
AP Weather Updates: ఏపీ ప్రజలకు శుభవార్త, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం- 3 రోజులపాటు వర్షాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీలో కొనసాగుతున్న ఎండలు కొంతవరకు తగ్గనున్నాయన్న శుభవార్త వచ్చింది.
వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
దక్షిణ బంగాళాఖాతంలో ఏప్రిల్ 8 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
ఈ కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయని తెలిపింది.
అల్పపీడనానికి సంబంధించిన ఉపరితల ఆవర్తనం తీర ప్రాంతానికి అనుసరించి బంగ్లాదేశ్, మయన్మార్ వైపు కదలే అవకాశముందని అంచనా వేయబడింది.
వివరాలు
ఉత్తరాంధ్రలో గరిష్టంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం
అల్పపీడన ప్రభావంతో మంగళవారం నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
ఈరోజు ఉత్తరాంధ్రలో గరిష్టంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది.
రాయలసీమ ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి కూర్మనాథ్ తెలిపారు.
ఆదివారం నాడు కర్నూలు, ప్రకాశం, నంద్యాల, శ్రీకాకుళం, పల్నాడు జిల్లాల్లో కొన్ని చోట్ల 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వివరాలు
పిడుగులతో కూడిన వర్ష సూచన
విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ ప్రకారం, ఏపీలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది.
సోమవారం నాడు రాయలసీమలో 41 నుండి 43 డిగ్రీల వరకు, ఉత్తరాంధ్రలో 39 నుండి 41 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది.
కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
ఆదివారం నాడు కర్నూలు జిల్లాలోని కామవరంలో 40.8°C, ప్రకాశం జిల్లాలోని పెద్దదోర్నాలలో 40.7°C, నంద్యాల జిల్లా దొర్నిపాడులో 40.6°C, పల్నాడు జిల్లాలో రావిపాడు 40.5°C, శ్రీకాకుళం జిల్లా పొందూరులో 40.3°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వివరాలు
ఉపరితల ఆవర్తన వివరాలు
ఉత్తర, మధ్య మహారాష్ట్ర ప్రాంతాల నుంచి ఉత్తర తమిళనాడుకు వరకు విస్తరించి ఉన్న అల్పపీడన ద్రోణి ప్రస్తుతం మరాఠ్వాడా ప్రాంతం నుంచి కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడుకు సగటు సముద్ర మట్టానికి సుమారు 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది.
అదే సమయంలో దక్షిణ కర్ణాటక,పరిసర ప్రాంతాల్లో ఈఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5కి.మీ ఎత్తులో కొనసాగుతోంది.
మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో,పరిసర ప్రాంతాల్లో ఉన్న మరో ఉపరితల ఆవర్తనం సుమారు 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది.
ఈ పరిస్థితుల వల్ల వచ్చే 24గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్,పుదుచ్చేరి (యానం)ప్రాంతాలలో ట్రోపోస్ఫియరిక్ స్థాయిలో ఆగ్నేయం, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని పేర్కొంది.