Rahul Dravid: ద్రవిడ్ కోచింగ్ పై సెన్సేషనల్ కామెంట్ చేసిన పార్ధివ్ పటేల్
ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ గా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా తమ తొలి సీజన్‌లో తొలి ఐపీఎల్ టైటిల్‌ను అందించాడు. దీంతో రోహిత్ శర్మ తర్వాత హార్ధిక్ పాండ్యా కే నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని అనుకున్నారు. రోహిత్ అధికారికంగా టీ20 కెప్టెన్‌గా వైదొలగనప్పటికీ టీ20 మ్యాచులకు హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీ చేస్తున్నాడు. తాజాగా విండీస్ పర్యటనలో టీ20లకు హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. విండీస్ పర్యటనలో వరుసగా రెండు టీ20 మ్యాచుల్లో టీమిండియా పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, కోచ్ రాహుల్ ద్రావిడ్‌పై విమర్శలు వెలువెత్తున్నాయి.
ఆసిస్ నెహ్రా లాంటి డైనమిక్ కోచ్ అవసరం
విండీస్ పర్యటనలో హార్ధిక్ పాండ్యా రెండు పెద్ద తప్పులు చేశాడని, నికోలస్ పూరన్ బ్యాటింగ్ చేస్తుండగా పవర్ ప్లే లో అక్షర్ పటేల్ కు బౌలింగ్ ఇవ్వడం సరికాదని మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ పేర్కొన్నారు. రెండో టీ20 మ్యాచులో చాహల్ కి 4 ఓవర్లు ఇవ్వలేదని, గుజరాత్ జట్టుకు పాండ్యా కెప్టెన్సీ చేస్తున్నప్పుడు అతనికి ఆసిస్ నెహ్రా మద్దతు ఉందని గుర్తు చేశాడు. మరోవైపు రాహుల్ ద్రావిడ్ టీ20 క్రికెట్ కు సరైన కోచ్ కాదని, టీ20 క్రికెట్ కు నెహ్రా లాంటి డైనమిక్ కోచ్ అవసరమని పార్ధివ్ వెల్లడించారు.