Page Loader
AUS vs IND: రేపటి నుండి బోర్డర్-గావస్కర్ ట్రోఫీ.. భారత ఆటగాళ్లు ముందున్న రికార్డులివీ
రేపటి నుండి బోర్డర్-గావస్కర్ ట్రోఫీ.. భారత ఆటగాళ్లు ముందున్న రికార్డులివీ

AUS vs IND: రేపటి నుండి బోర్డర్-గావస్కర్ ట్రోఫీ.. భారత ఆటగాళ్లు ముందున్న రికార్డులివీ

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 21, 2024
08:31 am

ఈ వార్తాకథనం ఏంటి

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆరంభానికి సమయం దగ్గరపడింది, నవంబర్ 22న పెర్త్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు జరుగనుంది. ఈ సిరీస్‌లో విజయాన్ని సాధించి రికార్డులను తిరగరాయాలనే ఉత్సాహంతో భారత ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. ఈ సిరీస్‌లో రాణించే అవకాశం ఉన్న ప్రముఖ ఆటగాళ్లు ఏం రికార్డులు సాధించవచ్చో చూద్దాం.

వివరాలు 

భారీ రికార్డులపై కన్నేసిన కోహ్లీ 

విరాట్ కోహ్లీ 458 పరుగులు చేస్తే, సచిన్ టెండూల్కర్ ను అధిగమించి ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా నిలుస్తాడు. ఇప్పటి వరకు కోహ్లీ ఆసీస్ గడ్డపై 13 టెస్టుల్లో 1,352 పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో 9 శతకాలు సాధించగా, కోహ్లీ,స్టీవ్ స్మిత్ 8 శతకాలతో రెండో స్థానంలో ఉన్నారు. ఈ సిరీస్‌లో సచిన్ రికార్డును కోహ్లీ బ్రేక్ చేసే అవకాశం ఉంది. తదుపరి 574 పరుగులు సాధిస్తే, కోహ్లీ ఆస్ట్రేలియాలో 4,000 అంతర్జాతీయ పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా నిలుస్తాడు.

వివరాలు 

అడిలైడ్‌లో కోహ్లీ ప్రత్యేకం 

అడిలైడ్ మైదానంలో ఇప్పటివరకు కోహ్లీ 509 పరుగులు చేశాడు. మరో 102 పరుగులు చేస్తే, బ్రియాన్ లారాను అధిగమించి అత్యధిక పరుగులు చేసిన విదేశీ ఆటగాడిగా నిలుస్తాడు. అడిలైడ్‌లో కోహ్లీ ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో 5 సెంచరీలు సాధించగా,మరో సెంచరీతో జాక్ హాబ్స్ రికార్డును అధిగమించే అవకాశముంది. ఈ సిరీస్‌లో కోహ్లీ ఆస్ట్రేలియాతో 100వ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడనున్నాడు. గబ్బాలో జరిగే మూడో టెస్టులో ఈ ఘనత అందుకునే అవకాశముంది. ఇప్పటివరకు సచిన్ (110 మ్యాచ్‌లు) మాత్రమే ఆస్ట్రేలియాతో వంద కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. కోహ్లీ ఇంకో ఐదు సెంచరీలు చేస్తే ఆసీస్ పై అన్ని ఫార్మాట్లలో ఎక్కువ శతకాలు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. సచిన్ (20 సెంచరీలు) అగ్రస్థానంలో ఉన్నాడు.

వివరాలు 

బౌలింగ్‌లో రికార్డుపై బుమ్రా, అశ్విన్ 

జస్‌ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌లో 20 వికెట్లు తీస్తే, కపిల్ దేవ్‌ను అధిగమించి ఆస్ట్రేలియాలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అవతరిస్తాడు. అటు రవిచంద్రన్ అశ్విన్, డబ్ల్యూటీసీ చరిత్రలో 200 వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా నిలవడానికి మరో 6 వికెట్ల దూరంలో ఉన్నాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో స్పిన్నర్ల మధ్య పోటీ ఉత్కంఠ రేపుతోంది. రోహిత్ శర్మ సిక్సర్ల రికార్డు ట్రోఫీ చరిత్రలో సచిన్ 25 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ మరో 11 సిక్సులు కొడితే సచిన్ రికార్డును అధిగమిస్తాడు. ఈ సిరీస్‌లో టీమిండియా ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శనతో రికార్డులను తిరగరాయాలని చూస్తున్నారు. చూడాలి మరి, ఈ సిరీస్ భారత జట్టుకు ఎంత గుర్తుండిపోతుందో!