MS Dhoni : సినీ ప్రముఖులను వెనక్కి నెట్టి ఆ విషయంలో అగ్రస్థానంలో నిలిచిన ధోనీ
మైదానంలో ఎంఎస్ ధోని కనిపించే సమయం కేవలం రెండు నెలలు మాత్రమే. మిగతా కాలం అతను వ్యక్తిగత జీవితానికే కేటాయిస్తాడు కానీ, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ విషయంలో మాత్రం బాలీవుడ్ స్టార్లను వెనక్కి నెట్టేసి రికార్డు సొంతం చేసుకున్నాడు. ఏడాది పొడవునా సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉన్న వారితో పోలిస్తే ధోనీ తన బ్రాండ్‌ను మరింతగా పెంచుకున్నాడు. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ అయిన ఎంఎస్ ధోనీ, క్రికెట్ అభిమానులు ముద్దుగా 'తలా' అని పిలుచుకునే ధోనీ, 2024లో భారీ ఎడ్వర్టైజ్‌మెంట్‌లతో తన ప్రభావాన్ని చూపించాడు. ఐదేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోనీ ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. టామ్ మీడియా రీసెర్చ్ ప్రకారం, 42 బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్నాడు.
ఐపీఎల్ లో అభిమానులను అలరించేందుకు సిద్దమవుతున్న ధోనీ
ఎంఎస్ ధోనీ వ్యాపారపరంగా లగ్జరీ కార్ల నుండి అన్నిరకాల బ్రాండ్ల యాడ్స్‌లో నటించాడు. అదే సమయంలో, ఓటు చైతన్యాన్ని ప్రదర్శించేలా ఎలక్షన్ కమిషన్‌తో కలిసి జార్ఖండ్‌లో పనిచేశాడు. ధోనీ ప్రచారం చేసిన కొన్ని ప్రముఖ బ్రాండ్లు: సిట్రాన్, డ్రోన్ స్టార్టప్ గరుడ ఎయిరోస్పేస్, ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన క్లియర్‌ట్రిప్, పెప్సీ కో, ఈమోటోరాడ్, మాస్టర్ కార్డ్, గల్ఫ్ ఆయిల్, ఓరియంట్ ఎలక్ట్రిక్ ఉన్నాయి. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో మరోసారి అభిమానులను అలరించేందుకు ధోనీ సిద్ధమవుతున్నాడు. దీని వల్ల అతని బ్రాండ్ యాడ్స్ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని బిజినెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ధోనీ స్క్రీన్ ప్రెజెన్స్ కేవలం 14 గంటలు
బాలీవుడ్ స్టార్లను మించి, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లో ధోనీ నంబర్‌వన్‌గా నిలిచాడు. బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్ ప్రధానంగా బ్రాండ్లను ప్రమోట్ చేయడంలో ముందుంటారు. అక్షయ్ 22, షారుక్ 20, అమితాబ్ 16 గంటల స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటే, ధోనీ మాత్రం కేవలం 14 గంటలు మాత్రమే. కానీ, బ్రాండ్ల విషయంలో అమితాబ్‌ను తప్పితే మిగతా బాలీవుడ్ స్టార్లు ధోనీ దరిదాపుల్లో కూడా ఉండటం లేదు. 42 ఎండార్స్‌మెంట్‌లతో ధోనీ అగ్రస్థానంలో ఉన్నాడు, తరువాత అమితాబ్ 41, షారుక్ ఖాన్ 34, అక్షయ్ కుమార్ 28, సౌరభ్ గంగూలీ 24, విరాట్ కోహ్లీ 21, రణ్‌వీర్ సింగ్ 21 స్థానాల్లో నిలిచారు.