Page Loader
World Cancer Day: నేడు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం.. అవగాహనే ఆయుధం
నేడు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం.. అవగాహనే ఆయుధం

World Cancer Day: నేడు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం.. అవగాహనే ఆయుధం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 04, 2025
08:57 am

ఈ వార్తాకథనం ఏంటి

అత్యాధునిక వైద్య పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్నప్పటికీ, మనిషి జీవిత కాలాన్ని పెంచుకోగలుగుతున్నా, క్యాన్సర్‌కు సరైన పరిష్కారం ఇంకా అందుబాటులోకి రాలేదు. ఎన్నో మందులు, కొత్త చికిత్సలు అందుబాటులో ఉన్నా, క్యాన్సర్‌ గురించి ప్రజల్లో అవగాహన తక్కువగానే ఉంది. అందువల్లే క్యాన్సర్‌ పేరు వినగానే భయం పుట్టుకొస్తుంది. అయితే, మొదటి దశలోనే గుర్తిస్తే క్యాన్సర్‌ను జయించవచ్చు. గతంలో అనుకోకుండా వచ్చే కొన్ని రకాల క్యాన్సర్లు ఇప్పుడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్లే వస్తున్నాయి. సమయానికి సరైన చికిత్స పొందకపోవడం వల్ల అనేక మంది ఈ వ్యాధికి బలవుతున్నారు. అందుకే క్యాన్సర్‌ వ్యాధుల గురించి అవగాహన పెంచే ఉద్దేశంతో ప్రతి ఏడాది ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

వివరాలు 

నలభైల నుంచి ముప్పైలకు 

క్యాన్సర్‌ అనేక రకాలుగా ప్రబలవచ్చు. శరీరంలోని ఏ అవయవానికైనా ఇది సంక్రమించవచ్చు. సాధారణంగా మన శరీరంలో కణాల విభజన సమతుల్యంగా సాగాలి. కానీ,ఇది అసమతుల్యంగా జరగడం వల్ల కొన్ని కణాలు నియంత్రణ లేకుండా పెరిగి, ఇతర భాగాలకు వ్యాపిస్తాయి. దీనినే క్యాన్సర్‌గా పిలుస్తారు. ఈ వ్యాధి వయస్సుతో సంబంధం లేకుండా ఎవరికైనా రావచ్చు. కొన్ని క్యాన్సర్లు జన్యుపరంగా వస్తే,మరికొన్ని జీవనశైలి, ఆహారం,వాతావరణ కాలుష్యం కారణంగా వస్తాయి. మునుపటి కాలంతో పోలిస్తే ఇప్పుడు 35 ఏళ్లకే క్యాన్సర్‌ రోగులు పెరుగుతున్నారు.గతంలో 45 ఏళ్లు దాటిన వారిలో ఎక్కువగా కనబడిన క్యాన్సర్‌ ఇప్పుడు 35 ఏళ్లకే కనిపించడం ఆందోళన కలిగించే విషయం. ప్రస్తుతం తెలంగాణలో దాదాపు లక్ష మంది క్యాన్సర్‌ రోగులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

వివరాలు 

చికిత్సా పద్ధతులు 

చికిత్సా విధానాలు విపరీతమైన దుష్ప్రభావాలను కలిగించినప్పటికీ, ప్రస్తుతం ఆ ప్రభావాలను తగ్గించే మెరుగైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందటం మంచిది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, యోగా, ధ్యానం చేయడం వ్యాధి నుంచి కోలుకునే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. తాజా వైద్య పరిజ్ఞానంతో కీ-హోల్‌ సర్జరీలు, హార్మోన్‌ థెరపీ, టార్గెటెడ్‌ థెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ వంటి చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి.

వివరాలు 

ఐదేళ్లలో పెరిగిన కేసులు 

ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం, గత ఐదేళ్లలో క్యాన్సర్‌ కేసులు 20 శాతం పెరిగాయి. 2030 నాటికి ఈ సంఖ్య 50 శాతం పెరిగే ప్రమాదం ఉంది. క్యాన్సర్‌ రకాలలో రొమ్ము క్యాన్సర్‌ మొదటి స్థానంలో, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ రెండో స్థానంలో, నోటి క్యాన్సర్‌ మూడో స్థానంలో ఉన్నాయి. తెలంగాణలో నోటి క్యాన్సర్‌ కేసులు రెండో స్థానంలో ఉన్నాయి. ప్రస్తుతం క్యాన్సర్‌ నిర్ధారణకు బయాప్సీ, ఎఫ్‌ఎన్‌ఏ టెస్ట్‌, బ్లడ్‌ మార్కర్స్‌, ఎక్స్‌-రే, సీటీ-స్కాన్‌, ఎంఆర్‌ఐ, పెట్‌ స్కాన్‌ వంటి పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడానికి పాప్‌స్మియర్‌ పరీక్ష ఉపయోగపడుతుంది.

వివరాలు 

వీటికి టీకాలు ఉన్నాయి 

కొన్ని క్యాన్సర్లకు టీకాలు అందుబాటులోకి వచ్చాయి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు హెచ్‌పీవీ టీకా ప్రభావవంతంగా ఉంది. 9 ఏళ్ల బాలికల నుండి యువతులకు ఈ టీకా వేసి వ్యాధిని నివారించవచ్చు. అలాగే, అండాశయం, గొంతు క్యాన్సర్లను కూడా ఈ టీకాతో అడ్డుకోవచ్చు. క్యాన్సర్ల లక్షణాలు క్యాన్సర్‌ లక్షణాలు సాధారణంగా ఆలస్యంగా బయటపడతాయి. అలసట, జ్వరం, ఆకలి మందగించడం, విరేచనాలు, రక్తహీనత వంటి లక్షణాలు క్యాన్సర్‌ ఉన్నప్పుడు కనిపించవచ్చు.

వివరాలు 

ముప్పు తగ్గించే నియమాలు 

ముఖ్యంగా క్యాన్సర్‌ రాకుండా నివారించేందుకు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. మద్యపానం, ధూమపానం మానుకోవాలి. రోజూ కనీసం అరగంట వ్యాయామం చేయాలి. కాలుష్యానికి దూరంగా ఉండాలి. క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోవడం ద్వారా సకాలంలో వ్యాధిని గుర్తించి, సరైన చికిత్స పొందడం అత్యంత కీలకం.