
Nara Lokesh: ఐదేళ్లలో రూ.45వేల కోట్ల పెట్టుబడులు.. సింగపూర్ ప్రభుత్వ సంస్థ జీఐఎస్-తమసెక్‌తో ఒప్పందం
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రానికి వచ్చే ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల పెట్టుబడులు రానున్నట్టు,సింగపూర్‌కు చెందిన జీఐఎస్-తమసెక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఈ పెట్టుబడులు సింగపూర్ ప్రభుత్వ సావరిన్ ఫండ్ ద్వారా వస్తున్నాయని తెలిపారు. ఇది రాష్ట్ర యువతకు శుభవార్త కాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌కు మాత్రం చెడు వార్త అని వ్యాఖ్యానించారు. జగన్ హయాంలో నష్టపోయిన సింగపూర్‌తో సంబంధాలను పునరుద్ధరించడం, పెట్టుబడులు తీసుకురావడం, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌ను మెరుగుపర్చడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన లక్ష్యమని తెలిపారు. ఈ నేపథ్యంలో నాలుగురోజులపాటు సాగిన సింగపూర్ పర్యటన విజయవంతమైందని పేర్కొన్నారు. గురువారం ఉండవల్లిలోని తన నివాసంలో విలేకర్లతో పర్యటన విశేషాలను పంచుకున్నారు.
వివరాలు
జగన్ అభివృద్ధికి అడ్డుకట్ట వేయాలని కుట్రలు
సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం,మాజీ ప్రధాని,సీనియర్ మంత్రి లీ సైన్ లూంగ్ సహా పారిశ్రామికవేత్తలు,వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించామని తెలిపారు. ముఖ్యమంత్రి మొత్తం 26 ముఖాముఖి సమావేశాల్లో పాల్గొనగా, తానే స్వయంగా 19 మంది పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యానని చెప్పారు. అంతేకాక, 16 రౌండ్‌టేబుల్ కాన్ఫరెన్సుల్లో పాల్గొన్నానన్నారు. ఈ సమావేశాల్లో ఐటీ, ఎలక్ట్రానిక్స్, రక్షణ, ఫుడ్ ప్రాసెసింగ్, డ్రోన్లు, గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్లు,సెమీకండక్టర్ల వంటి రంగాల్లో పెట్టుబడులపై చర్చించామని వివరించారు. చంద్రబాబు ఉదయం 8 గంటల నుండి రాత్రి 11.30 వరకు నిరంతరం సమావేశాల్లో పాల్గొంటూ పెట్టుబడుల కోసం కృషి చేస్తే, జగన్ మాత్రం నేరపూరిత రాజకీయాలకు పాల్పడి అభివృద్ధికి అడ్డుకట్ట వేయాలని కుట్రలు పన్నారని లోకేశ్ విమర్శించారు.
వివరాలు
సింగపూర్ ప్రభుత్వానికి వైసీపీ తప్పుడు ఈమెయిల్స్
సింగపూర్ ప్రభుత్వానికి తప్పుడు సమాచారం పంపే ప్రయత్నాలు కూడా జరిగినట్టు లోకేశ్ ఆరోపించారు. తాము అక్కడ పర్యటిస్తున్న సమయంలో మురళీకృష్ణ అనే వ్యక్తి సింగపూర్ ప్రభుత్వం,మంత్రులు, అధికారులు,హైకమిషనర్‌కు 'ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం అస్థిరంగా ఉంది,ఎప్పుడైనా పడిపోవచ్చు, అందువల్ల పెట్టుబడులు పెట్టకండి' అంటూ తప్పుడు ఈమెయిల్స్ పంపాడని చెప్పారు. ఈ వ్యక్తి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పీఎల్‌ఆర్ సంస్థతో, కొంతమంది వైసీపీ మాజీ ఎమ్మెల్యేలతో తరచూ మాట్లాడుతున్నట్టు తమకు సమాచారం వచ్చిందన్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రగా దీనిని అభివర్ణించారు.టీసీఎస్‌కు విశాఖలో ఒక ఎకరా భూమిని 99 పైసల చొప్పున కేటాయించగా,వైకాపా నేతలు కోర్టుకి వెళ్లి అభ్యంతరం వ్యక్తం చేయడంతో చివరికి హైకోర్టు వారిపై అక్షింతలు వేసిందని గుర్తు చేశారు.
వివరాలు
సింగపూర్ సంస్థలకు చంద్రబాబు భరోసా
సింగపూర్ ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సింగపూర్‌లోని సంస్థలకు సీఎం చంద్రబాబు భరోసా కల్పించారని లోకేశ్ తెలిపారు. ఒక మంత్రిని కలిసిన అనంతరం ఆయన ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్‌ను గుర్తు చేస్తూ, 2019లో వచ్చిన ప్రభుత్వం తమ ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేసిందని ఆయన వాపోయినట్టు చెప్పారు. చంద్రబాబు అలాంటి అవిశ్వాసాలను తొలగించి, రాష్ట్రాభివృద్ధికి స్పష్టమైన మార్గసూచికను రూపొందిద్దామని, చట్టబద్ధత కల్పిద్దామని హామీ ఇచ్చారని వివరించారు. దీంతో, సింగపూర్ సంస్థలు అమరావతి సహా ప్రత్యేక ఆర్థిక మండళ్లు, పోర్టుల ప్రాజెక్టులలో పాల్గొనడానికి ఆసక్తి చూపాయని తెలిపారు.
వివరాలు
మోదీ స్ఫూర్తితోనే తక్కువ ధరకు భూములు
భూముల కేటాయింపుపై కూడా లోకేశ్ వివరణ ఇచ్చారు. టాటా నానో పరిశ్రమ పశ్చిమ బెంగాల్ నుంచి వెనక్కు వెళ్లినప్పుడు, గుజరాత్ సీఎం నరేంద్ర మోదీ ఒక్కో ఎకరా భూమిని రూపాయికే కేటాయించిన ఉదాహరణను ప్రస్తావించారు. తమ ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో ఐటీ సంస్థలకు తక్కువ ధరకు భూములు ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. భూములు భారతి సిమెంట్స్‌కు గానీ, హెరిటేజ్‌కి గానీ ఇవ్వలేదని, టీసీఎస్, కాగ్నిజెంట్, డేటా సెంటర్లకు మాత్రమే కేటాయించామని స్పష్టం చేశారు. విశాఖలో టీసీఎస్ సెప్టెంబర్‌లో, కాగ్నిజెంట్ అక్టోబర్‌లో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు చెప్పారు.