Page Loader
ENG vs IND: ఇంగ్లాండ్‌తో సిరీస్‌ ముందు.. భారత బ్యాటింగ్ సత్తాకు పరీక్ష
ఇంగ్లాండ్‌తో సిరీస్‌ ముందు.. భారత బ్యాటింగ్ సత్తాకు పరీక్ష

ENG vs IND: ఇంగ్లాండ్‌తో సిరీస్‌ ముందు.. భారత బ్యాటింగ్ సత్తాకు పరీక్ష

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 19, 2025
09:42 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో టెస్టు సిరీస్‌కు ముందు భారత జట్టులో ప్రధాన చర్చ బ్యాటింగ్‌ విభాగంపైనే కొనసాగుతోంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు రిటైర్‌ అయిన తర్వాత, భారత టాపార్డర్‌ శూన్యత ఏర్పడిన భావన అభిమానుల్లో కనిపిస్తోంది. ఇంగ్లాండ్‌లోని గడ్డపై పరిస్థితులు సవాలుతో కూడినవే కావడంతో పాటు, జట్టులో అంతర్జాతీయంగా అక్కడ ఆడిన అనుభవం ఉన్నవారు తక్కువగా ఉండటం మరో ఆందోళనకరం. ఈ నేపథ్యంలో,ఇంగ్లాండ్ బౌలర్ల సవాళ్లను భారత బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కెప్టెన్‌గా శుభమన్ గిల్ బాధ్యతలు స్వీకరించిన తొలి సిరీస్‌లోనే అతడికి కఠిన సవాలు ఎదురు కానుంది.

వివరాలు 

నాలుగో స్థానంలో గిల్‌ బ్యాటింగ్‌

అంతేకాక, సచిన్‌, కోహ్లిలు మెరిసిన నాలుగో స్థానంలో గిల్‌ బ్యాటింగ్‌ చేయనున్నాడు. అయితే గిల్‌ ఇప్పటి వరకు టెస్టుల్లో ఉన్న పరిమాణాన్ని చూస్తే, వారు చేరుకున్న స్థాయికి అతను చేరలేదనే మాట నిజమే. 32 టెస్టుల్లో అతని సగటు కేవలం 35. ఇంగ్లాండ్‌లో గత పర్యటనలో గిల్‌ 3 టెస్టుల్లో కేవలం 88 పరుగులే చేయగలిగాడు, సగటు 14.66 మాత్రమే. కానీ ప్రస్తుతం అతను మంచి టెక్నిక్‌తో పాటు, ఫార్మ్‌లోనూ ఉన్నాడు. ఈసారి మాత్రం తన గణాంకాలను మెరుగుపరచే అవకాశం ఉంది.

వివరాలు 

జైస్వాల్, సుదర్శన్‌లపై ఆశలు 

ఈ సిరీస్‌లో యశస్వి జైస్వాల్‌తో కలిసి ఓపెనింగ్‌ చేసే అవకాశం ఉన్న సాయి సుదర్శన్ తొలి అంతర్జాతీయ టెస్టులోనే ఇంగ్లాండ్‌ గడ్డపై అరంగేట్రం చేయనున్నాడు. జైస్వాల్ ఇప్పటికే అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 19 టెస్టుల్లో 53 సగటుతో 1798 పరుగులు చేసిన అతను, ఇంగ్లాండ్‌లో తొలిసారి టెస్టు ఆడనున్నాడు. ఆయన ప్రతిభపై అంచనాలు అధికంగా ఉన్నాయి. ఇదివరకే దేశవాళీ క్రికెట్‌, ఐపీఎల్‌ వేదికలపై ఆకట్టుకున్న సుదర్శన్‌ ఇప్పుడు ఇంగ్లాండ్‌లో ఆరంభ టెస్ట్‌ మ్యాచ్‌తోనే తన అవకాశాన్ని దక్కించుకున్నాడు. టెస్టులకు అనుకూలమైన టెక్నిక్‌, ఓర్పుగా ఆడే లక్షణం అతడికి సానుకూల అంశాలు.

వివరాలు 

కరుణ్‌ నాయర్‌కు రెండో అవకాశం? 

తన మూడో టెస్టులోనే ట్రిపుల్‌ సెంచరీ కొట్టి సంచలనం సృష్టించిన కరుణ్‌ నాయర్‌... ఆ తర్వాత నిలకడ తప్పడంతో జట్టుకు దూరమయ్యాడు. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి చేరాడు. ఈ సిరీస్‌లో మూడో స్థానంలో ఆడే అవకాశమున్న కరుణ్‌ నాయర్‌... ద్రవిడ్‌, పుజారాలా గోడలా నిలబడతాడా అన్నది ఆసక్తికరం. దేశవాళీ క్రికెట్లో భారీ స్కోర్లతో తను రీ ఎంట్రీ సాధించగా, ఇప్పుడు అతను ఈ అవకాశాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటాడన్నది గమనించాల్సిన అంశం.

వివరాలు 

అనుభవజ్ఞులుగా రాహుల్‌, పంత్‌ కీలకం 

కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌ వంటి అనుభవజ్ఞులపై మిడిలార్డర్‌లో ఆధార పది ఉంది. ఇప్పటివరకు కెరీర్‌లో 58 టెస్టులు ఆడిన రాహుల్‌, అందులో 9 టెస్టులు ఇంగ్లాండ్‌లో ఆడాడు. ఇక్కడ రాహుల్ 34 సగటుతో 614 పరుగులు చేయగా,రెండు శతకాలు సాధించాడు. గత పర్యటనలో ఓవల్‌ వేదికగా 149 పరుగుల ఇన్నింగ్స్‌ను అభిమానులు మరిచిపోలేరు అలాగే, పంత్‌ కూడా ఇంగ్లాండ్‌లో 9 టెస్టులు ఆడి, రెండు శతకాలతో కలిపి 556 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ మిడిలార్డర్‌లో కీలకంగా నిలవనున్నారు.

వివరాలు 

ఇంగ్లండ్‌ బౌలింగ్‌నే బలహీనతగా మార్చుకుంటే..  

ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కూడా బ్యాటుతో తన వంతు పాత్ర పోషించాల్సిన అవసరముంది. ఇంగ్లాండ్‌లో 12 టెస్టుల్లో 642 పరుగులు చేసిన అతను ఇక్కడ ఒక సెంచరీ కూడా చేశాడు. దాదాపు 30 సగటుతో చేసిన ఈ పరుగులు కీలక సమయంలో జట్టుకు ఉపయోగపడేలా ఉండాలి. లోయరార్డర్‌ బ్యాటర్లతో కలిసి అతను భాగస్వామ్యాలు నిర్మించి స్కోరును పెంచాల్సిన బాధ్యతను భుజాలపై ఎత్తుకోవాల్సి ఉంటుంది. కోహ్లి, రోహిత్‌లు లేని పరిస్థితుల్లో భారత బ్యాటింగ్‌ విభాగం అనుభవంలేమితో కొంత వెనుకబడినట్లు అనిపించొచ్చు. కానీ ఇదే అంశం మరో కోణంలో చూస్తే భారత్‌కు ఓ అవకాశంగా మారొచ్చు. ఎందుకంటే ఇంగ్లాండ్‌ బౌలింగ్‌లోనూ అనుభవజ్ఞుల కొరత స్పష్టంగా ఉంది.

వివరాలు 

ఇంగ్లండ్‌ బౌలింగ్‌నే బలహీనతగా మార్చుకుంటే..  

జేమ్స్ అండర్సన్‌,స్టూయర్ట్ బ్రాడ్‌ లాంటి దిగ్గజ బౌలర్లు లేకపోవడం భారత జట్టుకు సానుకూల పరిణామం. క్రిస్ వోక్స్‌ను తప్పిస్తే, మిగతా బౌలర్లందరూ కొత్తవాళ్లే. సామ్ కుక్‌,జోష్ టంగ్‌,బ్రైడన్ కార్స్‌,జేమీ ఓవర్టన్‌ వంటి వారు తమ కెరీర్‌ ఆరంభ దశలోనే ఉన్నారు. భారత బ్యాటర్లు ధైర్యంగా,ఓర్పుగా ఆడితే ఈ కొత్త బౌలర్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనగలుగుతారు. ఇంగ్లాండ్‌ పిచ్‌లు అన్నీ బ్యాటింగ్‌కు పెద్దగా ప్రతికూలంగా ఉండవు. ఉదయపు సెషన్‌లో వాతావరణ పరిస్థితుల వల్ల స్వింగ్‌ అనుకూలంగా ఉండొచ్చు.కానీ అలాంటి సమయంలో క్రీజులో ఓర్పుతో ఉంటే,భారీ స్కోర్లు చేయడం అంత కష్టమేమీ కాదు. ముఖ్యంగా కొత్త బౌలర్లకు ఒత్తిడిని కలిగిస్తే,వారు దానిని తట్టుకోలేక తమ లైన్‌ అండ్ లెంగ్త్‌ను కోల్పోతారు. దీంతో భారత్‌కు దూసుకుపోయే అవకాశం కలుగుతుంది.