
Narendra Modi:'ఆపరేషన్ సిందూర్' విజయానికి మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తి: బెంగళూరులో పీఎం మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌ను కుదిపేసిన 'ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)' విజయానికి వెనుక మేక్ ఇన్ ఇండియా శక్తి, దేశీయ సాంకేతికత ప్రధాన పాత్ర పోషించాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్ సమయంలో ప్రపంచం తొలిసారిగా ఆధునిక, శక్తివంతమైన భారత రూపాన్ని చూశిందని ఆయన అభిప్రాయపడ్డారు. రూ.15,610 కోట్ల వ్యయంతో బెంగళూరులో మూడో దశ మెట్రో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. నూతన భారత ప్రతీకగా బెంగళూరు అభివృద్ధి చెందుతోందని ప్రధాని అన్నారు.
వివరాలు
24 నగరాలకు మెట్రో సేవలు
"ఆపరేషన్ సిందూర్ సమయంలో మన సైనిక బలగాలు పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని, కొన్ని గంటల వ్యవధిలోనే ఆ దేశాన్ని మోకరిల్లేలా చేశాయి. ఈ విజయానికి 'మేక్ ఇన్ ఇండియా' స్ఫూర్తితో రూపొందిన దేశీయ టెక్నాలజీ, రక్షణ సామర్థ్యాలు ప్రధాన కారణం" అని తెలిపారు. భారత్ ఇప్పుడు ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగడం వైపు వేగంగా కదులుతోందని చెప్పారు. 2014 వరకు కేవలం ఐదు నగరాలకే పరిమితమైన మెట్రో సేవలు, ప్రస్తుతం 24 నగరాలకు విస్తరించాయని ఆయన వివరించారు.
వివరాలు
కేంద్రం కంటే రాష్ట్రం ఎక్కువ ఖర్చు
బెంగళూరు మెట్రో ప్రాజెక్టుపై కేంద్రం కంటే రాష్ట్ర ప్రభుత్వమే ఎక్కువ నిధులు వెచ్చిస్తున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. బెంగళూరులో మూడో దశ మెట్రో శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడుతూ.. "ఒప్పందం ప్రకారం ఈ ప్రాజెక్టుకు కేంద్రం, రాష్ట్రం సమానంగా నిధులు కేటాయించాలి. కానీ వాస్తవానికి రాష్ట్రం ఎక్కువగా ఖర్చు చేస్తోంది" అని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలలో మహారాష్ట్ర, గుజరాత్‌ల మాదిరే కర్ణాటకకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
వివరాలు
పీఎం పర్యటనలో పలు ప్రాజెక్టుల ప్రారంభం
బెంగళూరు పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ముందుగా బెంగళూరు-బెళగావి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించారు. అనంతరం వర్చువల్ విధానంలో అమృత్‌సర్-కాట్రా, నాగ్‌పుర్-పుణె వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు జెండా ఊపారు. బెంగళూరు-బెళగావి వందేభారత్ రైల్లో స్వయంగా ప్రయాణించి విద్యార్థులతో సంభాషించారు. అలాగే మెట్రో ప్రాజెక్టు కింద ఆర్‌వీ రోడ్-బొమ్మసంద్ర మధ్య 19.15 కిలోమీటర్ల ఎల్లో లైన్ మార్గాన్ని ప్రారంభించారు.