
Indo-Pakistan War: ఇండియా- పాకిస్థాన్ యుద్ధ చరిత్ర.. తప్పక తెలుసుకోవాల్సిందే !!
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశం,పాకిస్థాన్ దేశాల మధ్య సంబంధాలు స్థిరంగా లేకుండా ఎప్పుడూ ఉద్రిక్తతలతోనే ఉంటున్నాయి.
1947లో బ్రిటిష్ ఇండియా విభజన తర్వాత ఏర్పడిన ఈ రెండు దేశాల మధ్య కాశ్మీర్ సమస్య,సరిహద్దు తగాదాలు, ఉగ్రవాద కార్యకలాపాలు ఉద్రిక్తతలకు ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు.
ఇటీవల జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో చోటుచేసుకున్న ఉగ్రవాద దాడి కారణంగా, భారత్-పాకిస్తాన్ మధ్య మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది.
ఈ నేపథ్యంలో గతంలో జరిగిన యుద్ధాల విశ్లేషణతో పాటు, భవిష్యత్తులో జరిగే యుద్ధంలో ఎవరు పైచేయి సాధించగలరు అనే అంశాలను ఈ స్టోరీలో చూద్దాం.
పహల్గామ్ దాడి
పహల్గామ్ దాడిపై భారత్ ప్రతిస్పందన
పహల్గాం ఉగ్రవాద దాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్నిరేకెత్తించింది.స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచే పాకిస్తాన్ ఇలాంటి దుష్టయత్నాలు చేస్తూనే ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజలంతా ఈసారి పాకిస్తాన్‌కు కఠినంగా బుద్ధిచెప్పాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు.
దాడి అనంతరం భారత్ వెంటనే తీవ్ర చర్యలు ప్రారంభించింది.సింధూ జల ఒప్పందాన్ని రద్దు చేయడమే కాక, పాకిస్తాన్ పౌరులకు వీసాలు నిలిపివేసింది.
ఇంకా దౌత్య సంబంధాలనూ విరమించింది.కానీ ఇవి భారత ప్రజలకు తృప్తిని కలిగించలేకపోయాయి.
పాకిస్తాన్ సైన్యం సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ,యుద్ధ విమానాలను తరలించడం వంటి చర్యలతో భారతీయుల్లో మరింత ఆగ్రహం పెరిగింది.
పాకిస్తాన్ చాలా కాలంగా కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్నది బహిరంగ రహస్యమే అయినా, వారు ఎప్పుడూ తమ ప్రమేయాన్ని బుకాయిస్తూ వస్తున్నారు.
వివరాలు
ఉగ్రవాద దాడులపై పాక్ వైఖరి
2001లో భారత పార్లమెంట్‌పై దాడి, 2008 ముంబై హత్యాకాండ,2019 పుల్వామా పేలుళ్లు వంటి దాడుల విషయంలో తమ ప్రమేయాన్ని మొదట పాకిస్తాన్ ఒప్పుకోలేదు.
కానీభారత్ ఈ దాడులకు పాక్ ప్రమేయంపై స్పష్టమైన ఆధారాలను ప్రపంచానికి చూపిన తరువాత, అంతర్జాతీయ ఒత్తిడికి లోనై పాకిస్తాన్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
ఇప్పుడు కూడా పాకిస్తాన్‌ను ఒంటరిగా చేయడానికి భారత్ ఐక్యరాజ్య సమితికి ఆధారాలు సమర్పించి, దౌత్యపరంగా నేరుగా ఎదుర్కొంటోంది.
ఇకపాకిస్తాన్ పరిస్థితి చూస్తే,ఆర్థికంగా తీవ్ర కష్టాల్లో ఉంది.
రాజకీయంగా కూడా అస్థిరత కొనసాగుతోంది.బలూచిస్తాన్ వేర్పాటువాద ఉద్యమాలు,సైన్యం-ప్రభుత్వం మధ్య చిచ్చు తీవ్రంగా ఉంది.
ఈనేపథ్యంలో భారత్ పాకిస్తాన్‌పై దౌత్య,ఆర్థిక,సైనిక ఒత్తిడి పెంచుతోంది.
దీంతో ఇప్పుడు పాకిస్తాన్‌ను బలహీనపరిచేందుకు ఇదే అనువైన సమయం అనే అభిప్రాయాలు పౌరల్లో వ్యక్తమవుతున్నాయి.
వివరాలు
భారత్-పాకిస్తాన్ మధ్య గత యుద్ధాలు
ప్రస్తుతం సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్నాయి. రెండు దేశాలూ తమ సైన్యాన్ని అప్రమత్తం చేశాయి.
మళ్లీ ఒకవేళ యుద్ధం జరిగితే, అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే, గతంలో జరిగిన యుద్ధాల చరిత్రను పరిశీలించాలి.
1947 - మొదటి కాశ్మీర్ యుద్ధం:
ఇది భారత విభజన అనంతరం తలెత్తిన మొదటి ప్రధాన యుద్ధం. జమ్ముకశ్మీర్ రాజ్యం భారత్‌లో విలీనమవుతున్నట్లు ప్రకటన చేసిన తర్వాత, పాకిస్తాన్ మద్దతుతో గిరిజన దళాలు కాశ్మీర్‌లోకి చొరబడ్డాయి. భారత సైన్యం గిరిజన దళాలను వెనక్కి తరిమి కొట్టింది. చివరికి ఐక్యరాజ్యసమితి జోక్యంతో కాల్పుల విరమణ జరిగింది. అయితే కాశ్మీర్ మూడవ వంతు భాగం పాక్ ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఇదే ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK)గా పిలుస్తున్నారు.
1965
1965:రెండవ కాశ్మీర్ యుద్ధం:
పాకిస్తాన్ "ఆపరేషన్ జిబ్రాల్టర్"అనే ఆపరేషన్‌తో తిరుగుబాటుదారులను పంపి, కాశ్మీర్‌లో అంతరాయం కలిగించాలనుకుంది. భారత సైన్యం దీన్ని సమర్థవంతంగా తిప్పికొట్టి యుద్ధం ప్రారంభమైంది. భారత్ పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి కీలక ప్రాంతాలను ఆక్రమించింది. తర్వాత తాష్కెంట్ ఒప్పందం ద్వారా భూభాగాలను పరస్పరం తిరిగి ఇచ్చుకున్నారు. ఈ యుద్ధంలోనూ భారత్ కచ్చితంగా పైచేయి సాధించింది.
1971 - బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం:
తూర్పు పాకిస్తాన్ ప్రజలు(ప్రస్తుతం బంగ్లాదేశ్)స్వాతంత్ర్యాన్ని కోరుతూ ఉద్యమించగా,పాకిస్తాన్ సైన్యం దాన్ని అణిచివేయటానికి దాడులు చేసింది.భారత్ బంగ్లాదేశ్‌కు మద్దతు ఇచ్చి యుద్ధంలో పాల్గొంది.అతి తక్కువ కాలంలో తూర్పు పాకిస్తాన్‌ను భారత్ పూర్తిగా తన అధీనంలోకి తీసుకుంది. 93వేల మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు.దీంతో బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించింది.భారత్‌కు ఇది గర్వకారణంగా నిలిచింది.
కార్గిల్
1999: కార్గిల్ యుద్ధం:
పాకిస్తాన్ సైన్యం, ఉగ్రవాదులు కలిసి కార్గిల్‌లోని ఎత్తైన ప్రాంతాల్లోకి చొరబడటంతో ఈ యుద్ధం ప్రారంభమైంది.
భారత్ "ఆపరేషన్ విజయ్" పేరుతో విరుచుకుపడింది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో భారత్ తన భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది.
పాకిస్తాన్ అంతర్జాతీయ ఒత్తిడికి లోనై వెనక్కి తగ్గింది. ఈ యుద్ధంలోనూ భారత్ విజయతీరానికి చేరింది.
వివరాలు
ప్రస్తుత పరిస్థితి: ఎవరు పైచేయి సాధిస్తారు?
యుద్ధం జరిగితే, భారత్ స్పష్టంగా పైచేయి సాధిస్తుందనడానికి అనేక కారణాలున్నాయి..
సైనిక శక్తి: గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్ 2025 ప్రకారం, భారత్ ప్రపంచంలో నాల్గవ అత్యంత శక్తివంతమైన సైన్యం కలిగిన దేశంగా ఉంది. 14 లక్షలమందికి పైగా సైనికులు, వేలాదిగా సాయుధ వాహనాలు, అత్యాధునిక యుద్ధ విమానాలు (రాఫెల్, సుఖోయ్), బ్రహ్మోస్ క్షిపణులు, అర్జున్ ట్యాంకులు ఉన్నాయి.
పాకిస్తాన్ పరిస్థితి: పాకిస్తాన్ 12వ స్థానానికి పడిపోయింది. సైనికంగా తక్కువ బలం, ఆర్థికంగా తీవ్ర బలహీనతలు, రాజకీయ అస్థిరత, అంతర్గత వ్యతిరేకతలు, వేర్పాటువాద ఉద్యమాలు వంటి సమస్యలు పాక్‌ను వెనక్కి లాగుతున్నాయి.
వివరాలు
ప్రస్తుత పరిస్థితి: ఎవరు పైచేయి సాధిస్తారు?
అంతర్జాతీయ మద్దతు: భారత్‌కు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ వంటి దేశాల మద్దతు ఉంది.
పాకిస్తాన్‌కు చైనా, కొన్ని ఇస్లామిక్ దేశాల మద్దతు ఉన్నా, అంతర్జాతీయంగా అది సరిపడదు.
ఆర్థిక స్థితి: భారత్ రక్షణ బడ్జెట్ దాదాపు 75 బిలియన్ డాలర్లుగా ఉంది, పాకిస్తాన్ బడ్జెట్ కేవలం 7.6 బిలియన్ డాలర్లే. భారత్ ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది.
భారత్-పాకిస్తాన్ మధ్య గత నాలుగు యుద్ధాల్లో భారత్ విజయం సాధించినట్లుగా చరిత్ర స్పష్టం చేస్తోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో సైనిక, ఆర్థిక, దౌత్య బలాలను పరిగణనలోకి తీసుకుంటే, భారత్ మళ్లీ పైచేయి సాధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
అయితే యుద్ధం ఎప్పటికీ చివరి ఎంపికే కావాలి. శాంతి మాత్రమే శాశ్వత పరిష్కారం.