Page Loader
Swachh Survekshan Awards: 'క్లీన్‌ సిటీ'గా ఎనిమిదోసారి ఇండోర్.. స్వచ్ఛ స‌ర్వేక్షన్ అవార్డు అంద‌జేసిన రాష్ట్రప‌తి ముర్ము 
స్వచ్ఛ స‌ర్వేక్షన్ అవార్డు అంద‌జేసిన రాష్ట్రప‌తి ముర్ము

Swachh Survekshan Awards: 'క్లీన్‌ సిటీ'గా ఎనిమిదోసారి ఇండోర్.. స్వచ్ఛ స‌ర్వేక్షన్ అవార్డు అంద‌జేసిన రాష్ట్రప‌తి ముర్ము 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 17, 2025
01:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరం మరోసారి పరిశుభ్రతలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరాల జాబితాలో ఇది మళ్లీ మొదటి స్థానాన్ని సంపాదించింది. 2024 సంవత్సరానికి గానూ ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2024లో ఇది వరుసగా ఎనిమిదోసారి ఈ ఘనతను సాధించింది. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరం ఈసారి రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. గడిచిన ఏడాది ఇందోర్, సూరత్ సంయుక్తంగా మొదటి స్థానాన్ని పంచుకున్న విషయం తెలిసిందే.

వివరాలు 

స్వచ్ఛ సర్వేక్షణ్ మిషన్ కింద దేశవ్యాప్తంగా 4,500 నగరాల పరిశీలన 

3-10 లక్షల జనాభా కలిగిన నగరాల కేటగిరీలో నోయిడా నగరం మొదటి స్థానాన్ని దక్కించుకుంది. చండీగఢ్, మైసూరు తదుపరి స్థానాల్లో నిలిచాయి. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ వేదికగా గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ మిషన్ కింద దేశవ్యాప్తంగా 4,500 నగరాలను పరిశీలించారు. పారిశుద్ధ్యం, చెత్త నిర్వహణ, ప్రాథమిక సేవల అందుబాటు వంటి పలు అంశాల ఆధారంగా నగరాలను ర్యాంక్ చేయడం జరుగుతుంది. ఇక మరోవైపు,కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని స్వచ్ఛ భారత్ మిషన్ కింద వివిధ కేటగిరీల ఫలితాలను శనివారం వెల్లడించిన విషయం తెలిసిందే.

వివరాలు 

హైదరాబాద్ 7 స్టార్ రేటింగ్

'వ్యర్థాల రహిత నగరం' కేటగిరీలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ 7 స్టార్ రేటింగ్ సాధించింది. గతంలో దీనికి 5 స్టార్ రేటింగ్ మాత్రమే ఉండేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సూపర్ స్వచ్ఛ లీగ్ అవార్డులలో, 10 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన నగరాల కేటగిరీలో విజయవాడ నగరం అవార్డును పొందింది. 3 లక్షల నుండి 10 లక్షల లోపు జనాభా కలిగిన నగరాల్లో గుంటూరు ఎంపికైంది. 50 వేల నుండి 1 లక్ష జనాభా మధ్య ఉన్న నగరాల్లో తిరుపతి నగరపాలక సంస్థ అవార్డు పొందింది.