Page Loader
బిపోర్‌జాయ్‌ తుపానుపై ప్రధాని హై లెవల్ మీటింగ్.. అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
వచ్చే 3 రోజులూ అలెర్ట్

బిపోర్‌జాయ్‌ తుపానుపై ప్రధాని హై లెవల్ మీటింగ్.. అప్రమత్తంగా ఉండాలని ఆదేశం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 12, 2023
04:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిపోర్‌జాయ్‌ తుపాను అతి తీవ్ర రూపం దాల్చుతూ పెను ముప్పుగా రూపాంతరం చెందుతోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో తుపాను గుజరాత్ వైపే దూసుకెళ్తోంది. ఈ మేరకు భారత తీర ప్రాంతాలను అప్రమత్తం చేశారు. మరో 36 గంటల్లో తుపాను మరింత బలపడనుంది. ఈ క్రమంలోనే గుజరాత్‌లోని కచ్‌, పాకిస్థాన్‌లోని కరాచీల మధ్య ఈ నెల 15న తీరాన్ని దాటనుందని ఐఎండీ వెల్లడించింది. ఫలితంగా గుజరాత్‌ సహా పలు తీర ప్రాంత రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే బిపోర్‌జాయ్‌ పరిస్థితులపై ప్రధాని మోదీ సోమవారం హై లెవల్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం ఉన్నతాధికారులకు పలు కీలక సూచనలిచ్చారు.

DETAILS

ముందస్తుగానే తీరప్రాంతాల ప్రజలు పునరావాసాలకు తరలింపు

సమీక్షలో భాగంగా బిపోర్ జాయ్ తుపాను తాజా పరిస్థితి, ముందస్తు సహాయక చర్యలు, తుఫాన్ ముప్పు ప్రాంతాలపై నిఘా వివరాలను మోదీ ఆరా తీశారు. 3 రోజులూ అధికారులు నిరంతరం అలెర్ట్ గా ఉండాలని స్పష్టం చేశారు. వివిధ రకాల సహాయక చర్యలపై ప్రణాళికను ముందస్తుగానే ప్రారంభించాలన్నారు. తీర ప్రాంతంలోని ప్రజలు, లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న వారిని, ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాల జనాలను సురక్షిత ప్రాంతాలకు ముందే తరలించాలని ఆదేశించారు. గుజరాత్‌, ముంబయి తీరంలో అలల ఉద్ధృతిని బిపోర్‌జాయ్ తుఫాన్ పెంచనుందని వాతావరణ రిపోర్ట్ చెబుతోంది. జూన్ 15 వరకు మత్స్యకారులు ఎట్టిపరిస్థిల్లోనూ సముద్రంలో వేటకు వెళ్లకూడదంటూ అధికారులు ప్రకటించారు.

DETAILS

గుజరాత్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, లక్షద్వీప్​ లో ఎల్లో అలెర్ట్ 

గుజరాత్ సహా అరేబియన్ తీర ప్రాంతాలు కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, లక్షద్వీప్​లోని ఫిషర్మెన్ కమ్యూనిటీస్ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తుపాను ముప్పు ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఇప్పటికే గుర్తించామని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో ఆయా ప్రజలను ముందస్తుగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని గుజరాత్ అధికారులు స్పష్టం చేశారు. బిపోర్‌జాయ్ తుపాను : మధ్య అరేబియా సముద్రంలో పోర్‌బందర్‌కు దక్షిణ-నైరుతికి 480 కిలోమీటర్ల దూరంలో, ద్వారకకు దక్షిణ-నైరుతిగా 530 కిలోమీటర్ల దూరంలో, కచ్‌లోని నలియాకు దక్షిణ-నైరుతికి 610 కిలోమీటర్ల దూరంలో, పాకిస్థాన్‌లోని కరాచీకి దక్షిణాన 780 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు.