Page Loader
Explained: ఢిల్లీలో భూకంపం.. ఆ సమయంలో 'బూమ్‌' శబ్దం ఎందుకొచ్చింది..?
ఢిల్లీలో భూకంపం.. ఆ సమయంలో 'బూమ్‌' శబ్దం ఎందుకొచ్చింది..?

Explained: ఢిల్లీలో భూకంపం.. ఆ సమయంలో 'బూమ్‌' శబ్దం ఎందుకొచ్చింది..?

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 17, 2025
01:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీ,పరిసర ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. దిల్లీ, నోయిడా, గురుగ్రామ్ ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని నివేదించారు. రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంప తీవ్రత 4.0గా నమోదైంది. ధౌలా కాన్‌లోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ కాలేజీ సమీపంలో 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రకంపనలు సంభవించిన సమయంలో కొన్ని సెకన్ల పాటు గాలి ద్వారా పెద్ద శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ శబ్దానికి గల కారణాలను నిపుణులు వివరించారు.

వివరాలు 

అధిక ఫ్రీక్వెన్సీ కంపనాల కారణంగా 'బూమ్' శబ్దం

తక్కువ లోతులో భూకంప కేంద్రం ఏర్పడినప్పుడు ప్రకంపన సమయంలో బూమింగ్ శబ్దాలు వినిపిస్తుంటాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భూమిపై ప్రకంపనలు రావడంతో పాటు,భూమి లోపలి ప్రకంపనలు గాలిలో ధ్వని తరంగాలుగా మారుతాయని యూఎస్ జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. అధిక ఫ్రీక్వెన్సీ కంపనాల కారణంగా 'బూమ్' శబ్దం ఉత్పన్నమవుతుందని వెల్లడించారు. కొన్నిసార్లు భూకంప ప్రకంపనలు లేకపోయినా,పెద్ద శబ్దాలు వినిపించేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. భూకంప కేంద్రం భూమి ఉపరితలం నుంచి 70 కి.మీ లోతులో ఉంటే దాన్ని షాలో ఫోకస్ ఎర్త్‌క్వేక్‌గా పరిగణిస్తారు. కేంద్రం లోతు తక్కువగా ఉంటే, ప్రకంపన శబ్దం ఎక్కువగా వినిపించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

వివరాలు 

నాలుగు భూకంప మండలాలుగా విభజన 

ఈరోజు దిల్లీ, బిహార్‌లో సంభవించిన భూకంపాల్లో భూకంప కేంద్రాలు 5 కి.మీ నుంచి 10 కి.మీ లోతులోనే ఉన్నాయని అధికారులు వెల్లడించారు. దిల్లీ సీస్మిక్ జోన్ 4లో ఉన్నందున ఇక్కడ తరచుగా భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. భారతదేశాన్ని నాలుగు భూకంప మండలాలుగా విభజించారు. మండలం-2: ఇందులో 4.9 కన్నా తక్కువ తీవ్రత గల భూకంపాలు సంభవిస్తాయి. దేశ భూభాగంలో ఇది 40.93% ఉంది. ఇందులో కర్ణాటక పీఠభూమి, ద్వీపకల్ప ప్రాంతాలు ఉన్నాయి. మండలం-3: 5.0-5.9 తీవ్రత గల భూకంపాలు సంభవిస్తాయి దేశ వ్యాప్తిలో 30.79% ఈ మండలానికి చెందుతుంది.ఇందులో పంజాబ్,రాజస్థాన్,మధ్యప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలతో పాటు కేరళ, గోవా, లక్షద్వీప్ దీవులు ఉన్నాయి.

వివరాలు 

నాలుగు భూకంప మండలాలుగా విభజన 

మండలం-4: ఇందులో అధికస్థాయి భూకంపాలు (6.0 - 6.9) సంభవిస్తాయి. దేశ భూభాగంలో 17.49% ఈ మండలంలో ఉంది. జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, దిల్లీ, సిక్కిం, ఉత్తరప్రదేశ్‌లోని ఉత్తర ప్రాంతాలు, బిహార్, పశ్చిమ్ బెంగాల్, మహారాష్ట్ర పశ్చిమ తీరం, రాజస్థాన్ ఈ విభాగంలో ఉన్నాయి. మండలం-5: ఇందులో 7.0 కన్నా ఎక్కువ తీవ్రత గల భూకంపాలు సంభవిస్తాయి. దేశ వ్యాప్తంగా 10.79% భూభాగం ఈ విభాగంలో ఉంది. ఇందులో ఉత్తర బిహార్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్‌లోని రాన్‌-ఆఫ్‌-కచ్, అండమాన్-నికోబార్ దీవులు ఉన్నాయి.

వివరాలు 

హిమాలయాల్లో ఎక్కువగా భూకంపాలు ఎందుకు వస్తాయి? 

భూమిలో శక్తి విడుదలైనప్పుడు ప్రకంపనలు ఏర్పడతాయి. భూకంప కేంద్రం నుంచి అన్ని దిశలలోనూ ప్రకంపనలు ప్రయాణిస్తాయి. భూఫలకాలు నిరంతరం కదులుతూ ఉంటాయి, అయితే కొన్ని ప్రాంతాల్లో భూపొరలు బలహీనంగా ఉన్నప్పుడు భూకంపాలు సంభవిస్తాయి. భూఫలకాల అంచుల వద్ద తరచూ భూకంపాలు సంభవిస్తాయి. భారతదేశ భూఫలక ఉత్తర దిశగా, ఈశాన్యం వైపు కదులుతూ ఉంటుంది. భారత భూఫలక ఏడాదికి 5 సెం.మీ. చొప్పున కదులుతుండగా, యురేషియన్ భూఫలక ఉత్తర దిశగా ఏడాదికి 2 సెం.మీ. కదులుతుంది. ఈ రెండు భూఫలకాల కదలికలో తేడాలు ఉండటం వల్ల భారత భూఫలక యురేషియన్ భూఫలకాన్ని ఢీకొడుతుంది. ఈ కారణంగా హిమాలయాల ప్రాంతాల్లో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి.

వివరాలు 

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మోదీ 

దిల్లీలో భూకంపాలు మళ్లీ సంభవించే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. భద్రతా చర్యలు పాటించాలని ప్రజలను కోరారు. భూవిజ్ఞాన శాఖ మంత్రి జితేంద్ర సింగ్, ఎక్స్ వేదికగా ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భద్రత చర్యలు తీసుకుంటూ, ఎప్పటికప్పుడు అధికారుల సూచనలను అనుసరించాలని తెలిపారు.