
BCCI: ఈ ఆటగాళ్లకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు లభించే అవకాశం..
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా పై కసరత్తు ప్రారంభించింది.
ఇప్పటికే మహిళా క్రికెట్ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో యువ ఆటగాళ్లకు పెద్దపీట వేసిన బీసీసీఐ, ఇదే విధానాన్ని పురుషుల కాంట్రాక్ట్ విషయంలోనూ పాటించబోతోంది.
గత సీజన్ నుండి నిలకడగా ప్రదర్శన చూపుతున్న యువ క్రికెటర్లకు ఈసారి వార్షిక కాంట్రాక్ట్ లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ప్రస్తుతంగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 18వ సీజన్‌లో అదరగొడుతున్న ఇద్దరు యువ ఆటగాళ్లు ఇప్పటికే బీసీసీఐ దృష్టిలో ఉన్నట్లు సమాచారం.
ఆస్ట్రేలియాలో నిర్వహించిన టూర్‌లో అద్భుత శతకంతో ఆకట్టుకున్న ఆంధ్రప్రదేశ్ యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి పేరు కూడా ఈ జాబితాలో ఉండే అవకాశముందని చెబుతున్నారు.
వివరాలు
ఐపీఎల్ 18లో రికార్డు స్కోర్ చేసిన అభిషేక్ శర్మ
ఈ సీజన్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఓపెనింగ్ బ్యాట్సమెన్ గా ఆడుతున్న పంజాబీ యువకుడు అభిషేక్ శర్మ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు.
ఉప్పల్ మైదానంలో 141 పరుగులు చేయడం ద్వారా అతను రికార్డు స్కోరు నమోదు చేశాడు.
అంతకముందు భారత్ తరఫున టీ20ల్లో కూడా ఆకర్షణీయ ఇన్నింగ్స్‌లు ఆడి తన సత్తా చాటిన అభిషేక్, ఇప్పుడు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో గ్రేడ్ C కాంట్రాక్ట్‌కి అగ్ర స్థానంలో ఉన్నాడని తెలుస్తోంది.
అది నిజమైతే, ఏడాదికి రూ.1 కోటి వేతనంగా అందుకుంటాడు.
వివరాలు
నితీశ్ రెడ్డికి సెంట్రల్ కాంట్రాక్ట్ అవకాశాలు
ఆల్‌రౌండర్‌గా మంచి ప్రతిభ కనబరుస్తున్న నితీశ్ కుమార్ రెడ్డి కూడా ఈసారి కాంట్రాక్ట్ రేసులో ఉన్నాడు.
ఐపీఎల్ 18లో అతని ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, ఆస్ట్రేలియా గడ్డపై అతను ఆడిన అద్భుత ఇన్నింగ్స్‌లు బీసీసీఐ దృష్టిని ఆకర్షించాయి.
మెల్‌బోర్న్‌లో శతకం బాది రికార్డులు సృష్టించిన ఈ 21 ఏళ్ల యువకుడు ఇప్పటికే ఐదు టెస్టులు, నాలుగు టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
అందువల్ల అతనికి గ్రేడ్ 'C' కాంట్రాక్ట్ లభించే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి.
వివరాలు
హర్షిత్ రానా, శ్రేయస్ అయ్యర్, వరుణ్ చక్రవర్తిలకు కూడా అవకాశాలు
పేస్ బౌలింగ్‌లో రాణిస్తూ ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున మెరుగైన ప్రదర్శన చేస్తున్న హర్షిత్ రాణా ఇప్పటివరకు టీమిండియాకి రెండు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 ఆడాడు.
అదే విధంగా, గతంలో ఛాంపియన్స్ ట్రోఫీలో చెలరేగిన శ్రేయస్ అయ్యర్ మళ్లీ కాంట్రాక్ట్ జాబితాలోకి రానున్నాడు.
ఇక మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా ఈ జాబితాలో చోటుదక్కించుకునే అవకాశముంది.
వివరాలు
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ అర్హత ప్రమాణాలు
బోర్డు నిబంధనల ప్రకారం, సెంట్రల్ కాంట్రాక్ట్‌కి అర్హత పొందాలంటే కనీసం మూడు టెస్టులు లేదా ఎనిమిది వన్డేలు లేదా పది టీ20 మ్యాచ్‌లు ఆడినట్లు ఉండాలి.
ఈ మూడు ఫార్మాట్లలో ఏదైన ఒకదానిలో అయినా ఈ ప్రమాణాలను చేరుకున్న ఆటగాళ్లను మాత్రమే కాంట్రాక్ట్ జాబితాలో బీసీసీఐ పరిగణనలోకి తీసుకుంటుంది.
ఈ నేపథ్యంలో, మరో రెండు లేదా మూడు రోజుల్లో కొత్త వార్షిక కాంట్రాక్ట్ జాబితాను బీసీసీఐ విడుదల చేసే అవకాశముంది.