
Supreme Court: అక్రమంగా చెట్లను నరికివేయడం వల్లే విపత్తులకు కారణం: సుప్రీంకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర భారతదేశం ప్రస్తుతం భారీ వర్షాలతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటోంది. వరదలు, కొండచరియలు విరిగిపడటం, మెరుపు వరదలు సంభవించడం వలన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ పరిణామాలపై సుప్రీంకోర్టు దృష్టి సారించి కీలక వ్యాఖ్యలు చేసింది. అక్రమంగా చెట్లను నరికివేయడం (Illegal Tree Felling) వల్లనే పంజాబ్, జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్,ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ప్రకృతి వైపరీత్యాలు ఉధృతమవుతున్నాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ''ఉత్తర భారతంలో జరుగుతున్న ప్రకృతి విపత్తులను అందరం గమనిస్తున్నాం. ముఖ్యంగా కొండప్రాంతాల్లో అక్రమంగా చెట్లను నరుకుతున్నట్టు మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. వరద నీటిలో భారీ స్థాయిలో చెట్ల దుంగలు కొట్టుకుపోతున్న దృశ్యాలు కూడా ఆ వార్తల్లో వెలువడ్డాయి'' అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
వివరాలు
ఈ కేసు పై రెండు వారాల తర్వాత మళ్లీ విచారణ
కొండప్రాంతాల్లో వరుస విపత్తులు సంభవించడం వలన పర్యావరణ సమతుల్యం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం సుప్రీంకోర్టులో దాఖలైంది. దానిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ అంశం అత్యంత తీవ్రమైనదని పేర్కొంది. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వం, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, పంజాబ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు రెండు వారాల్లో సమర్పించాలని ఆదేశించింది. అంతేకాకుండా, వరద నీటిలో చెట్ల దుంగలు ఎందుకు ఇంత స్థాయిలో తేలియాడుతున్నాయో తెలుసుకోవాలని సంబంధిత అధికారులను సంప్రదించాలని కూడా ఆదేశించింది. ఈ కేసు పై రెండు వారాల తర్వాత మళ్లీ విచారణ జరగనుంది.
వివరాలు
వర్షాల కారణంగా ఉప్పొంగుతున్న యమునా నది
ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో కురుస్తున్న అతివృష్టి కారణంగా వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి పొంగిపొర్లుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో పలుమార్లు మేఘవిస్ఫోటనాలు (Cloud Bursts) సంభవించాయి. వీటితో అనేక ప్రాణనష్టాలు చోటుచేసుకున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కొండచరియలు తరచుగా విరిగిపడుతున్నాయి. పంజాబ్‌లో వరదలు విపరీతమైన నష్టాన్ని కలిగిస్తున్నాయి. దిల్లీకి వరద ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. నిరాశ్రయుల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలే వరద నీటిలో చిక్కుకుపోవడం పరిస్థితి తీవ్రతను ప్రతిబింబిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా యమునా నది ఉప్పొంగిపోతోంది.