" రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ పాదయాత్రలో పాల్గొన్న ఒక కాంగ్రెస్‌ కార్యకర్త ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన తల్లిపై చేసిన అసభ్య వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వివాదానికి దారి తీశాయి. ఆ వ్యాఖ్యలకు నిరసనగా ఆగస్టు 29వ తేదీ శుక్రవారం బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ఆందోళనలకు పిలుపునిచ్చింది. పాట్నలోని కాంగ్రెస్‌ కార్యాలయం ముందు బీజేపీ కార్యకర్తలు చేపట్టిన నిరసన ఆందోళన హింసాత్మకంగా మారింది. బీజేపీ నిరసనకు అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రయత్నించడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పాట్నాలో కాంగ్రెస్, బిజెపి కార్యకర్తల ఘర్షణ

వివరాలు 

అసభ్య వ్యాఖ్యలకు ప్రతీకారం తప్పదు: నితిన్‌ నబిన్‌

ఇరువైపుల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పార్టీ జెండాలకు కర్రలతో పరస్పరం కొట్టుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తత దిశగా వెళ్తుండటంతో పోలీసులు మధ్యలో జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ ఘర్షణ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై బీజేపీ సీనియర్‌ నేత నితిన్‌ నబిన్‌ స్పందిస్తూ.. ఒక తల్లిని అవమానించడం బీహార్‌ ప్రజలు సహించరని,కాంగ్రెస్‌ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ప్రధాని మోడీ, ఆయన తల్లిపై చేసిన అసభ్య వ్యాఖ్యలకు ప్రతీకారం తప్పదని స్పష్టం చేశారు. మరోవైపు, అధికార కూటమి ప్రోత్సాహంతోనే కాంగ్రెస్‌ కార్యకర్తలపై దాడులు జరిగాయని కాంగ్రెస్‌ నేత డాక్టర్‌ అశుతోష్‌ ఆరోపించారు. సీఎం నితీష్‌ కుమార్‌ ఇలాంటి దాడులను ప్రోత్సహించడం తప్పు అని విమర్శించారు.

వివరాలు 

మోదీని దూషించిన వ్యక్తి, రాహుల్‌ గాంధీపై కేసులు

రాహుల్‌ గాంధీ "ఓటర్‌ అధికార్‌ యాత్ర"లో జరిగిన ఈ ఘటనతో బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మోడీ, ఆయన తల్లిని దూషించిన వ్యక్తితో పాటు రాహుల్‌ గాంధీపై కూడా పోలీసులు చర్యలు తీసుకోవాలని బీజేపీ కార్యకర్తలు ఫిర్యాదులు నమోదు చేశారు. బీజేపీ ఫిర్యాదు ఆధారంగా దర్భాంగ పోలీసులు మోదీని దూషించిన వ్యక్తి, రాహుల్‌ గాంధీపై కేసులు నమోదు చేశారు. అనంతరం ఆ కార్యకర్తను ఆగస్టు 29న పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు అధికారికంగా వెల్లడించారు.