Team India: స్టార్ క్రికెటర్ల 'అ' ఫార్ములా- కుమారులకు 'A' సిరీస్‌లోనే పేర్లు!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన కొడుకుకు 'అహాన్' అనే పేరు పెట్టారు. ఈ పేరు సంస్కృత భాష నుండి తీసుకోబడింది, దీని అర్థం "మేల్కొలుపు", "అవగాహన". హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ 'ఆహాన్ శర్మ' అనే పేరును సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, టీమిండియా ప్రధాన క్రికెటర్‌ల కుమారుల పేర్లు ఎక్కువగా "A " అక్షరంతో ప్రారంభమవుతున్నాయి. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, హార్డ్ హిట్టర్ హర్థిక్ పాండ్యా , పేసర్ జస్ప్రీత్ బుమ్రా కుమారుల పేర్లు కూడా "A" అనే అక్షరంతోనే ఉన్నాయి. వీరు తమ కుమారులకు హిందూ సంప్రదాయం ప్రకారం పేర్లు పెట్టామని వెల్లడించినప్పటికీ, దీనిలో ఏమైనా న్యూమరాలజీ ఉందా అన్న విషయంపై ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
అభిమాన క్రికెటర్ల పిల్లల పేర్లు ఒకే అక్షరంతో ఉండటంపై ఫాన్స్ ఆనందం
విరాట్ కోహ్లీ తన కుమారుడికి 'అకాయ్' అని పేరు పెట్టాడు, అలాగే జస్ప్రీత్ బుమ్రా తన కొడుకుకు 'అంగద్' అని పేరు పెట్టారు. హార్దిక్ పాండ్య తన కుమారుడికి 'అగస్త్య' అనే పేరు పెట్టాడు. తాజాగా, రోహిత్ శర్మ కూడా తన కొడుకుకు 'అహాన్' అనే పేరు పెట్టారు. టీమ్ ఇండియా ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన క్రికెటర్ల పిల్లల పేర్లు ఒకే అక్షరంతో ఉండటంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొందరు కామెంట్స్ చేస్తూ "స్కూళ్లో ఫస్ట్ బెంచ్‌లో సీట్ కోసం ఇలా పెట్టి ఉంటారు" అని, "నెక్ట్స్ రాహుల్ ఏ పేరు పెడతాడో?" అని ఫన్నీగా స్పందిస్తున్నారు.
అశ్విన్ తన పెద్ద కుమార్తెకు 'అకీరా అనే పేరు
రోహిత్ శర్మ 2015లో రితికా సజ్దేను పెళ్లి చేసుకున్నారు. 2018 డిసెంబర్‌లో వారి కుమార్తె సమైరా జన్మించింది.2024 నవంబరులో,రోహిత్-రితిక జంట రెండో బిడ్డను ఆహ్వానించారు,ఆ చిన్నారికి 'అహాన్'అనే పేరు పెట్టారు. హార్దిక్ పాండ్య 2020లో తండ్రయ్యారు,అతని భార్య నటాషా స్టాన్ కోవిచ్ 2020 జులై 30న మగబిడ్డకు జన్మనిచ్చింది.ఆ చిన్నారికి 'అగస్త్య'అనే పేరు పెట్టారు. విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు 2024 ఫిబ్రవరి 15న మగబిడ్డకు జన్మనిచ్చారు.ఆ చిన్నారికి 'అకాయ్'అనే పేరు పెట్టారు. జస్ప్రీత్ బుమ్రా-సంజనా గణేశన్ దంపతులు 2023 సెప్టెంబరులో తమ కుమారుడికి'అంగద్'అనే పేరు పెట్టారు. ఇలాంటి పేరు పెట్టడమే కాకుండా,సీనియర్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ తన పెద్ద కుమార్తెకు 'అకీరా',మహ్మద్ షమీ తన కూతురికి 'ఐరా'(Aairah)అనే పేరు పెట్టారు.