Page Loader
IND vs ENG: నాగపూర్ వేదికగా ఇంగ్లాండ్‌తో మొదటి నేడు వన్డే.. భారత్‌కు కూర్పే పెద్ద సమస్య 
నాగపూర్ వేదికగా ఇంగ్లాండ్‌తో మొదటి నేడు వన్డే.. భారత్‌కు కూర్పే పెద్ద సమస్య

IND vs ENG: నాగపూర్ వేదికగా ఇంగ్లాండ్‌తో మొదటి నేడు వన్డే.. భారత్‌కు కూర్పే పెద్ద సమస్య 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 06, 2025
08:37 am

ఈ వార్తాకథనం ఏంటి

టీ20ల్లో యువ భారత్‌ చేతిలో 4-1తో ఓటమి చెందిన ఇంగ్లండ్ జట్టుతో రోహిత్‌ శర్మ సేన ఢీకొనబోతోంది. మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ గురువారం జరగనుంది. టీ20ల్లో ఓడినప్పటికీ ఇంగ్లాండ్‌ జట్టును తక్కువగా అంచనా వేయలేం. ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఉన్న ఈ జట్టును ఓడించేందుకు భారత జట్టు సమాయత్తమవుతోంది. గతంలో శ్రీలంక పర్యటనలో భారత యువ టీ20 జట్టు విజయాన్ని నమోదు చేయగా, సీనియర్‌ వన్డే జట్టు ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌ ఫలితం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా తుది జట్టు ఎంపిక రోహిత్‌, కోచ్‌ గంభీర్‌ కు ఒక పరీక్షగా మారింది.

వివరాలు 

వికెట్‌ కీపర్‌ ఎవరు? 

ఇంగ్లాండ్‌తో తొలివన్డేలో భారత తుది జట్టు ఎంపికపై భారీ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఎవరయ్యుంటారని చర్చ జరుగుతోంది.రిషబ్‌ పంత్‌ గాయంతో గత కొంతకాలంగా కేఎల్‌ రాహుల్‌ వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలను తీసుకున్నాడు. ఇప్పుడు పంత్‌ తిరిగి వచ్చినప్పటికీ పరిమిత ఓవర్ల క్రికెట్లో మోస్తరు ప్రదర్శననే కనబరుస్తున్నాడు. అందువల్ల ఈ మ్యాచ్‌లో ఎవరు వికెట్‌ కీపింగ్‌ చేస్తారనేది ఆసక్తికరం. భారతస్పిన్‌ విభాగం ఎలా ఉండబోతుందనేది కూడా ప్రధాన ప్రశ్న. జడేజాకు తోడుగా ఎవరు స్పిన్‌ బాధ్యతలు పంచుకుంటారనేది నిర్ణయించాల్సి ఉంది. అదనంగా మరోఇద్దరు స్పిన్నర్లను ఎంపిక చేస్తారా,లేక వరుణ్‌ చక్రవర్తిని నేరుగా వన్డేల్లో ఆడించే అవకాశముందా అన్నది చూడాలి. కుల్‌దీప్‌,అక్షర్‌ పటేల్‌,వాషింగ్టన్‌ సుందర్‌లలో ఎవరి ఎంపిక జరుగుతుందో చూడాల్సిన విషయం.

వివరాలు 

నాగ్‌పుర్‌ పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలం 

నాగ్‌పుర్‌ పిచ్‌ స్పిన్నర్లకు మద్దతుగా ఉండే అవకాశం ఉంది. దీంతో ముగ్గురు స్పిన్నర్లను బరిలోకి దింపే అవకాశం ఉంది. పేస్ విభాగంలో మహ్మద్‌ షమి, అర్ష్‌దీప్‌ కీలకంగా మారనున్నారు. మూడో పేసర్‌గా హర్షిత్‌ రాణా ఎంపిక అయ్యే అవకాశముంది. బుమ్రా ఫిట్‌నెస్‌పై అనుమానాల నేపథ్యంలో ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముందు షమి తన ప్రదర్శనను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. హార్దిక్‌ పాండ్య తన ఆల్‌రౌండర్‌ పాత్రను సమర్థంగా నిర్వహిస్తాడని జట్టు ఆశిస్తోంది. బ్యాటింగ్‌ విభాగంలో రోహిత్‌, శుభ్‌మన్‌ గిల్‌ జట్టుకు శుభారంభం అందిస్తారా అనేది ఆసక్తికరం. కోహ్లి, శ్రేయస్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే బాధ్యత వహించనున్నారు.

వివరాలు 

విజయానికి 'రూట్‌' దారి చూపిస్తాడా? 

టీ20ల్లో తేలిపోయిన ఇంగ్లాండ్‌ జట్టు వన్డేల్లో పుంజుకోవాలని భావిస్తోంది. ఈ జట్టుకు జో రూట్‌ అనుభవంతో పాటు నిలకడను అందించనున్నాడు. టెస్టుల్లో అద్భుత ఫామ్‌లో ఉన్న రూట్‌ వన్డేల్లోనూ తన ప్రతిభను నిరూపించుకోవాలని చూస్తున్నాడు. అతడి రాకతో ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ మరింత బలపడనుంది. బ్యాటింగ్‌లో రూట్‌తో పాటు బట్లర్‌, డకెట్‌, బ్రూక్‌ ప్రధానంగా నిలవనున్నారు. తేలిపోయిన లివింగ్‌స్టన్‌, బెతెల్‌ వన్డేల్లో మెరుగైన ప్రదర్శన చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బౌలింగ్‌ విభాగంలో రషీద్‌, ఆర్చర్‌, కార్స్‌, సకిబ్‌లతో ఇంగ్లాండ్‌ పటిష్టంగా ఉంది.

వివరాలు 

పరుగుల వర్షం ఖాయం 

నాగ్‌పుర్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశముంది. తొలుత బ్యాటింగ్‌ చేసే జట్టు సులభంగా 300 పైగా పరుగులు చేయగలదు. బౌలింగ్‌ విభాగానికి రాత్రి మంచు ప్రభావం ఉండే అవకాశముంది. అందువల్ల టాస్‌ గెలిచిన జట్టు ఛేదన వైపే మొగ్గుచూపే అవకాశముంది. తుది జట్లు భారత్‌ (అంచనా): రోహిత్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్, కోహ్లి, శ్రేయస్, రాహుల్‌/పంత్, హార్దిక్, జడేజా, కుల్‌దీప్‌/వరుణ్‌ చక్రవర్తి, షమి, అర్ష్‌దీప్, హర్షిత్‌ రాణా/అక్షర్‌ పటేల్‌. ఇంగ్లాండ్‌: సాల్ట్, డకెట్, రూట్, బ్రూక్, బట్లర్‌ (కెప్టెన్‌), లివింగ్‌స్టన్, బెతెల్, బ్రైడన్‌ కార్స్, ఆర్చర్, అడిల్‌ రషీద్, సకిబ్‌ మహమూద్‌.