
Kumki elephants: కుంకీ ఏనుగులను అప్పగించిన కర్ణాటక.. బదిలీ ఆదేశ పత్రాలు అందుకున్న ఉపముఖ్యమంత్రి
ఈ వార్తాకథనం ఏంటి
గత ఆగస్టులో కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం,కర్ణాటక నుండి కుంకీ ఏనుగులను బుధవారం తరలించారు.
బెంగళూరులోని విధానసౌధ సమీపంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అటవీ శాఖ మంత్రి ఈశ్వర ఖండ్రే అందులో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఈ ఇద్దరు నేతలు ఏనుగుల బదిలీకి సంబంధించిన అధికారిక పత్రాలను ఆంధ్రప్రదేశ్ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు అందజేశారు.
ఒప్పందం ప్రకారం ఆరు కుంకీ ఏనుగులను అప్పగించాల్సి ఉన్నప్పటికీ, శిక్షణ, ఆరోగ్య ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని బుధవారం నాడు నాలుగు ఏనుగులే తరలించబడ్డాయి. మిగిలిన రెండు కుంకీలు త్వరలోనే రెండో విడతగా పంపించనున్నారు.
వివరాలు
కర్ణాటకలో 3,695 ఏనుగులు
ఈ సందర్భంగా సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ, మనుషులు-ఏనుగుల మధ్య ఎదురయ్యే సంఘర్షణలను నివారించేందుకు రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమని అన్నారు.
గతేడాది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ కుంకీ ఏనుగుల విషయంలో అభ్యర్థన చేయగానే తానే ముందుగా అంగీకరించానని వెల్లడించారు.
ప్రస్తుతం కర్ణాటకలో 3,695 ఏనుగులున్నాయని, దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్నవి తమ రాష్ట్రంలోనే అని వివరించారు.
మొదటి విడతగా పంపించిన నాలుగు కుంకీలకు నెల రోజులపాటు అక్కడి మావటీలు ఏపీ బృందానికి శిక్షణనిస్తారని తెలిపారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గత 20 ఏళ్లుగా మానవుల-ఏనుగుల మధ్య జరుగుతున్న సంఘర్షణ కొనసాగుతోందన్నారు.
వివరాలు
కుంకీలు పంట నష్టాన్ని కాపాడతాయి
ఈ సమస్య పరిష్కారానికి కర్ణాటక అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని చెప్పారు.
పర్యావరణ పరిరక్షణ విషయంలో రెండు వేర్వేరు పార్టీల ప్రభుత్వాలున్నా, మనమంతా భారతీయులమన్న భావనకు ఈ ఒప్పందం నిదర్శనమని అభిప్రాయపడ్డారు.
కర్ణాటక నుంచి వచ్చిన ఈ కుంకీలు భవిష్యత్తులో అనేక ప్రాణాలను, పంట నష్టాన్ని కాపాడతాయని అన్నారు.
అంతేగాక ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధం, అటవీ సంపద రక్షణలో రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం కొనసాగుతుందని తెలిపారు. ఈ కుంకీల సంరక్షణను తానే పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు.
వివరాలు
కన్నడ భాషను ఉపయోగించిన పవన్
తన ప్రసంగంలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా కన్నడ భాషను ఉపయోగించడమే కాకుండా, కన్నడ జాతీయ కవి కువెంపు రచించిన ప్రకృతి సంబంధిత కవితలను చదివి వినిపించారు.
అటవీ శాఖ మంత్రి ఈశ్వర ఖండ్రే మాట్లాడుతూ, కుంకీ ఏనుగులను ఇతర రాష్ట్రాలకు పంపుతున్నందుకు విమర్శలు వచ్చినా, వాటిని పట్టించుకోకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లామని తెలిపారు.
కర్ణాటక రాష్ట్రానికి అవసరమైన దానికన్నా ఎక్కువ కుంకీలు ఉండటంతో, పొరుగు రాష్ట్రానికి సహాయం చేస్తున్నామని వివరించారు.
ఈ కార్యక్రమంలో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, అటవీ శాఖ కార్యదర్శి మీనాక్షి నేగి, ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. అనంతరాము, హెచ్‌ఓఎఫ్‌ఎఫ్ చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ ఎ.కె. నాయక్ తదితరులు పాల్గొన్నారు.
వివరాలు
ఆంధ్రప్రదేశ్‌కు తరలించిన కుంకీల వివరాలు:
తొలి విడతగా పంపిన నాలుగు కుంకీ ఏనుగులు ఇవే:
15 ఏళ్ల కృష్ణ, (చిక్కమగళూరు)
14 ఏళ్ల అభిమన్యు (శివమొగ్గ),
39 ఏళ్ల దేవ (కుశాల్‌నగర్),
26 ఏళ్ల రంజన్ (దుబారె) ఉన్నాయి.
ఈ నాలుగింటితో పాటు, మైసూరు ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల మహేంద్ర అనే మరొక ఏనుగును వీటిని సాగనంపేందుకు తరలించారు.
వివరాలు
కుంకీ ఏనుగుల పాత్ర ఏమిటి?
కుంకీలు అనగా పూర్తిగా శిక్షణ పొందిన ఏనుగులు. అడవిలో ఏనుగుల గుంపు నియంత్రణ తప్పినప్పుడు, లేదా గ్రామాల్లోకి చొచ్చుకురావడాన్ని నివారించాలంటే ఇవే సహాయకంగా ఉంటాయి.
గాయపడిన లేదా చిక్కుకుపోయిన అడవి ఏనుగులను రక్షించడంలోనూ వీటి ఉపయోగం ఎంతో ఉంది.
సాధారణంగా మగ ఏనుగులనే కుంకీలుగా తయారుచేస్తారు. ఇవి ఒంటరిగా సంచరిస్తూ మావటీల శిక్షణతో నైపుణ్యం పొందతాయి.
అనంతరం అనేక ఆపరేషన్లలో వీటిని వినియోగిస్తారు. ఈ ఏనుగులు పంటపొలాలపైకి వచ్చిన అడవి ఏనుగులతో కూడా పోరాడగలవు. అందుకే వాటికి పోరాట శిక్షణనూ ప్రత్యేకంగా ఇస్తారు.