India vs New Zealand: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కివీస్ వ్యూహాత్మక ఆధిపత్యాన్ని భారత్ అధిగమించగలదా?
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ వరుసగా నాలుగు విజయాలు సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
ఇక న్యూజిలాండ్ కూడా టీమిండియాపై మినహా మిగతా అన్ని మ్యాచ్‌ల్లో గెలిచి తుది పోరుకు అర్హత సాధించింది.
ఈ ఫైనల్ మ్యాచ్ మార్చి 9న దుబాయ్ వేదికగా జరగనుంది. ఇప్పటికే దుబాయ్ మైదానం భారత్‌కు అనుకూలమని చెబుతుండగా, అక్కడే ఫైనల్ కావడంతో ఈ పోరుపై భారీ ఆసక్తి నెలకొంది.
అయితే,అక్కడి పిచ్‌లు ఒకే విధంగా ఉండవని, ఒక్కో మ్యాచ్‌కి వేర్వేరుగా ఉంటాయని స్పష్టమైంది.
కివీస్‌తో లీగ్ మ్యాచ్‌లో 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన భారత్,సెమీఫైనల్లో 265 పరుగుల ఛేదన విజయవంతంగా పూర్తి చేసింది.
దీంతో ఫైనల్‌లో ఏ వ్యూహం అవలంబించాలన్నదే ఇప్పుడు ఇరుజట్లకు పెద్ద ప్రశ్నగా మారింది.
వివరాలు
నలుగురు స్పిన్నర్లతోనేనా?
బంగ్లాదేశ్,పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో భారత్ మూడు స్పిన్నర్లు, మూడు పేసర్లను ప్రయోగించింది.
కానీ, కివీస్‌తో లీగ్ మ్యాచ్ సహా సెమీస్‌లోనూ ఒక పేసర్‌ను తొలగించి నాలుగురు స్పిన్నర్‌లను తీసుకొచ్చి విజయాన్ని అందుకుంది.
న్యూజిలాండ్‌పై భారత పేసర్లు కేవలం 7 ఓవర్లు మాత్రమే వేయగా, ఆసీస్‌తో 16 ఓవర్ల బౌలింగ్ చేశారు.
అంటే పిచ్ పరిస్థితుల ఆధారంగా వ్యూహం మారిందన్న మాట. ఇప్పుడు ఫైనల్‌లో పాక్ లేదా బంగ్లాదేశ్ మ్యాచ్‌లకు వాడిన పిచ్ అయితే, 250 పరుగులలోపే కివీస్‌ను కట్టడి చేయడమనే వ్యూహం సులభంగా అమలు చేయొచ్చు.
అంతేకాదు, కివీస్ ఇప్పుడు ప్రతీకారం తీర్చుకునే కసితో ఉంది. గత మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓటమి పాలైనందున ఈసారి టైటిల్ గెలుచుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతుంది.
వివరాలు
భారత స్పిన్నర్లపై భారం!
కివీస్‌పై లీగ్ దశలోనే 5 వికెట్లు పడగొట్టిన వరుణ్ చక్రవర్తి మరోసారి అదే రీతిలో ప్రభావం చూపుతాడని భారత అభిమానులు ఆశిస్తున్నారు.
షమీ లేదా హార్దిక్ ను తొలగించగలిగితే, స్పిన్నర్లు కివీస్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీయగలరనే నమ్మకం ఉంది.
భారత్ జట్టులో వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్ రిథమ్‌లో ఉన్నారు.
అటు న్యూజిలాండ్ కూడా బలంగా ఉంది. మిచెల్ సాంట్నర్, బ్రాస్‌వెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర నాణ్యమైన స్పిన్నర్లు.
కానీ, పేసర్ మ్యాట్ హెన్రీ గాయపడ్డాడన్న వార్తలు వచ్చాయి. అతను ఫైనల్‌కు అందుబాటులో లేకుంటే, కివీస్‌కు ఇది పెద్ద దెబ్బగా మారనుంది.
వివరాలు
ఫీల్డింగ్ అత్యంత కీలకం
ఫైనల్ మ్యాచ్‌లో ఒక్క పరుగు కూడా విలువైనదే. ఫీల్డింగ్‌లో అతి జాగ్రత్త అవసరం.
ఒక్క క్యాచ్ తప్పినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఆసీస్‌తో సెమీ ఫైనల్లో స్టీవ్ స్మిత్ ఇచ్చిన క్లిష్టమైన క్యాచ్‌లను భారత ఫీల్డర్లు వదిలేయడంతో, ఆసీస్ మరింత స్కోరు చేయగలిగింది.
అయితే, శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన త్రో తో అలెక్స్ కేరీని రనౌట్ చేయడం భారత్‌కు బూస్ట్ ఇచ్చింది.
ఇదే విధంగా, గ్లెన్ ఫిలిప్స్, కేన్ విలియమ్సన్ పట్టిన క్యాచ్‌లు న్యూజిలాండ్ ఫీల్డింగ్ బలాన్ని చాటాయి. ఫైనల్‌లో ఇరుజట్లు మెరుగైన ఫీల్డింగ్‌తో విజయాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తాయి.
వివరాలు
టాస్ కీలకం కాని..
ఈ టోర్నమెంట్‌లో భారత్‌కు టాస్ అనుకూలంగా లేకపోయినా, ఫలితాలు మాత్రం కలిసి వచ్చాయి.
గత వన్డే వరల్డ్ కప్ ఫైనల్ నుంచి ఇప్పటి వరకు భారత్ వరుసగా 14 టాస్‌లు కోల్పోయింది.
అయినప్పటికీ మ్యాచ్‌లు గెలుచుకుంది. అయితే, విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఫైనల్‌లో టాస్ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువ.
వివరాలు
గత పరాభవాలకు ప్రతీకారం తీర్చుకునే సమయం!
భారత్ వరుస విజయాలతో ముందుకు దూసుకెళ్తోంది. గత వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో ఓటమికి ప్రతీకారంగా, ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో ఆసీస్‌ను ఓడించింది.
ఇప్పుడు కివీస్‌పై గెలిచి, 25 ఏళ్లుగా నిలిచిన అపజయానికి గట్టిగా బదులు చెప్పాలని అభిమానులు కోరుకుంటున్నారు.
అలాగే, మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత భారత్‌కు మరో ట్రోఫీ అందించిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలవాలని అందరూ ఆశిస్తున్నారు.