Karnataka-Neha Hiremath Murder-Political Issue: కర్ణాటకలో రాజకీయ రంగు పులుముకున్న నేహ హీరేమత్ హత్య ఘటన
కర్ణాటక(Karnataka) కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ఈ హత్య ఘటన కాంగ్రెస్ (Congress), బీజేపీ (Bjp)ల మధ్య ఉప్పు నిప్పుగా మారింది. హుబ్బళి (Hubbali)లో కాంగ్రెస్ నేత కుమార్తెను ఆమె చదువుతున్న కళాశాల పూర్వ విద్యార్థి కత్తితో దారుణంగా పొడిచాడు. అతడి కోర్కెలను తిరస్కరించినందుకే ఆ యువతిని హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నేహా హిరేమత్ (Neha Hiremath) (23) ఓ కళాశాలలో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ మొదటి ఏడాది చదువుతోంది. అంతకుముందు అతడి క్లాస్ మేట్ అయిన ఫయాజ్ ఖోండు నాయక్ స్నేహంగా ఉండేవారు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిందని పోలీసుల విచారణలో తేలింది.
దూరంగా పెట్టడంతోనే కక్ష పెంచుకున్న ఫయాజ్...
గత కొద్దికాలంగా ఫయాజ్ ను నేహా హిరేమత్ కు దూరంగా ఉంటోంది. దీంతో నేహాపై కక్ష పెంచుకున్న ఫయాజ్ ఆమెను కత్తితో ఏడుసార్లు దారుణంగా పొడిచి దారుణంగా హత్య (Murder) చేశాడు. ఇప్పుడు ఈ ఘటన అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య రాజకీయ వివాదంగా మారింది. నేహా హత్యను వ్యక్తిగత కోణంలో జరిగిన ఘటనగా కాంగ్రెస్ చెబుతుంటే బీజేపీ మాత్రం ఇందులో లవ్ జిహాద్ కోణం ఉందని ఆరోపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించిపోయాయని బీజేపీ విమర్శిస్తోంది. కేంద్ర మంత్రి, ధార్వాడ్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ప్రహ్లాద్ జోషి కూడా నేహా హత్య వెనుక లవ్ జిహాద్ కోణం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మైనారిటీ వర్గాలపై బుజ్జగింపు రాజకీయాలు ఆపాలి: ప్రహ్లాద్ జోషి
కేవలం మైనారిటీ వర్గాలపై బుజ్జగింపు రాజకీయాలు ఆపాలని, ఆ వర్గానికి ప్రత్యేకంగా చూడటం తగదని వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ప్రహ్లాద్ జోషి కోరారు. దీనికి రాష్ట్ర హోం శాఖ మంత్రి జి. పరమేశ్వర స్పందిస్తూ...నేహా హత్య ఘటనలో లవ్ జిహాద్ కోణం లేదని స్పష్టం చేశారు. అయితే బాలిక తండ్రి నిరంజన్ హిరేమత్ మాత్రం ఈ ఘటన వెనుక లవ్ జిహాద్ కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. తన కూతురుని ట్రాప్ చేసేందుకు ఫయాజ్ ప్రయత్నించాడని చెప్పారు. చాలా కాలంగా తన కూతురిని ఈ ముఠా వెంబడిస్తోందని ఆరోపించారు. నేహాను బెదిరించారని అయితే వారి బెదిరింపులకు తన కూతురు లొంగలేదని అందుకే ఆమెను హత్య చేశాడని తెలిపారు.
గవర్నర్ పాలన పెట్టాలని బీజేపీ చూస్తోంది: డీకే శివకుమార్
రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగానే ఉన్నాయని, కర్ణాటకలో గవర్నర్ పాలన విధించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ సమాధానమిచ్చింది. "బీజేపీ మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తోంది... కర్ణాటకలో శాంతి భద్రతలు బాగానే ఉన్నాయి.. బీజేపీ నేత ఆర్ అశోక రాష్ట్రాన్ని గవర్నరు పాలనలో ఉంచాలని చూస్తున్నారు, కానీ అది అసాధ్యమ''ని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. ఇదిలా ఉండగా...హుబ్బళ్లిలోని విద్యానగర్ పోలీస్‌స్టేషన్ వెలుపల పెద్ద ఎత్తున హిందూ సంఘాలకు చెందిన కార్యకర్తలు ఆందోళణ చేపట్టారు. ముస్లిం నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా, నేహా హత్యపై పలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి.