
Bhagwant Mann: భారత ప్రధాని విదేశీ పర్యటనలపై భగవంత్ మాన్ విమర్శలు.. స్పందించిన విదేశాంగశాఖ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఐదు దేశాల పర్యటనకు వెళ్లిన విషయం విదితమే. ఆయన ఈ పర్యటనల నేపథ్యంలో పలువురు విపక్ష నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా,పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా ఈ అంశంపై స్పందిస్తూ ఘాటుగా వ్యాఖ్యానించారు. భారత్‌కు 140 కోట్ల జనాభా ఉన్నప్పటికీ,ప్రధాని మాత్రం విదేశాలకు పయనమవుతున్నారని,అవి కూడా కేవలం 10 వేల మందికే పరిమితమైన చిన్న దేశాలేనని భగవంత్ మాన్ విమర్శించారు.
వివరాలు
భగవంత్ మాన్ చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన విదేశాంగశాఖ
''ప్రధాని మోదీ ఎక్కడికో ఘనా అనే దేశానికి వెళ్లారు. స్వదేశానికి తిరిగొచ్చిన ఆయనకు స్వాగతం! కానీ అసలు ఆయన ఏయే దేశాలకు వెళ్లుతున్నారో దేవుడికే తెలుసు. 140కోట్లు జనాభా ఉన్నా,ఆయన ఇక్కడ ఉండరు. కానీ పదివేల మంది జనాభా ఉన్న దేశాల్లో మాత్రం సందర్శనల కోసం వెళ్తున్నారు. అంతేకాదు అక్కడి నుంచి గౌరవాలు,అవార్డులు తెచ్చుకుంటున్నారు,'' అని ఆయన వ్యాఖ్యానించారు. భగవంత్ మాన్ చేసిన ఈ వ్యాఖ్యలపై భారత విదేశాంగశాఖ తీవ్రంగా స్పందించింది. ఆయన పేరును ప్రస్తావించకుండా,దేశ ప్రధానిని లక్ష్యంగా చేసుకుని రాష్ట్రం తరఫున ఉన్న కీలక నేత చేసిన వ్యాఖ్యలు తమ దృష్టికి వచ్చాయని పేర్కొంది. ఈ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నవని, అవి ఆ నేత స్థాయిని తగ్గించేవిగా ఉన్నాయని విదేశాంగశాఖ అభిప్రాయపడింది.
వివరాలు
మోదీ విదేశీ పర్యటనలపై జైరాం రమేశ్ సెటైర్లు
భారతదేశంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న స్నేహపూర్వక దేశాల పట్ల ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం తగదు అని తెలిపింది. ఇక మరోవైపు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ కూడా మోదీ విదేశీ పర్యటనలపై సెటైర్లు వేశారు. ''ప్రధాని మరో టూర్‌కు వెళ్లేలోపే... కనీసం మూడు వారాల పాటు దేశంలోనే ఉంటారేమో! ఇప్పటికైనా మణిపూర్ కు వెళ్లే సమయం ఆయనకు దొరుకుతుందా?''అని ఎద్దేవా చేశారు. అదే సమయంలో పహల్గాం ఉగ్రదాడిలో దోషులను ఇప్పటివరకు కోర్టు ముందు ఎందుకు హాజరుపరచలేకపోయారో కూడా సమీక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
వివరాలు
ఈ నెల 2వ తేదీ నుంచి విదేశీ పర్యటన
ఇక మోదీ ఈ నెల 2వ తేదీ నుంచి విదేశీ పర్యటనలో భాగంగా పలు దేశాలను సందర్శించారు. ఆయన పర్యటించిన దేశాలలో ఘనా,అర్జెంటీనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, బ్రెజిల్, నమీబియా ఉన్నాయి. ఆయా దేశాల్లో ఆయన అక్కడి పార్లమెంట్లను ఉద్దేశించి ప్రసంగించారు కూడా.