Page Loader
Varun Chakaravarthy: వరుణ్‌ చక్రవర్తి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా..?
వరుణ్‌ చక్రవర్తి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా..?

Varun Chakaravarthy: వరుణ్‌ చక్రవర్తి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా..?

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 12, 2025
04:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో టీమ్‌ఇండియా ట్రంప్‌ కార్డు వరుణ్‌ చక్రవర్తి గూర్చి అంతటా చర్చ నడుస్తోంది. తన మిస్టరీ స్పిన్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను చిక్కుల్లో పెట్టి, జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అక్షర్‌ పటేల్‌, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌ వంటి అనుభవజ్ఞులున్నా, తుది జట్టులో వరుణ్‌కు అవకాశం దక్కడం అతడి ప్రత్యేకతను సూచిస్తుంది. అయితే, అతని క్రికెట్‌ ప్రయాణం మాత్రం సాఫీగా సాగలేదనే విషయం ఆసక్తికరం.

వివరాలు 

వరుణ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన తర్వాత వరుణ్‌ చక్రవర్తికి భారత జట్టులో స్థానం లభించింది. అయితే.. అతడు కాస్త భయస్తుడు. 2021 టీ20 వరల్డ్‌కప్‌ సందర్భంగా ఫీల్డ్‌ సెట్‌ ఎలా ఉండాలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి చెప్పడానికి కూడా జంకినట్లు మాజీ బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ వెల్లడించాడు. జట్టులో ఇచ్చిన ఫీల్డ్‌ సెట్టింగ్‌తోనే బౌలింగ్‌ చేసినట్లు గుర్తు చేసుకున్నాడు. వరుణ్‌ చక్రవర్తికి ఏ క్రికెట్‌ బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోయినా, అతడి ప్రయాణం ఎంతో కష్టసాధ్యం. తొలినాళ్లలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగం చేసేవాడు. టెన్నిస్‌బాల్‌ తో క్రికెట్‌ ఆడుతూ, తన ప్రతిభను మెరుగుపర్చుకున్నాడు. ఐపీఎల్‌కు ముందుగా తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో ప్రాతినిధ్యం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

వివరాలు 

వరుణ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

ఎన్నో సెలక్షన్‌ ట్రయల్స్‌లో పాల్గొన్నప్పటికీ, తొలుత అతనికి చోటు దక్కలేదు. దీనితో క్రికెట్‌కు స్వస్తి చెప్పి, ఆర్కిటెక్చర్‌, మూవీ మేకింగ్‌ వంటి రంగాల్లో అవకాశాలను పరిశీలించాడు. కానీ, చివరకు మళ్లీ క్రికెట్‌ పైనే మక్కువ పెంచుకొని , అదే తన కెరీర్‌గా మలచుకున్నాడు. ''నేను ఎన్నో సెలక్షన్‌ మ్యాచ్‌లు ఆడినా, ఒక్కసారి కూడా ఎంపిక కాలేదు. స్కూల్‌ తర్వాత క్రికెట్‌ ఆడటాన్ని మానేశాను. కానీ, ఆటను వదిలేద్దామనుకున్నా.. క్రికెట్‌ నన్ను విడిచిపెట్టలేదు!'' అని ఒకసారి వరుణ్‌ సరదాగా వ్యాఖ్యానించాడు.

వివరాలు 

వరుణ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

క్రికెట్‌లోకి అడుగు పెట్టే ముందు వరుణ్‌ ఓ తమిళ చిత్రంలో నటించిన విషయం చాలామందికి తెలియదు. విష్ణు విశాల్‌ నటించిన 'జీవా' సినిమాలో అతిథి పాత్ర పోషించాడు. క్రికెట్‌ కెరీర్‌ నష్టపోయిన ఓ ఆటగాడి జీవితం చుట్టూ తిరిగే ఈ కథలో, వరుణ్‌ కూడా చిన్న పాత్రలో కనిపించాడు. వరుణ్‌ కెరీర్‌ ఆరంభ దశలో యో-యో టెస్టుల్లో విఫలమయ్యాడు. ఉద్యోగం కారణంగా జిమ్‌కు వెళ్ళే సమయం దొరకకపోవడంతో, మొదటి మూడేళ్లు ఫిట్‌నెస్‌ టెస్టులో ఒత్తిడిని అధిగమించలేకపోయాడు. ''ఎవరైనా రేపు యో-యో టెస్టు ఉందని చెప్పినా, నాకు నిద్ర పట్టేది కాదు. భయంతో కంగారు పడేవాడిని'' అని వరుణ్‌ ఓ సందర్భంలో చెప్పాడు.