Page Loader
Bihar: బిహార్‌లో ఓటర్ల సర్వే సంచలనం.. బంగ్లాదేశ్‌, నేపాల్‌, మయన్మార్‌ దేశస్థుల గుర్తింపు! 
బిహార్‌లో ఓటర్ల సర్వే సంచలనం.. బంగ్లాదేశ్‌, నేపాల్‌, మయన్మార్‌ దేశస్థుల గుర్తింపు!

Bihar: బిహార్‌లో ఓటర్ల సర్వే సంచలనం.. బంగ్లాదేశ్‌, నేపాల్‌, మయన్మార్‌ దేశస్థుల గుర్తింపు! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 13, 2025
01:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్‌లో శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండగా, ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. ఓటర్ల జాబితాలో విదేశీ పౌరులు ముఖ్యంగా బంగ్లాదేశ్‌, నేపాల్‌, మయన్మార్‌ దేశాల వారిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన కథనాలు పలు ఆంగ్ల మాధ్యమాల్లో వెలువడ్డాయి. ఈ మేరకు రాష్ట్రంలోని ఓటర్ల వివరాలను పరిశీలించేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేలో స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. సర్వే ప్రకారం.. బంగ్లాదేశ్‌, నేపాల్‌, మయన్మార్‌ వంటి దేశాలకు చెందిన అనేక మంది ప్రస్తుతం బిహార్‌లో నివసిస్తూ, ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చించుకున్నట్లు సమాచారం. వీరంతా అక్రమ మార్గాల్లో ఆధార్ కార్డు, నివాస ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డులు పొందినట్టు తెలుస్తోంది.

Details

అనుచిత పౌరులను గుర్తించినట్లు సమాచారం

ఈ అంశంపై స్థానిక క్షేత్రస్థాయి అధికారులు సర్వే సందర్భంగా అనేక అనుచిత పౌరులను గుర్తించినట్లు సమాచారం. ఈసీ ప్రకారం.. ఈ వివరాలను ఆగస్టు 1వ తేదీ నుంచి తాము అధికారికంగా పరిశీలిస్తామని, అర్హత లేని వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించే ప్రక్రియ చేపడతామని స్పష్టం చేసింది. ఇక ఈ సవరణ ప్రక్రియపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఓటర్ల జాబితాలో ఇలా మార్పులు చేయడంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా బ్లాక్ ఆరోపణల ప్రకారం.. ఈసీ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవహరిస్తోందని, ముస్లింలు, వలస కార్మికులు, దళితుల వంటివారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు వ్యూహాత్మకంగా ఈ చర్యలు తీసుకుంటోందని ఆరోపిస్తోంది.

Details

సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు

ఇక ఈ వ్యవహారంపై అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్‌ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారించిన ధర్మాసనం.. ఓటర్ల జాబితా పరిశీలన అనేది రాజ్యాంగ పరమైన నిబంధనల ప్రకారం జరుగుతున్నదేనని స్పష్టం చేసింది. అయితే ఈ ప్రక్రియ కోసం ఎన్నికల సంఘం ఎంచుకున్న టైమింగ్‌పై మాత్రం కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. ఇదిలా ఉండగా, ఈ తరహా సమగ్ర సర్వేను గతంలో 20 సంవత్సరాల క్రితం మాత్రమే నిర్వహించినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. అప్పటి తర్వాత కొన్ని అనుబంధ సవరణలే జరిగాయని పేర్కొంది. ఇప్పుడు మరోసారి దీనిని అమలు చేయడంలో అసలు ఉద్దేశ్యం ఏమిటన్నదే రాజకీయంగా చర్చనీయాంశమైంది.