
PM Modi: మణిపూర్‌లో రేపు మోదీ పర్యటన.. కన్ఫర్మ్ చేసిన ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మణిపూర్‌లో పర్యటించనున్నారు. 2024 మే నెలలో మణిపూర్‌లో రెండు వర్గాల మధ్య తీవ్రమైన హింస చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత ఆ రాష్ట్రాన్ని ప్రధాని మోదీ తొలిసారి సందర్శించనున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్న విషయాన్ని ఇవాళ పీఐబీ వెల్లడించింది. మణిపూర్‌తో పాటు మిజోరం, అస్సాం, పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాల్లో 13 నుండి 15వ తేదీల మధ్య ప్రధాని పర్యటించనున్నారని PIB వెల్లడించింది.
వివరాలు
మణిపూర్‌లో సుమారు 7300 కోట్లకు సంబంధించిన అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన
ప్రధాని మోదీ పర్యటన లక్ష్యం సమగ్ర, సుస్థిర, సమృద్ధికరమైన అభివృద్ధిని పునర్నిర్మించడమే. మణిపూర్‌లోని చురాచాంద్‌పుర్ ప్రాంతంలో సుమారు 7,300 కోట్ల రూపాయల విలువ కలిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన చేయనున్నారు. మణిపూర్ అర్బన్ రోడ్స్, డ్రైనేజ్, అసెట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ కోసం 3,600 కోట్లు ఖర్చు చేయనున్నారు. అదేవిధంగా, 2,500 కోట్లతో ఐదు జాతీయ రహదారులను నిర్మించనున్నారు. మణిపూర్ ఇన్‌ఫోటెక్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, మరియు 9 ప్రాంతాల్లో వర్కింగ్ వుమెన్స్ హాస్టల్స్ నిర్మాణం కోసం పలు పనులు ప్రారంభం కానున్నాయి. ఇంపాల్‌లో సుమారు 1,200 కోట్ల ఖర్చుతో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఆవిష్కరిస్తారు.
వివరాలు
బీహార్‌లో జాతీయ మకానా బోర్డు
ఈశాన్య రాష్ట్రాల్లో మొత్తం సుమారు 71,850 కోట్ల రూపాయల విలువ కలిగిన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. బీహార్‌లో జాతీయ మకానా బోర్డు ప్రారంభించనున్నారు. ప్రాంతీయ సంబంధాలను బలోపేతం చేసేందుకు బీహార్‌లోని పుర్నియా విమానాశ్రయంలో కొత్త టర్మినల్ భవనం ప్రారంభం కానుంది. పుర్నియాలో సుమారు 36,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపట్టనున్నారు. మిజోరంలోని ఐజ్వాల్‌లో సుమారు 9,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించబడనున్నాయి. మిజోరంలో బైరాబి-సైరంగ్ మధ్య కొత్త రైల్వే లైన్ ప్రారంభం కానుంది.
వివరాలు
అస్సాంలో 18,350 కోట్ల విలువైన పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు.
అస్సాం గౌహతిలో జరగనున్న డాక్టర్ భూపెన్ హజారికా శతజయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. అస్సాంలో సుమారు 18,350 కోట్ల విలువైన పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. మణిపూర్‌లో మోదీ పర్యటనకు సంబంధించి రాహుల్ గాంధీ స్పందించారు. మణిపూర్ ఇష్యూ చాన్నాళ్ల నుంచి ఉందన్నారు. ప్రధాని అక్కడకు వెళ్ళడం సంతోషకరంగా ఉందని అన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వోట్ చోరీ అంశం కీలకంగా మారిందన్నారు. హర్యానా, మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలను మార్చేశారన్నారు. వోట్ చోరీ జరిగినట్లు ప్రజలు ఆరోపిస్తున్నారని రాహుల్ అన్నారు.
వివరాలు
మోదీ పర్యటనపై స్పందించిన సీపీఎం నేత బృందా కారత్
సీపీఎం నేత బృందా కారత్ కూడా మోదీ పర్యటనపై స్పందించారు. తీవ్ర సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని ఇంతకాలం ప్రధాని సందర్శించకపోవడం వరల్డ్ రికార్డుగా భావించాల్సి వస్తోందన్నారు. సంక్షోభం ఉన్న పరిస్థితుల్లో జోక్యం చేసుకోవాల్సిన ప్రధాని అప్పుడు మౌనంగా ఉన్నారని ఆరోపించారు. రెండు సంవత్సరాలుగా ఆ రాష్ట్రంలో అక్రమాలు జరుగుతున్నా ఆయన బాధ్యత వహించడంలేదని ఆమె పేర్కొన్నారు.