Dharmendra Pradhan: నీట్ పరీక్షలో అవకతవకలపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు.. కేంద్ర విద్యాశాఖ మంత్రి
నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నీట్ పరీక్షతో పాటు యూజీసీ నెట్ పరీక్ష రద్దు,ఈ విషయంలో విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై కూడా ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. నీట్ పరీక్షకు సంబంధించి బీహార్ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు.పాట్నా నుంచి కూడా కొంత సమాచారం వస్తోంది. ఈరోజు కూడా కొంత చర్చ జరిగింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి హామీ ఇచ్చారు. ఎన్టీఏలోని సీనియర్ అధికారులతో సహా ఎవరైనా దోషులుగా తేలితే వారిని విడిచిపెట్టబోమని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. కేంద్ర విద్యా మంత్రి కూడా NTAలో సంస్కరణలను సమర్థించారు.
పిల్లల భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యత
మార్కులను ప్రభుత్వం ఉపసంహరించుకున్నదని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 1,563 మంది అభ్యర్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించామన్నారు. ' రెండు చోట్ల మరిన్ని అక్రమాలు వెలుగు చూశాయన్నారు. ప్రభుత్వం ఈ సమస్యను చాలా సీరియస్‌గా తీసుకుందని విద్యార్థులకు, తల్లిదండ్రులకు హామీ ఇస్తునన్నారు . ఈ మొత్తం ఎపిసోడ్‌లో పిల్లల భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని ప్రధాన్ చెప్పారు. ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయబోతోందని తెలిపారు. ఈ కమిటీ సిఫార్సులు NTA నిర్మాణం, NTA పనితీరు, పరీక్షా ప్రక్రియ, పారదర్శకత, డేటా భద్రతను మెరుగుపరుస్తాయని భావిస్తున్నామన్నారు. దోష రహిత పరీక్షకు కట్టుబడి ఉన్నామన్నారు. ఎన్డీయే ప్రభుత్వం 2024లో మొదటిసారిగా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అన్యాయమైన మార్గాల నిరోధక) చట్టాన్ని కూడా తీసుకొచ్చిందన్నారు.
నీట్ పేపర్ లీక్ వివాదం.. వేడిక్కిన రాజకీయం
నీట్ పేపర్ వివాదంతో రాజకీయం కూడా వేడెక్కింది. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ గళం విప్పింది. నీట్ యూజీ, నెట్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసం ఎదుట భారత యువజన కాంగ్రెస్ గురువారం నిరసన చేపట్టింది. భారత యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ఆందోళనకారులను అదుపు చేశారు.
మోదీపై రాహుల్ ధ్వజం
బీజేపీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) భారతదేశంలోని విద్యాసంస్థలను తారుమారు చేస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో దేశవ్యాప్తంగా సంస్థాగత హైజాకింగ్ విస్తృతమైందని ఆయన పేర్కొన్నారు. వైస్-ఛాన్సలర్లను మెరిట్ ఆధారంగా కాకుండా సంస్థకు వారి అనుబంధం ఆధారంగా నియమించడాన్ని గాంధీ విమర్శించారు. స్వతంత్ర విద్యావ్యవస్థ ధ్వంసమైందన్న ఆయన ఇలాంటి పరిణామాలకు కారకులైన వారికి శిక్ష పడాలన్నారు. ఈ పరిస్థితి మారనంత కాలం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయని ఇది దేశ వ్యతిరేక చర్య అన్నారు. ఈ అవకతవకలపై తాము పార్లమెంట్‌లో మాట్లాడతామని '' అని రాహుల్ వెల్లడించారు.
నీట్ వివాదం అంటే ఏంటి?
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024 జూన్ 4న వచ్చాయి. అదే రోజు NTA పరీక్ష 2024 ఫలితాలను విడుదల చేసింది. ఇందులో 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. దీని తర్వాత #neetfraud సోషల్ మీడియాలో ట్రెండింగ్ ప్రారంభమైంది. ఇప్పుడు ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. బిహార్, గుజరాత్‌ల నుంచి పేపర్ లీక్ అయినట్లు వార్తలు వచ్చాయి.