ఇండియా Vs పాకిస్థాన్ మ్యాచ్‌పై.. షాహిన్ అఫ్రిది షాకింగ్ కామెంట్స్
భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. అక్టోబర్ 5 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య వరల్డ్ కప్ తొలి మ్యాచ్ జరగనుంది. చైన్నైలోని ఎంఏ చిదంబర స్టేడియంలో అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. అదే విధంగా అక్టోబర్ 15న అహ్మదాబాద్ లో భారత్-పాకిస్థాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచుపై ఎక్కువ ఫోకస్ పెట్టడం పట్ల పాకిస్థాన్ స్టార్ బౌలర్ షాహిన్ ఆఫ్రిది షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రపంచకప్ ఎలా గెలవాలి అనే దానిపై దృష్టి సారించాలని షాహిన్ అఫ్రిది పేర్కొన్నారు.
వన్డే ప్రపంచ కప్ ను గెలవడమే తమ లక్ష్యం
ప్రపంచకప్ గెలవడమే పాక్ జట్టు ప్రధాన లక్ష్యమని, భారత్-పాకిస్థాన్ మ్యాచ్ గురించి ఆలోచించడం మానేయాలని, ఎందుకంటే అది ఒక మ్యాచ్ మాత్రమేనని షాహిన్ ఆఫ్రిది చెప్పుకొచ్చాడు. మోకాలి గాయం నుంచి కోలుకున్న తర్వాత పొట్టి క్రికెట్‌లోకి తిరిగొచ్చిన షాహిన్ తన ఫిట్ నెస్ పై సందేహాలను నివృత్తి చేశాడు. 1992లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో పాకిస్థాన్ వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత పాకిస్థాన్ మళ్లీ ప్రపంచ కప్‌ను గెలవలేదు. ఈసారీ ఎలాగైన వరల్డ్ కప్ సాధించాలని పాక్ గట్టి పట్టుదలతో ఉంది. ఇక స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచ కప్ కోసం టీమిండియా హాట్ ఫెవరేట్‌గా బరిలోకి దిగనుంది.