
ఖమ్మం రాజకీయాల్లో కీలక పరిణామం.. జూలై 2న కాంగ్రెస్‌లోకి పొంగులేటి, జూపల్లి
ఈ వార్తాకథనం ఏంటి
ఖమ్మం రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎట్టకేలకు జిల్లా దిగ్గజ నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు హస్తం గూటికి చేరనున్నారు. ఈ మేరకు వారిద్దరి చేరికలకు ముహూర్తం ఖరారైంది.
జూలై 2న ఖమ్మంలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. సభలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
తొలుత ఈ నెల 25న రాహుల్‌తో ఈ నేతలిద్దరూ ప్రత్యేకంగా సమావేశమై తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు.
మరుసటి రోజు అక్కడే మీట్ ది ప్రెస్ సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్‌లో చేరుతున్నామని ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
DETAILS
నేడు పొంగులేటి ఇంటికి టీపీసీసీ రేవంత్ రెడ్డి
మరోవైపు ఇవాళ పొంగులేటి నివాసానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ క్రమంలో ఆయన్ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించనున్నారు. అనంతరం జూపల్లి కృష్ణారావునూ కాంగ్రెస్ లోకి రమ్మని ఆహ్వానిస్తారు.
భాజపా కండువా కప్పుకోవాలని ఇప్పటికే పొంగులేటి, జూపల్లితో భాజపా చేరికల కమిటీ ఛైర్మన్, ఆ పార్టీ కీలక నేత ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలు చర్చించినా ప్రయోజనం లేకపోయింది.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడమే సరైందన్న అభిప్రాయానికి ఈ ఇద్దరు నేతలు వచ్చారని తెలుస్తోంది.
ఈ క్రమంలో వీరి వెంట జిల్లా నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ముగ్గురు జడ్పీ ఛైర్మన్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని సమాచారం.