Page Loader
Banakacherla Project: ఏపీకి బిగ్ షాక్ ఇచ్చిన కేంద్రం.. బనకచర్ల ప్రాజెక్ట్‎కు అనుమతులు నిరాకరణ
ఏపీకి బిగ్ షాక్ ఇచ్చిన కేంద్రం.. బనకచర్ల ప్రాజెక్ట్‎కు అనుమతులు నిరాకరణ

Banakacherla Project: ఏపీకి బిగ్ షాక్ ఇచ్చిన కేంద్రం.. బనకచర్ల ప్రాజెక్ట్‎కు అనుమతులు నిరాకరణ

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 01, 2025
08:54 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు తాత్కాలికంగా ఆటంకం ఏర్పడింది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల కొరకు అవసరమైన విధివిధానాలు (టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ - టీవోఆర్) జారీచేయాలని ఏపీ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను కేంద్ర అటవీ,పర్యావరణ,వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) తిరస్కరించింది. ప్రాజెక్టును ముందుకు సాగించాలా లేదా అనే నిర్ణయం కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తీసుకోవాలనేది ఈఏసీ స్పష్టం. ఎందుకంటే,ఇది అంతర్రాష్ట్ర అంశాలకు సంబంధించినది కాబట్టి టీవోఆర్‌ను తాము నిర్ధారించలేమని పేర్కొంటూ, ఏపీ ప్రభుత్వం జూన్ 5న దాఖలు చేసిన అభ్యర్థనను తిరస్కరించి తిరిగి పంపించారు.

వివరాలు 

అంతర్రాష్ట్ర అంశాలు ఇమిడి ఉన్నందున టీవోఆర్‌ నిర్ణయించలేం 

ఈ అభ్యర్థనపై జూన్ 17న రివర్ వ్యాలీ, హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్‌కు చెందిన ఈఏసీ కమిటీ చైర్మన్ జి.జె.చక్రపాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో విస్తృతంగా చర్చించడంతోపాటు, జూన్ 17న తీసుకున్న నిర్ణయాన్ని జూన్ 24న అధికారికంగా ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటికే పర్యావరణ అనుమతులు ఉన్నా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ముంపునకు సంబంధించిన అంశాలు న్యాయస్థానాల్లో విచారణలో ఉన్నాయని ఈఏసీ తెలిపింది. అంతేగాక, బనకచర్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల వినియోగం ట్రైబ్యునల్ నిబంధనలను ఉల్లంఘించేలా ఉంటుందని పలువురు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదులు చేసినట్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో, వరద జలాల లభ్యతపై స్పష్టత కోసం కేంద్ర జల సంఘంతో సంప్రదించి సమగ్ర అంచనా వేయాల్సి ఉంటుందని అభిప్రాయపడింది.

వివరాలు 

పర్యావరణ అంచనాల ప్రక్రియ కోసం ఈఏసీని సంప్రదించాలి 

అంతర్రాష్ట్ర సమస్యలను పరిగణనలోకి తీసుకొని,తగిన అనుమతుల కోసం ముందుగా సీడబ్ల్యూసీతో సంప్రదించాల్సిందిగా, ఆ అనుమతుల అనంతరం మాత్రమే పర్యావరణ అంచనాల ప్రక్రియ కోసం తమను సంప్రదించాలని ఈఏసీ సూచించింది. ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి సాగు,తాగునీటి అవసరాల నిమిత్తంగా ప్రతిపాదించిన విషయం తెలిసిందే. పోలవరం కుడికాల్వకు సమాంతరంగా మరో కాల్వ తవ్వి, 90 నుండి 120 రోజుల్లో 200 టీఎంసీల వరద నీటిని తరలించడం దీని ప్రధాన లక్ష్యం. ఈ కాల్వ ద్వారా మొదట పోలవరం నుంచి నీటిని ప్రకాశం బ్యారేజీ వరకు తీసుకెళ్లి, అక్కడి నుంచి నాగార్జునసాగర్ కుడికాల్వ మీదుగా పల్నాడు జిల్లాలో నిర్మించనున్న బొల్లాపల్లి రిజర్వాయర్‌కు (173 టీఎంసీల సామర్థ్యం) తరలిస్తారు.

వివరాలు 

గతంలో సీఎం రేవంత్‌, మంత్రి ఉత్తమ్‌ లేఖలు, వినతిపత్రం

అక్కడి నుంచి నీటిని బనకచర్ల క్రాస్ రెగ్యులేటరీకి తరలించాలన్నదే ప్రాజెక్టు ప్రణాళిక. మొత్తం రూ.81,900కోట్ల వ్యయంతో నిర్మించదలచిన ఈ ప్రాజెక్టు ద్వారా 3 లక్షల హెక్టార్లకు పైగా కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించడంతోపాటు,ఇప్పటికే ఉన్న 9.14లక్షల హెక్టార్ల ఆయకట్టును స్థిరీకరించేందుకు,దాదాపు 80 లక్షల మందికి తాగునీరు,అలాగే పారిశ్రామిక అవసరాల కోసం 20టీఎంసీల నీటిని ఇవ్వాలని ప్రభుత్వ యోచన. అయితే ఈ ప్రాజెక్టుపై తెలంగాణలో అధికార పక్షం,విపక్షం మధ్య తీవ్రమైన వివాదం నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు లేఖ రాస్తూ, టీవోఆర్ జారీ చేయవద్దని కోరారు.

వివరాలు 

ఈఏసీ తీసుకున్న తాజా నిర్ణయంపై ప్రాధాన్యత

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్‌ను ఢిల్లీలో కలిసి కూడా లేఖలు అందించారు. అంతేకాదు, పలు విధాలుగా ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈఏసీ తీసుకున్న తాజా నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. గోదావరి బేసిన్‌లోని వరద జలాలను అదే రాష్ట్రంలోని కరువుతో బాధపడుతున్న ప్రాంతాలకు తరలించేందుకు ప్రాజెక్టు రూపుదిద్దుకున్నప్పటికీ, నీటి లభ్యతపై అంతర్రాష్ట్ర అభ్యంతరాల నేపథ్యంలో సీడబ్ల్యూసీ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది.