
Jaishankar: ట్రంప్ టారిప్‌ల వేళ.. వచ్చే వారం మాస్కోకు వెళ్లనున్న విదేశాంగ మంత్రి జైశంకర్
ఈ వార్తాకథనం ఏంటి
పాశ్చాత్య దేశాల ఆంక్షల మధ్య రష్యా నుండి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తున్న భారత్‌పై అమెరికా ఒత్తిడి పెంచుతోంది. రష్యా చమురు దిగుమతులు నిలిపివేయకపోతే అధిక పన్నులు విధిస్తామని అమెరికా హెచ్చరించిందని సమాచారం. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఈ నెల 20, 21 తేదీల్లో రష్యా రాజధాని మాస్కోకు పర్యటించనున్నారు. అక్కడ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌తో ఇరుదేశాల సంబంధాలు, సహకారంపై చర్చలు జరపనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ప్రస్తుతం మాస్కో పర్యటనలో ఉన్నారు.
వివరాలు
ద్వైపాక్షిక బంధం బలోపేతం
అమెరికా భారీ సుంకాల హెచ్చరికలు జారీ చేస్తున్న సమయంలోనే భారత్-రష్యా బంధాన్ని మరింత బలపరచే దిశగా నడుస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్'లో మాట్లాడారు. ఇరువురూ ద్వైపాక్షిక బంధం బలోపేతం,పెట్టుబడులు, వాణిజ్యం, ఆర్థిక అంశాలపై చర్చించారని ఢిల్లీ, మాస్కో ప్రభుత్వాలు విడిగా విడుదల చేసిన ప్రకటనల్లో వెల్లడించాయి. ఉక్రెయిన్ యుద్ధం ప్రస్తుత పరిణామాలపై పుతిన్ వివరించగా, సమస్యలు శాంతియుత చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలన్న తన అభిప్రాయాన్ని మోదీ మరోసారి స్పష్టంచేశారు. ఈ ఏడాది చివర్లో పుతిన్ భారత్ పర్యటనకు రావాల్సి ఉండగా, ఆ సందర్భంలో అతనికి ఆతిథ్యం ఇవ్వాలని ఎదురుచూస్తున్నట్టు మోదీ పేర్కొన్నారు.
వివరాలు
ఈ నెల 15న అమెరికా అధ్యక్షుడుతో రష్యా అధ్యక్షుడు సమావేశం
ఇదిలా ఉంటే, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ నెల 15న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం కానున్నారు. ఆ భేటీలో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు, ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు, వాణిజ్య ఒప్పందాలు వంటి అంశాలపై చర్చలు జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా హాజరవ్వవచ్చని సమాచారం.