Telangana Polls: తెలంగాణలో ఈ 10 అసెంబ్లీ స్థానాల ఫలితాలపైనే అందరి దృష్టి
తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 30న పోలింగ్ జరిగింది. డిసెంబర్ 3న ఫలితాలు రాబోతున్నాయి. అయితే తెలంగాణ వ్యాప్తంగా 10 నియోజవర్గాలపై మాత్రం తీవ్రమైన చర్చ నడుస్తోంది. అవెంటో ఒకసారి పరిశీలిద్దాం. గజ్వేల్: కేసీఆర్ వర్సెస్ ఈటల సిద్దిపేట జిల్లాలో గజ్వేల్(Gajwel) నుంచి కేసీఆర్(KCR) 2014, 2018 ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయ సాధించారు. ఈసారి.. ఈ స్థానంలో ఒకప్పుడు కేసీఆర్‌కు అత్యంత సన్నిహుతుడు ఈటల రాజేందర్(Eatala Rajender)తో కేసీఆర్ తలపడ్డారు. ఈ నియోజకవర్గంలో ముదిరాజ్ ఓటర్లు 40వేలకు పైగా ఉండటం.. ఆ వర్గానికి చెందిన ఈటల ఈసారి కేసీఆర్‌కు పోటీగా నిలబడటం ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ కాంగ్రెస్(Congress) నుంచి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పోటీ చేశారు.
కామారెడ్డి: కేసీఆర్ వర్సెస్ రేవంత్
గజ్వేల్‌తో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిలాల్లోని కామారెడ్డి(Kamareddy) నుంచి కూడా కేసీఆర్ పోటీ చేశారు. ఇక్కడ కేసీఆర్‌కు పోటీగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది. కామారెడ్డిలో బీజేపీ(BJP) తరఫున వెంకటరమణారెడ్డి(Venkataramana Reddy) పోటీ చేశారు. ఈయన కేసీఆర్, రేవంత్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు. అందుకే ఇక్కడ ఫలితంగా ఎలా ఉండబోతుందనేది చర్చనీయాంశంగా మారింది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ తరఫున నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసినప్పుడు ధర్మపురి అరవింద్ పసుపు బోర్టు హామీ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని నెరవేర్చారు. ఈ క్రమంలో ఇక్కడ బీజేపీకి సానుకూలత పెరిగింది. ఇక్కడ ముగ్గురి మధ్య పోటీ నువ్వా నేనా? అన్నట్లుగా ఉంది.
సిరిసిల్లలో కేటీఆర్‌కు కేకే మహేందర్ రెడ్డి గట్టి పోటీ
తెలంగాణ టెక్స్‌టైల్ హబ్ అయిన సిరిసిల్ల 2009నుంచి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి కేటీఆర్‌కు కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి గట్టి పోటీ ఇస్తున్నారు. 2009లో టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కేకే మహేందర్ రెడ్డిని పక్కన పెట్టి.. కేసీఆర్ తన కొడుకు కేటీఆర్‌కు ఈ టికెట్ కేటాయించారు. ఇప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకుంటానని మహేందర్ రెడ్డి అంటున్నారు. ఇక్కడ బీజేపీ నుంచి రాణి రుద్రమారెడ్డి పోటీ చేసారు. సిద్ధిపేట.. హరీశ్‌రావు సిద్ధిపేట నుంచి మరోసారి పోటీ చేశారు. ఇక్కడ హరీష్ రావు గెలుపు కంటే.. ఆయన మెజార్టీపైనే చర్చ జరుగుతోంది. 2018 ఎన్నికల్లో లక్ష దాటిన ఆయన మెజార్టీ.. ఈ సారి ఎంత ఉంటుందనే చర్చనీయాశంగా మారింది.
రేవంత్ రెడ్డికి ప్రతిష్టాత్మకంగా మారిన కొడంగల్
కాంగ్రెస్ నుంచి సీఎం రేసులో ఉన్న రేవంత్ రెడ్డి కొడంగల్ గెలుస్తారా? లేదా? అనేది ఉత్కంఠను రేపుతున్న ప్రశ్న. కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి 2009, 2014ఎన్నికల్లో విజయం సాధించారు. 2018లో పట్నం నరేందర్ రెడ్డి చేతిలో 80,754ఓట్లతో ఓడిపోయారు. ఈ సారి కూడా పట్నం నరేందర్ రెడ్డి నుంచి రేవంత్ రెడ్డి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. నరేందర్ రెడ్డి అన్న పట్నం మహేందర్ రెడ్డికి ఈ సారి కేసీఆర్ టికెట్ ఇవ్వకుండా.. కొడంగల్ గెలుపు బాధ్యతలను ఆయనకు అప్పగించారు. దీంతో నియోజకవర్గంలో గట్టి పట్టున్న మహేందర్ రెడ్డి.. రేవంత్ ఓటమి లక్ష్యంగా నియోజకవర్గంలో ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొడంగల్‌లో ఫలితం ఎలా ఉంటుందనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రాజాసింగ్ హ్యాట్రిక్ కొడతారా?
2018అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. గోషామహల్ నుంచి రాజాసింగ్ మాత్రమే గెలిచారు. 2014లో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ముఖేష్ గౌడ్‌ను ఓడించి.. రాజాసింగ్ తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. 2018లో అదే స్థానం నుంచి రెండోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. రాజాసింగ్‌కు చెందిన లోధ్ రాజ్‌పుత్‌లు ఇక్కడ ఎన్నికల్లో గెలుపోటములను శాసిస్తున్నారు. అలాగే ఇక్కడ హిందువులు కూడా ఎక్కవ సంఖ్యలో ఉన్నారు. దీంతో గోషామహాల్‌లో రాజాసింగ్ బలమైన నాయకుడిగా ఉన్నారు. AIMIMకు కంచుకోటగా ఉన్న హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న గోషామహల్ అసెంబ్లీలో ఈసారి మూడోసారి రాజాసింగ్ విజయం సాధిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ తరఫున నంద కిషోర్ వ్యాస్, కాంగ్రెస్ తరఫున సునీతారావు పోటీ చేశారు.
నాంపల్లి: ఏఐఎంఐఎం వర్సెస్ కాంగ్రెస్
హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీలో AIMIM కంచుకోటగా ఉన్న నాంపల్లి నియోజకవర్గంలో పోరు రసవత్తంగా ఉంది. ఇక్కడ AIMIM, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడ్డాయి. ఎంఐఎంకు నాంపల్లి సిట్టింగ్ స్థానం. అసదుద్దీన్ ఒవైసీకి అత్యంత సన్నిహితుడైన మహమ్మద్ మాజిద్ హుస్సేన్ పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ నుంచి ఎంఐఎం ఇక్కడి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. అన్ని ఎగ్జిట్ పోల్స్ ఈ స్థానాన్ని కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పాయి. జూబ్లీహిల్స్: త్రిముఖ పోరు జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను రంగంలోకి దింపగా.. మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌ను కాంగ్రెస్ పోటీలో నిలిపింది. అయితే అనూహ్యంగా ఈ స్థానంలో ఎంఐఎం అభ్యర్థి పోటీలో నిచిచారు. 2014లో ఇక్కడ ఎఐఎంఐఎం అభ్యర్థి రెండోస్థానంలో నిలవడం గమనార్హం.
కరీంనగర్: సిట్టింగ్ ఎమ్మెల్యే వర్సెస్ సిట్టింగ్ ఎంపీ
కరీంనగర్ అసెంబ్లీ స్థానంలో సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్.. సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్‌తో తలపడ్డారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ ఓడిపోయారు. 2019లో జనరల్ ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. కమలాకర్, సంజయ్ కుమార్ ఇద్దరూ మున్నూరు కాపు (బీసీ) వర్గానికి చెందినవారు కావడం గమనార్హం. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పురుమళ్ల శ్రీనివాస్ బరిలో ఉన్నారు. చాంద్రాయణగుట్ట: అక్బరుద్దీన్ ఒవైసీ చాంద్రాయణగుట్టలో 20ఏళ్లకు పైగా అసదుద్దీన్ తమ్ముడు అక్బరుద్దీన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. చాంద్రాయణగుట్టలో 65 శాతం ముస్లిం ఓటర్లు ఉన్నారు. అక్బరుద్దీన్‌పై కాంగ్రెస్ అభ్యర్థి బి నగేష్ (నరేష్), బీఆర్‌ఎస్ అభ్యర్థి ముప్పి సీతారాంరెడ్డి, బీజేపీ నుంచి కౌడి మహేందర్ పోటీ చేస్తున్నారు.