KCR-Election Campaign: ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు: మాజీ సీఎం కేసీఆర్
ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఎన్డీఏ గానీ లేదా ఇండియా కూటమి గాని కేవలం ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటవుతుందని జోస్యం చెప్పారు. తెలంగాణ లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వర్ రావు తరఫున కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఈసారి దేశంలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన జరగబోతుందన్నారు. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి గానీ, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమిగానీ ప్రాంతీయ పార్టీల మద్దతు ద్వారా మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతాయని చెప్పారు.
హామీల అమలులో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది: కేసీఆర్
కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో ఈసారి ప్రాంతీయ పార్టీల హవా నడుస్తుందని తెలిపారు. రాష్ట్రంలో అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటి అమలులో ఘోరంగా విఫలమైందని కేసీఆర్ మండిపడ్డారు. కేవలం నాలుగు నెలల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం హామీ ఓ పెద్ద జోక్ గా అభివర్ణించారు. బస్సుల్లో సీట్ల కోసం మహిళలు కొట్టుకుంటున్నారని, ఆటోడ్రైవర్లకు ఉపాధిలేక రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారని వివరించారు. బీఆర్ ఎస్ పదేళ్ల పాలనలో రైతుల్లో ఆత్మవిశ్వాసం, సంతోషం వెల్లివిరిసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతుల్లో కన్నీళ్లుకనిపిస్తున్నాయని, ప్రభుత్వం పట్ల ఆగ్రహంతో ఊగిపోతున్నారని కేసీఆర్ చెప్పారు.
అవకాశ వాద నేతలు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు
అవకాశ వాద నేతలు మాత్రమే తమ పార్టీనుంచి బయటకు వెళ్లిపోయారని తెలిపారు. రాజకీయాల్లో ఇవి సాధారణమైపోయాయన్నారు. ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ అటువంటి పొద్దు తిరుగుడు పువ్వులాంటి నేతలు ఉన్నారని తెలిపారు. బీజేపీకి తెలంగాణలో సీట్లు ఒకటి కంటే ఎక్కువ రావన్నారు. ప్రధాని మోదీ తన ప్రజాకర్షణను కోల్పోయారని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రూపాయి విలువ పతనమైపోయిందని, రైతులతోపాటు ఇతర వర్గాలు కూడా మోదీ పాలనపై ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. మోదీ విధాన పర నిర్ణయాలను వ్యతిరేకించిన తొలి సీఎంని తానేనని అందుకే తమను అణిచివేసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. సంబంధంలేని కేసులో కవితను ఇరికించారని తెలిపారు. త్వరలోనే తన కుమార్తెకు కూడా బెయిల్ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.