
ISRO: దేశ భద్రత కోసం రానున్న మూడేళ్లలో మరో 150 ఉపగ్రహాలు
ఈ వార్తాకథనం ఏంటి
రాబోయే మూడు సంవత్సరాల్లో 100 నుండి 150 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టే లక్ష్యంతో ఇస్రో పనిచేస్తోందని సంస్థ చైర్మన్ వి. నారాయణన్ తెలిపారు.
ప్రస్తుతం భారత్‌కు సేవలందిస్తున్న 55 ఉపగ్రహాలు దేశ సరిహద్దులు,సుమారు 7500 కిలోమీటర్ల తీరప్రాంతంపై పర్యవేక్షణ కోసం పూర్తిగా సరిపోవని చెప్పారు.
అయితే, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల కారణంగా అంతరిక్ష పరిశోధన,శాటిలైట్ డిజైన్, ప్రయోగాలలో ప్రైవేటు రంగం మరింత క్రియాశీలక పాత్ర పోషిస్తోందని వివరించారు.
ఆయన ఈ వ్యాఖ్యలు స్థానిక కావేరీ ఆసుపత్రిలో జరిగిన ఏఐ ఆధారిత రోబోటిక్ వ్యవస్థ ప్రారంభ కార్యక్రమంలో వెల్లడించారు.
వివరాలు
శాటిలైట్ డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా..
ఇస్రో ప్రస్తుత ప్రాజెక్టుల గురించి కూడా నారాయణన్ వివరించారు.శాటిలైట్ డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసినట్లు గుర్తుచేశారు.
ఈ సాంకేతికతను ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా మాత్రమే సాధించగా, ఇప్పుడు భారత్ కూడా ఆ జాబితాలో చేరినట్లు చెప్పారు.
వాతావరణ మార్పులపై లోతైన అధ్యయనం కోసం ఒక ప్రత్యేక ఉపగ్రహాన్ని డిజైన్ చేసే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారని తెలిపారు.
ఈ ఉపగ్రహం ప్రధానంగా జీ20 దేశాల అవసరాల నిమిత్తం రూపొందించబడుతుందని, దాని రూపకల్పనలో 50 శాతం వరకు భారత్ భాగస్వామి కాగా, మిగిలిన భాగంలో ఇతర జీ20 దేశాలు కూడా సహకరిస్తాయని పేర్కొన్నారు.
వివరాలు
మంగళ్‌యాన్-2 పేరిట మరో ప్రత్యేక మిషన్
ఉపగ్రహ ప్రయోగాలకు తోడు, మానవులను అంతరిక్షంలోకి పంపేందుకు గగన్‌యాన్ మిషన్‌పై ఇస్రో దృష్టిసారించిందన్న విషయం తెలిసిందే.
చంద్రుడి ఉపరితలంపై మరింత పరిశోధనలు జరిపేందుకు చంద్రయాన్ 4 మిషన్ కోసం ఏర్పాట్లు జరుపుతున్నట్లు వెల్లడించారు.
అలాగే శుక్రగ్రహ వాతావరణం,ఉపరితల లక్షణాలపై అధ్యయనం చేయడానికి శుక్రయాన్ మిషన్ కోసం ప్రణాళికలు రూపొందించబడుతున్నాయి.
అంతేగాక, అరుణ గ్రహాన్ని మరింత లోతుగా పరిశీలించేందుకు మంగళ్‌యాన్-2 పేరిట మరో ప్రత్యేక మిషన్‌కు కూడా ఇస్రో సిద్ధమవుతోంది.