
NDA Meet: ఆపరేషన్ సిందూర్ విజయంపై ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని మోదీకి సన్మానం
ఈ వార్తాకథనం ఏంటి
ఎన్డీఏ (NDA) భాగస్వామ్య పక్షాల పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఈ అత్యంత కీలక భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. పార్లమెంటులో ప్రస్తుతం ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో,ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యత లభించింది. సమావేశంలో ప్రధానంగా విపక్షాల విమర్శలకు మోదీ సమాధానం ఇచ్చే అవకాశం ఉండగా, పార్లమెంట్‌లో అధికార పక్షం చేపట్టాల్సిన వ్యూహాలపై సభ్యులకు మార్గనిర్దేశం చేయనున్నారు. ఇక సమావేశానికి ముందు,పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులపై భారత్ విజయవంతంగా నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో, ఎన్డీయే నేతలు ప్రధాని మోదీని సన్మానించారు. అదే సమయంలో, ఈ భేటీలో కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం.
వివరాలు
మోదీ,అమిత్ షా - రాష్ట్రపతితో వరుస భేటీలు: రాష్ట్రహోదా చర్చల సంకేతాలేనా?
సంబంధిత వర్గాల ప్రకారం, సమావేశం కొన్ని ప్రాధాన్య విషయాల్లో నిర్ణయాలకు వేదిక కావొచ్చని అంచనా. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో విడివిడిగా రాష్ట్రపతి భవన్‌లో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలు కొన్ని గంటల వ్యవధిలోనే చోటుచేసుకోవడం విశేషం.అయితే అధికారికంగా ఈ భేటీలపై ఎటువంటి ప్రకటన వెలువడలేదు. అయినా జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్ధరణపై చర్చలు జరిగి ఉండవచ్చని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు చెలామణి అవుతున్నాయి. ప్రత్యేకంగా ఆర్టికల్ 370 రద్దయి ఆరు సంవత్సరాలు పూర్తవుతున్న సమయంలో ఈ భేటీలు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలతో జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా ఇవ్వబోతున్నారా అనే ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి.
వివరాలు
ఊహాగానాలను ఖండించిన ఒమర్ అబ్దుల్లా
ఇదిలా ఉండగా, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ ఊహాగానాలపై స్పందించారు. ఎన్డీయే పార్లమెంటరీ సమావేశంలో జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించడంపై చర్చలు జరగవని తాను అనుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసేలోపు కేంద్రం నుంచి కశ్మీర్‌పై సానుకూల నిర్ణయం వెలువడుతుందని తనకు విశ్వాసముందన్నారు. ఇందుకు తోడుగా, రాష్ట్రహోదా పునరుద్ధరణ అంశంపై తాను ఇంకా ఆశాభావంతో ఉన్నానని స్పష్టంచేశారు. అయితే ఈ అంశంపై తుదిగా ప్రధాని మోదీ ఎలాంటి ప్రకటన చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.