Page Loader
IND vs ENG 3rd Test: కపిల్ దేవ్,ధోనీ,కోహ్లీ తర్వాత... ఇప్పుడు శుభమన్ గిల్ సారథ్యంలో లార్డ్స్‌లో భారత్ చరిత్ర సృష్టిస్తుందా?
శుభమన్ గిల్ సారథ్యంలో లార్డ్స్‌లో భారత్ చరిత్ర సృష్టిస్తుందా?

IND vs ENG 3rd Test: కపిల్ దేవ్,ధోనీ,కోహ్లీ తర్వాత... ఇప్పుడు శుభమన్ గిల్ సారథ్యంలో లార్డ్స్‌లో భారత్ చరిత్ర సృష్టిస్తుందా?

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 08, 2025
05:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్ vs భారత్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో మూడవ మ్యాచ్ జూలై 10న ప్రారంభం కానుంది. ఈ కీలక పోరు క్రికెట్ ప్రపంచానికి పుణ్యక్షేత్రంగా భావించే లార్డ్స్ మైదానంలో జరగబోతోంది. ఇప్పటికే సిరీస్ 1-1తో సమంగా నిలవడంతో ఈ టెస్ట్ మ్యాచ్‌ను గెలిచే జట్టు ఆధిక్యంలోకి వెళుతుంది. అందువల్ల, ఇరు జట్లకూ ఈ మ్యాచ్ అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా మారింది. ఇంతకు ముందు తొలి టెస్ట్‌లో ఇంగ్లాండ్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కానీ రెండో టెస్ట్‌లో భారత్ బలంగా బౌన్స్‌బ్యాక్ చేసి,ఇంగ్లాండ్‌ను 336 పరుగుల భారీ తేడాతో ఓడించి రికార్డు స్థాయిలో విజయాన్ని నమోదు చేసింది.

వివరాలు 

2021లో ఇంగ్లాండ్‌ను 151 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా

ఇప్పుడు రెండో మ్యాచ్ విజయోత్సాహంతో టీమిండియా లార్డ్స్ టెస్ట్ కోసం సన్నద్ధమవుతోంది. అయితే లార్డ్స్‌లో మ్యాచ్ జరుగుతుంది కాబట్టి తామే గెలుస్తామని ఇంగ్లాండ్ టీమ్ నమ్మకంతో ఉంది. భారత జట్టు ఇప్పటి వరకు లార్డ్స్ వేదికపై మొత్తం 19 టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా, కేవలం మూడు మాత్రమే గెలిచింది. నాలుగు మ్యాచ్‌లు డ్రా కాగా, మిగతా 12 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. ఈ గణాంకాలు చూస్తే లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ చేతుల్లో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే గత మూడు లార్డ్స్ టెస్ట్‌లలో భారత జట్టు రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ముఖ్యంగా 2021లో ఇంగ్లాండ్‌ను 151 పరుగుల తేడాతో ఓడించి టీమిండియా గొప్ప విజయాన్ని నమోదు చేసింది.

వివరాలు 

2021లో కేఎల్ రాహుల్ సెంచరీ 

ఆ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ అద్భుతంగా 134 పరుగులు సాధించగా, మహ్మద్ సిరాజ్ 8 కీలక వికెట్లు తీయడంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ కూడా మంచి ఫామ్‌లోనే ఉన్నారు. మొదటి టెస్ట్‌లో రాహుల్ సెంచరీ చేయగా, ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో సిరాజ్ 7 వికెట్లతో ప్రత్యర్థుల్ని తికమకపెట్టాడు. దీంతో ఈ ఇద్దరి ఆటతీరుపై భారత అభిమానుల్లో విశ్వాసం నెలకొంది. ఈ మ్యాచ్‌లోనూ వీరిద్దరూ రాణిస్తే, క్రికెట్ కాశీ లార్డ్స్‌లో టీమిండియా విజయ పతాకాన్ని ఎగురవేస్తుందని ఆశిస్తున్నారు.

వివరాలు 

లార్డ్స్ వేదికపై భారత విజయాల చరిత్ర: 

1986: కపిల్ దేవ్ నేతృత్వంలో భారత్, ఇంగ్లాండ్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి, లార్డ్స్‌లో తొలి గెలుపును అందుకుంది. 2014: ధోనీ కెప్టెన్సీలో భారత జట్టు 95 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. 2021: విరాట్ కోహ్లీ నాయకత్వంలో టీమిండియా 151 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. ఇప్పుడు యువ కెప్టెన్ శుభమన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు నాలుగో విజయాన్ని లక్ష్యంగా చేసుకొని లార్డ్స్ మైదానంలో బరిలోకి దిగుతోంది. క్రికెట్ చరిత్రలో మరొక అద్భుత ఘట్టానికి తెరలేపే అవకాశం ఈ మ్యాచ్ ద్వారా కలుగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.