Ayodhya Temple: జనవరి 22న అయోధ్యలో మోదీ.. మరి 'ఇండియా' కూటమి నేతలు ఎక్కడంటే!
జనవరి 22న అయోధ్యలో ప్రధాన నరేంద్ర మోదీ అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవాన్ని ముందుండి నడిపించనున్నారు. మరి, రామాలయ ప్రారంభోత్సవానికి రాబోమని ప్రకటించిన, ఆహ్వానం అందని ప్రతిపక్ష 'ఇండియా' కూటమి నేతలు ఆరోజు ఏం చేయబోతున్నారు? రానున్న సార్వత్రిక ఎన్నికల్లో హిందువుల ఓటు బ్యాంకు చేజారిపోకుండా ఉండేందుకు ప్రతిపక్ష నేతలు జనవరి 22న ఎలాంటి ప్రోగ్రామ్స్ ప్లాన్ చేశారు? అనే అంశాలను పరిశీలిద్దాం. మరికొన్ని వారాల్లో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం అటు ఆధ్యాత్మికంగా, ఇటు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించకున్నది. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, సోనియా గాంధీ, మమతా బెనర్జీ, లాలూ యాదవ్, శరద్ పవార్ శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
మమతా బెనర్జీ కాళీఘాట్ సందర్శన
జనవరి 22న కోల్‌కతా సమీపంలోని కాళీఘాట్ ఆలయాన్ని సందర్శించనున్నట్లు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఆ తర్వాత మత సామరస్య ర్యాలీలో తాను పాల్గొంటానని వెల్లడించారు. ర్యాలీలో అన్ని మతాలు ప్రజలను పాల్గొనే టీఎంసీ జాగ్రత్తలు తీసుకుంటోంది. అలాగే మార్గ మధ్యలో దేవాలయాలు, చర్చిలు, గురుద్వారాలు, మసీదును సందర్శించనున్నారు. ఆ తర్వాత దక్షిణ కోల్‌కతాలోని పార్క్ సర్కస్ మైదాన్‌లో నిర్వహించే సమావేశంతో ఆమె మాట్లాడుతారు. అస్సాం టెంపుల్‌లో రాహుల్ గాంధీ పూజలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' యాత్ర చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం.. జనవరి 22న ఆయన యాత్ర అసోంలో కొనసాగుతుంది. ఆ రోజున ఆయన హిందూ దేవాలయాన్ని సందర్శించనున్నారు.
శరద్ పవార్, అఖిలేష్ యాదవ్ ఏమన్నారంటే
ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఎస్పీ అగ్రనేత అఖిలేష్ యాదవ్ ఇద్దరూ రామమందిర ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు. జనవరి 22న తాము హాజరుకావడం లేదని, రద్దీ తగ్గిన తర్వాత వచ్చిన రాముడిని దర్శించుకుంటామని, ఆ లోపు ఆలయం నిర్మాణం పూర్తవుతుందని చెప్పడం గమనార్హం. అంటే.. రామాలయ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదన్న విషయాన్ని ఇద్దరు నేతలు గుర్తు చేయడం గమనార్హం. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో హనుమాన్ చాలీసా పారాయణం రామాలయ ప్రారంభోత్సవానికి ఆప్ అధినేత, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఆహ్వానించలేదు. అయితే జనవరి 22న దిల్లీలో 'సుందర్ కాండ', 'హనుమాన్ చాలీసా' కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
నాసిక్‌లో ఉద్ధవ్ ఠాక్రే 'మహా హారతి'
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు కూడా ఆహ్వానం అందలేదు. ఈ క్రమంలో జనవరి 22న ఉద్ధవ్ ఠాక్రే.. నాసిక్‌లోని కాలరామ్ ఆలయాన్ని సందర్శించేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో 'మహా హారతి'ని నిర్వహిస్తానని ఠాక్రే వెల్లడించారు. లాలూ యాదవ్, డీఎంకే, లెఫ్ట్ పార్టీల స్పందన ఇదే.. తాను రామమందిర ఆలయ ప్రారంభోత్సవానికి హాజరుకావడం లేదని ఆర్‌జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్ బుధవారం చెప్పారు. ఈ విషయంలో బీజేపీపై డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని బీజేపీ రాజకీయంగా హైజాక్ చేసిందని ఆరోపించారు. సీపీఎం నేతృత్వంలోని వామపక్షాలు కూడా ఈ కార్యక్రమాన్ని రాజకీయ కార్యక్రమంగా అభివర్ణించాయి.
నవీన్ పట్నాయక్ రూటే సపరేటు..
బీజేడీ చీఫ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ బీజేపీ మిత్రపక్షమైనప్పటికీ.. జనవరి 22న తేదీన తన ప్రణాళికలో తాను ఉన్నారు. ఆధ్యాత్మికంగా ఒడిశాలో బీజేపీ హైలెట్ కాకుండా ఉండేందుకు ఓ వ్యూహాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒడిశా జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్‌ను 22న తేదీన ఆవిష్కరించడానికి నవీన్ పట్నాయక్ సిద్ధమవుతున్నారు. ఈ వ్యూహాత్మక కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా మతపరమైన భావాలను పెంచడమే, రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు వెళ్లకుండా నిరోధించవచ్చని నవీన్ పట్నాయక్ అనుకొని ఉండవచ్చు. పూరీలో మౌలిక సదుపాయాలను కల్పించే లక్ష్యంతో 'అమా ఒడిషా, నబిన్ ఒడిషా' పథకం కింద రూ.4,000 కోట్ల వ్యయంతో జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్‌ను నవీన్ పట్నాయక్ ప్రభుత్వం నిర్మించింది.