Page Loader
Kevin Pietersen: భారత జట్టులో మార్పులకు బీసీసీఐ శ్రీకారం.. గంభీర్‌ బృందంలోకి కెవిన్ పీటర్సన్
భారత జట్టులో మార్పులకు బీసీసీఐ శ్రీకారం.. గంభీర్‌ బృందంలోకి కెవిన్ పీటర్సన్

Kevin Pietersen: భారత జట్టులో మార్పులకు బీసీసీఐ శ్రీకారం.. గంభీర్‌ బృందంలోకి కెవిన్ పీటర్సన్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 16, 2025
04:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ జట్టుకు కొత్త బ్యాటింగ్ కోచ్‌ను నియమించే ప్రయత్నాలను బీసీసీఐ ప్రారంభించిందని క్రికెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీసుల్లో భారత బ్యాటింగ్ విభాగం తీవ్రంగా విఫలమైంది. ముఖ్యంగా సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌కు తోడుగా ప్రత్యేక బ్యాటింగ్ కోచ్‌ను నియమించాలని బీసీసీఐ ఆలోచన చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ స్పందించి,టీమిండియాతో పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు. సోషల్ మీడియా ద్వారా ''నేను అందుబాటులో ఉన్నా''అంటూ స్పందించిన పీటర్సన్, 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పి ప్రస్తుతం వ్యాఖ్యాతగా కొనసాగుతున్నాడు.

వివరాలు 

కోచింగ్ అనుభవం లేకపోవడం కెవిన్ పీటర్సన్ కి మైనస్‌

కెవిన్ పీటర్సన్ భారత జట్టుకు తగిన కోచ్ అవుతాడా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. పీటర్సన్‌కు భారత క్రికెట్‌తో మంచి అనుబంధం ఉంది. ఐపీఎల్‌లో తాను ఆటగాడిగా కొనసాగి, ప్రస్తుతం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. 104 టెస్టు మ్యాచ్‌లలో 8,000కుపైగా పరుగులు సాధించి, 23 సెంచరీలు నమోదు చేసిన పీటర్సన్, 136 వన్డేల్లో 4,440 పరుగులతో పాటు 37 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో 1,176 పరుగులు చేశాడు. అయితే, కోచింగ్ అనుభవం లేకపోవడం ఆయనకు మైనస్‌గా మారే అవకాశం ఉంది.

వివరాలు 

బ్యాటింగ్ కోచ్‌ను నియమించని బీసీసీఐ 

గౌతమ్ గంభీర్ తనకు పరిచయమైన వ్యక్తులనే సహాయక సిబ్బందిగా నియమించుకున్నాడు. అసిస్టెంట్ కోచ్‌లుగా అభిషేక్ నాయర్, టెన్ డెస్చటేలను ఎంపిక చేయగా, బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్ వ్యవహరిస్తున్నాడు. గంభీర్ స్వతహాగా బ్యాటర్ కావడంతో బ్యాటింగ్ కోచ్‌ను నియమించలేదు. అయితే, అనిల్ కుంబ్లే, రవిశాస్త్రి, రాహుల్ ద్రవిడ్ హయాంలో బ్యాటింగ్ కోచ్ జట్టులో భాగంగా ఉండేవారు. ఇప్పుడు ఆ పదవిని తిరిగి భర్తీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.