Page Loader
ENG vs IND: నేడు ఇంగ్లండ్ తో తొలి టెస్ట్‌.. మ్యాచ్‌కు వర్షం వల్ల అంతరాయం కలిగే అవకాశం!
నేడు ఇంగ్లండ్ తో తొలి టెస్ట్‌.. మ్యాచ్‌కు వర్షం వల్ల అంతరాయం కలిగే అవకాశం!

ENG vs IND: నేడు ఇంగ్లండ్ తో తొలి టెస్ట్‌.. మ్యాచ్‌కు వర్షం వల్ల అంతరాయం కలిగే అవకాశం!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 20, 2025
11:04 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్,భారత్‌ జట్ల మధ్య తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ఈరోజు (జూన్‌ 20) మధ్యాహ్నం 3:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో ప్రారంభం కానుంది. టెస్ట్‌ క్రికెట్‌కు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలు వీడ్కోలు చెప్పిన నేపథ్యంలో శుభమన్‌ గిల్‌ ఈ మ్యాచ్‌కు భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే గిల్‌ నేతృత్వంలోని భారత జట్టు ఈ టెస్టులో వాతావరణం అనే మరో పరీక్షను ఎదుర్కొనబోతోంది. ఈ మ్యాచ్‌కు కేటాయించిన ఐదు రోజుల పాటు మేఘావృత ఆకాశమే కనిపించే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇది బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండకపోవచ్చు. అయితే పేస్‌ బౌలింగ్‌కు మాత్రం అనుకూలిస్తుంది. అలాగే రెండు రోజుల్లో వర్షం పడే అవకాశం కూడా ఉంది.

వివరాలు 

మూడో రోజు,నాలుగో రోజు సాయంత్రం వేళల్లో కొంతమేర తేలికపాటి జల్లులు

వాతావరణ శాఖ అందించిన వివరాల ప్రకారం రెండో రోజు,మూడో రోజు ఉదయం ఒక గంటపాటు వర్షం పడే అవకాశం ఉంది. దీని వల్ల మ్యాచ్‌కు ఇబ్బంది కలగవచ్చు. అలాగే మూడో రోజు,నాలుగో రోజు సాయంత్రం వేళల్లో కొంతమేర తేలికపాటి జల్లులు పడే సూచనలూ ఉన్నాయి. ఇవి అవుట్‌ఫీల్డ్‌పై ప్రభావం చూపించి తర్వాతి రోజు ఆటకు కొన్ని ఆటంకాలు కలిగించవచ్చు. మొదటి రోజు,ఐదో రోజు వాతావరణం నిలకడగా ఉండే అవకాశముంది. ఇంగ్లాండ్ వాతావరణంలో వర్షం అనేది ఒక సాధారణ లక్షణం. అందువల్ల ఈ ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో వర్షం కూడా ఓ కీలక పాత్ర పోషించబోతోందని క్రికెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

వివరాలు 

నలుగురు పేసర్లతో భారత జట్టు 

మేఘావృతమైన వాతావరణం, వర్షం కురిసే అవకాశాలు ఉండటం వలన భారత జట్టు తుది జట్టును ఎంపిక చేసుకునే విషయంలో మార్పులు జరగవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో నలుగురు పేసర్లతో భారత జట్టు బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పిన్ బౌలింగ్ విభాగంలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్‌లలో ఎవరినో ఒకరిని మాత్రమే తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం.