IND Vs NZ : ఆ జట్టును తేలిగ్గా తీసుకుంటే ప్రమాదమే.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జోరుకు కివీస్ అడ్డుకట్ట వేయగలదా?
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఓటమి ఎరగని జట్టుగా భారత్ నిలిచింది. బుధవారం జరగబోయే తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచులో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. ఈ టోర్నీలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. వారి జోరును కివీస్ ఏ విధంగా నిలువరించగలదో చూడాలి. మరోవైపు కివీస్ బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. వాంఖడే పిచ్‌పై మరోసారి భారీ స్కోరు నమోదు కావడం ఖాయమని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇండియా-న్యూజిలాండ్ బలబలాలు గురించి తెలుసుకుందాం.
అగ్రస్థానంలో కింగ్ కోహ్లీ
భారత ఆటగాడు విరాట్ కోహ్లి ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడి 594 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇందులో రెండు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలను బాదాడు. న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 565 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలున్నాయి. చివరి ఐదు మ్యాచ్‌లలో రచిన్ రవీంద్ర 70 సగటుతో పరుగులు రాబట్టడం విశేషం. రోహిత్ శర్మ 9 మ్యాచుల్లో 55.89 సగటుతో 503 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలను బాదాడు. చివరి ఐదు మ్యాచుల్లో రోహిత్ శర్మ 47.6 సగటుతో 238 రన్స్ చేశాడు.
అద్భుత ఫామ్ లో శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్
శ్రేయాస్ అయ్యర్ ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడి 421 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలను సాధించాడు. చివరి ఐదు మ్యాచ్‌లలో అయ్యర్ 81 సగటుతో 324 పరుగులను రాబట్టాడు. కేఎల్ రాహుల్ ఈ టోర్నీలో 347 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఓ హాఫ్ సెంచరి ఉంది. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచులో 102 పరుగుల చేసి సత్తా చాటిన విషయం తెలిసిందే. ఈ టోర్నీ జస్ప్రిత్ బుమ్రా (17), మహ్మద్ షమీ (16), రవీంద్ర జడేజా (16), కుల్దీప్ యాదవ్ (14), న్యూజిలాండ్ ఆటగాడు మిచెల్ స్నాంటర్ 16 వికెట్లను పడగొట్టారు.
ఇరు జట్లలోని సభ్యులు
భారత జట్టు రోహిత్ శర్మ (సి), శ్రేయాస్ అయ్యర్, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్ (వికెట్), కెఎల్ రాహుల్ (వికెట్), జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ న్యూజిలాండ్ జట్టు కేన్ విలియమ్సన్ (సి), మార్క్ చాప్మన్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే (వారం), టామ్ బ్లండెల్ (వారం), టామ్ లాథమ్ (వికె), ఇష్ సోధి , కైల్ జామీసన్, లాకీ ఫెర్గూసన్, టిమ్ సౌతీ ట్రెంట్ బౌల్ట్